ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు ఆర్థికవ్యవస్థకు అపారనష్టం

0
255

– రూ.19వేల కోట్లకుపైగా నష్టం
– ప్రతి గంటకు రూ.2.45 కోట్ల నష్టాన్ని మూటకట్టుకున్న టెలికం పరిశ్రమ
– 2014 తర్వాత సేవల్ని నిలిపేసిన ఉదంతాలు374 : తాజా అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ : ఇంటర్నెట్‌ సేవలు పొందటం పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు ఇటీవల కీలకతీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్‌…ప్రాథమికహక్కే కాదు…దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయగల కీలకమైన అంశమని తాజా అధ్యయనం తేల్చింది. 2012-2017 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేయటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారుగా రూ.19,434కోట్లు నష్టం వాటిల్లిందని అధ్యయనం తేల్చింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకానమిక్‌ రిలేషన్స్‌’ అనే మేథోబృందం ఈ అధ్యయనాన్ని జరిపింది. 2012-2020మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా, 16,315 గంటలపాటు ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశారని అధ్యయనం పేర్కొన్నది. ఈ నివేదికలోని మరికొన్ని అంశాలు ఇలా ఉన్నాయి..
కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో, 4 ఆగస్టు 2019 నుంచి అక్కడ ఇంటర్నెట్‌ సేవల్ని పూర్తిగా నిలిపివేశారు. గత 7నెలలుగా కాశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇంత పెద్ద స్థాయిలో ఇంటర్నెట్‌ను నిలిపివేయటం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాశ్మీర్‌ విషయంలో మోడీ సర్కార్‌ చేపట్టిన నిర్బంధాలు జాతీయంగా, అంతర్జాతీయంగా విమర్శలకు దారితీసింది. దాంతో కేంద్రం ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షల్ని పాక్షికంగా ఎత్తేసింది. అయితే కేవలం 2జీ కనెక్టివిటీతో కూడిన ఇంటర్నెట్‌ సేవల్ని ఈఏడాది జనవరి 25నుంచి పునరుద్ధరించటంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇది కేవలం కంటితుడుపు చర్యమాత్రమేనని, 2జీ స్పీడ్‌ ఇంటర్నెట్‌ వేగంతో ఏ పనులూ కావని..నిపుణులు చెబుతున్నారు.

టెలికాం పరిశ్రమకు తీరని నష్టం
ఇండియా, అమెరికా టెలికాం రంగంలో ఆపరేషన్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో రాజన్‌ మాథ్యూస్‌కు 41ఏండ్ల అనుభవముంది. ఆఫ్ఘాన్‌ వైర్‌లెస్‌ కమ్యూనికేషన్స్‌కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. భారత్‌లో ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షలు విధించటంపై ఆయన కీలకవ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సేవలు నిలిపివేయటం ద్వారా టెలికాం ఆపరేటర్లకు ప్రతిగంటకూ రూ.2.45కోట్లు నష్టం వాటిల్లుతుందని ఆయన చెప్పారు. ఇది ప్రత్యక్ష ప్రభావం. పరోక్షంగా ప్రజల ఆర్థిక, సామాజిక లావాదేవీలపై గణనీయ ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు.

” కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి 2020 వరకు 374 మార్లు ఇంటర్నెట్‌ సేవలపై ఆంక్షల్ని విధించింది. ప్రతి కేసులోనూ రాష్ట్ర హోంశాఖ చూపిన కారణం… శాంతిభద్రతల సమస్య. సేవల్ని నిలిపివేసే ముందు పరిస్థితిపై అన్నికో ణాల్లో సమీక్ష జరిగివుంటే 234 మార్లు ఇంటర్నెట్‌ సేవలు బంద్‌ అయ్యేవి కాదు. ప్రభుత్వాలు చివరి అస్త్రంగా మాత్రమే సేవల్ని నిలిపివేయటమనే నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా చేయటం లేదు” అని చెప్పారు.
-రాజన్‌ మాథ్యూస్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సెల్యూలార్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా

Courtesy Nava Telangana

Leave a Reply