మరో మహమ్మారికి సిద్ధమవుదామా?

0
296
  • పర్యావరణాన్ని కాపాడకపోతే తప్పదు!
  • హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు

కరోనా వైరస్‌ ప్రభావానికి ప్రపంచం బిక్కుబిక్కుమంటోంది. ఇప్పటికే పదిలక్షల మందికిపైగా ప్రజలు ఈ వైరస్‌ బారినపడ్డారు. మరణాల సంఖ్య కూడా దూసుకెళుతోంది. వైరస్‌ ఉధృతి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య ఎంతకు చేరుతుందనేది అంచనా వేయడం కూడా కష్టమే. ఒకవైపు కరోనా భయం పూర్తిగా తొలగకముందే, మరో వైరస్‌ దాడికి సిద్ధంగా ఉండాలని శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాల వల్లే వైర్‌సలు వ్యాపిస్తున్నాయనీ, ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులతో ఎలా మెలగాలో నేర్చుకోకపోతే ఇలాంటి ఎన్నో వైర్‌సలను మానవాళి ఎదుర్కోవాల్సి ఉంటుందని హితబోధ చేస్తున్నారు.

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైర్‌సకు మూలం గబ్బిలమే అని శాస్త్రవేత్తలు దాదాపుగా నిర్థారణకు వచ్చారు. గతంలో వచ్చిన ఎబోలా, మెర్స్‌, అంతగా విస్తరించని నిఫా, మార్‌బర్గ్‌ వైర్‌సలకు కూడా గబ్బిలాలే కారణం. హెచ్‌ఐవీ కూడా శతాబ్దం కిందట చింపాంజీ నుంచి మానవజాతికి సంక్రమించింది. ఇన్‌ఫ్లుయెంజా-ఎ కూడా ముందు పక్షులు, తర్వాత పందులు, వాటి నుంచి మనుషులకు వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో లాసా వైర్‌సకు మూలం ఎలుకలు. అయితే ఈ సమస్యలకు కారణం జంతువులు కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మనుషులే అసలు ఈ సంక్షోభాలకు కారణం అంటున్నారు. ఎందుకంటే ఆయా జంతువుల్లో వైర్‌సలు ఎప్పుడూ ఉంటాయి. వన్యప్రాణులతో ప్రపంచవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. వ్యవసాయ ఉత్పత్తిని భారీగా పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, అడవుల నరికివేత, పట్టణీకరణ లాంటి పరిణామాలు మనుషులను జంతువులకు దగ్గరగా తీసుకెళుతున్నాయి. తద్వా రా వాటిలో ఉండే వైర్‌సలు మనుషులకు వ్యాపించడానికి మనమే అవకాశం కల్పిస్తున్నాం. ఈ ప్రక్రియలో కొన్నిసార్లు మనం గెలిచినా, రకరకాల తీవ్రతలతో అనేక వైర స్‌లు మనుషుల మీద విజయం సాధిస్తూనే ఉన్నాయి. విమానాల్లో ప్రయాణిస్తూ కొద్ది గంటల్లోనే మనం ఈ వైర్‌సలను విశ్వవ్యాప్తం చేస్తున్నాం. కరోనా వైరస్‌ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా వన్యప్రాణులతో కలిసి జీవించడం ఎలాగో మానవాళి నేర్చుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వాటి ఆవాసాలను, ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనమీదే ఉందని చెబుతున్నారు. మనం పర్యావరణానికి చేస్తున్న కీడు ఫలితమే తరచుగా ఈ వైరస్‌ వ్యాధులకు కారణమని ఎకో హెల్త్‌ అలయన్స్‌ అనే ప్రజారోగ్య సంస్థకు చెందిన నిపుణుల అభిప్రాయం. అందుకే మళ్లీ ప్రజలు పర్యావరణంతో మమేకం కావాలని వారు చెబుతున్నారు. ప్రస్తుతం సంక్రమిస్తున్న వ్యాధుల్లో 70 శాతం జంతువుల నుంచి వస్తున్నవే. జంతువుల్లో మనకు తెలియని వైర్‌సలు ఇంకా కోట్ల సంఖ్యలో ఉంటాయి. రాబోయే కాలంలో వీటిలో మనుషులకు సోకే అవకాశం ఉన్న వైర్‌సలు ఏవి అనేదానిపై పరిశోధకులు దృష్టి సారిస్తున్నారు. జనసాంద్రత ఎక్కువగా ఉండటం, విభిన్న రకాల మొక్కలు, జంతువులు, వేగంగా మారుతున్న పర్యావరణం వంటివి భవిష్యత్తులో వైర్‌సలకు హాట్‌స్పాట్‌లుగా మారే అవకాశం ఉంది. ఇలాంటి ప్రదేశాల్లోనే ఎలుకలు, గబ్బిలాలు ఎక్కువగా ఉంటాయి. గబ్బిలాలకు అత్యద్భుత రోగనిరోధక శక్తి ఉంటుంది. అందుకే ఎన్నో వైర్‌సలున్నా వాటికేమీ కాదు. కానీ, అవి మనుషులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఎమోరీ యూనివర్సిటీకి చెందిన ఎమోరీ గిలెస్పీ పేర్కొన్నారు. మన స్వయంకృతాపరాధాలతో వాటికి దగ్గరవుతూ వైర్‌సల బారిన  పడుతున్నాం.

పెరుగుతున్న  వైరస్‌ ముప్పు
ఆహారంలో రుచి కోసం, కొన్ని ఔషధాల కోసం వన్యప్రాణుల భాగాలతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరుగుతోంది. చైనాలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన వూహాన్‌ నగరం కూడా ఇలాంటి వ్యాపారానికి కేంద్రమే. చనిపోయిన, కుళ్లిన, అనారోగ్యానికి గురైన జంతువుల భాగాలు ఇలాంటి కేంద్రాల్లో చాలా ఉంటాయి. వీటి నుంచి మనుషులకు తేలిగ్గా వైరస్‌ వ్యాపిస్తుంది. పెరుగుతున్న జనాభా, మాంసాహారానికి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ వల్ల కూడా జంతువుల నుంచి వైర్‌సలు వ్యాపిస్తున్నాయి. ఇది పర్యావరణంపై మరింత ఒత్తిడిని పెంచుతుంది. అటవీ ఉత్పత్తుల వ్యాపారం కూడా పర్యావరణం క్షీణించడానికి మరో ముఖ్య కారణం. దీనివల్ల అడవుల్లో నివసించే ప్రాణుల ఆహారపు అలవాట్లు కూడా మారుతున్నాయి. ఇది తిరిగి మనుషులకు సమస్యలు సృష్టిస్తుంది. వన్యప్రాణుల మాంసం మార్కెట్లను ప్రపంచవ్యాప్తంగా మూసేయాలనే డిమాండ్‌లు వస్తున్నాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply