కమ్యూనిజం సాధ్యమేనా?

0
227

కమ్యూనిస్టు పార్టీ అనేది కార్మిక వర్గానికి తగినంత శిక్షణ ఇవ్వకపోవడం వల్లే, సంక్షేమ పధకాల్ని గొప్ప వరాలుగా భావించే అమాయకత్వంలో వుండిపోతున్నారు శ్రామిక జనాలు.

ఎందుకు కాదు, అదే అవసరం అయితే? ‘సాధ్యమేనా’ అనే ప్రశ్నకి జవాబుని చారిత్రక జ్ఞానం మాత్రమే ఇవ్వగలదు.

‘బానిస సమాజం’లో వుండిన బానిసలు గానీ, బానిసల యజమానులు గానీ, ‘భవిష్యత్తులో బానిసత్వం పోతుంది’ అని నమ్మగలిగే వారేనా? బానిసలు కొంత కాలానికి కార్మికులుగా మారతారనీ, ‘డబ్బు జీతాలు’ ఇస్తేనే పని చేస్తారనీ, తమ డిమాండ్ల కోసం పని ఆపేసి సమ్మెలు చేస్తారనీ, ఇదంతా ఆ నాటి బానిసల కాలంలో ఎవరైనా నమ్మగలిగే వారేనా?

అలాగే, ఒకప్పుడు కిరీటాలు ధరించి సింహాసనాల మీద అధిష్టించిన చక్రవర్తులూ, వారి కోసం యుద్ధాల్లో ప్రాణాలు అర్పించే సైనికులూ, కొంత కాలానికి రాజ్యాధికారపు వారసత్వపు హక్కే పోతుందనీ, కాలక్రమంలో, ఆ పాలకులు, సింహాసనాలు దిగి ‘ఓట్ల’ కోసం ప్రజల ముందు నిలబడతారనీ, ఆ నాడు ఎవరైనా నమ్మగలిగే వారేనా? ఈ నాటి ఓట్ల పద్ధతి, ఆ నాడు నమ్మశక్యం కానిదే కదా?

అలాగే, ఈ నాడు మనకు కూడా భవిష్యత్‌ మార్పులు నమ్మశక్యం కానివి గానూ, ‘ఊహాలోకం’ గానూ, కనపడుతున్నాయి. కానీ ‘శ్రమ దోపిడీ’ అనేదీ, ‘అదనపు విలువ’ అనేదీ, ఊహలు కావు. అవన్నీ ఊహాతీతాలుగా సాగే వాస్తవాలే! కాబట్టి, శ్రామిక వర్గం కాల క్రమం లో, కళ్ళు తెరవడం కూడా ఊహ కాదు! ‘శ్రమ దోపీడీ’యే నిజమైతే, దానిని శ్రామిక వర్గం గ్రహించడమూ, దానిపై, ఆ వర్గ పోరాటమూ కూడా చరిత్ర క్రమాలే అవుతాయి!

శ్రామిక వర్గ పోరాటం ఇంత కాలమూ, సరిగానూ, తగినంతగానూ, ఎందుకు సాగలేదు?- అనేది, తప్పని సరి ప్రశ్న. శ్రామిక వర్గానికి, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక పోవడం వల్ల మాత్రమే. సమానత్వ సంబంధాల సమాజాన్ని ఏర్పర్చవలిసింది, శ్రామిక వర్గమే. ఆ ప్రయత్నాలు, ఆ వర్గ రాజకీయ కార్యాచరణ ద్వారానే జరుగుతాయి. దాని కోసం శ్రామిక వర్గానికి, ఒక రాజకీయ పార్టీ అత్యవసరం. అదే కమ్యూనిస్టు పార్టీ. అది ఎలా వుండాలో, దాని లక్ష్యాలూ, దాని ప్రయత్నాలూ ఎలా వుండాలో సూచిస్తూ, మార్క్సూ, ఎంగెల్సులు వేరు వేరు సందర్భాలలో చెప్పిన అనేక విషయాల్లో కొన్నిటిని ఈ పుస్తకంలో చూస్తాం.

‘‘ఆస్తి పర వర్గాల అధికారానికి వ్యతిరేకంగా జరగవలిసిన పోరాటంలో కార్మిక వర్గం, తమ పార్టీని, ఆస్తిపర వర్గాలు ఏర్పర్చుకున్న అన్ని పాత పార్టీలకూ భిన్నమైన పార్టీగా, ఏర్పడినప్పుడు మాత్రమే అది కార్మిక వర్గ పార్టీగా పని చేయగలదు.’’ (మార్క్సు – ఎంగెల్సులు.)

ఏ దేశంలో నైనా, కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగానీ, సమర్ధకులు గానీ, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. ‘మన పార్టీ బూర్జువా పార్టీ లాగానే వుందా, దాని నించీ భిన్నంగా వుందా? పెత్తందారీ పోకడలూ; వ్యక్తి పూజలూ; నాయకత్వ స్తానాలలోనూ, ప్రత్యేక బాధ్యతలలోనూ, ఎప్పుడూ ఒకే వ్యక్తి గానీ, ఒకే బృఁదం గానీ వృద్ధాప్యం వరకో, మరణం వరకో అంటి పెట్టుకుని వుండడమూ; పార్టీ నాయకులకు ప్రత్యేక సదుపాయాలూ, హక్కులూ వుండడమూ, పొరపాట్ల పై విమర్శలూ-స్వయం విమర్శలూ పాటించక పోవడం – వంటి అవలక్షణాల పట్ల విమర్శనా దృష్టితో వుండాలి. ఇదే లేకపోతే, ఇక సమ సమాజ సంబంధాలు అబద్దాలే!

 

‘‘పాలక వర్గాల రాజకీయ అధికారానికి వ్యతిరేకంగా, నిరంతర ప్రచారం ద్వారానూ, పాలక వర్గాల విధానాల పట్ల శతృపూరిత వైఖరిని ప్రదర్శించడం ద్వారానూ, కార్మిక వర్గానికి శిక్షణ ఇచ్చి తీరాలి. లేకపోతే, అది (కార్మిక వర్గం) పాలక వర్గాల చేతిలో ఆట వస్తువుగా వుండిపోతుంది.’’ (మార్క్స్‌) కమ్యూనిస్టు పార్టీ అనేది కార్మిక వర్గానికి తగినంత శిక్షణ ఇవ్వక పోవడం వల్లే, ఇప్పటికీ పాలక వర్గపు విధానాలలో వుండే మోసాల్ని గ్రహించలేకపోతోఁది. అందుకే సంక్షేమ పధకాల్ని గొప్ప వరాలుగా భావించే అమాయకత్వంలో వుండి పోతున్నారు శ్రామిక జనాలు.

‘‘కార్మికుల పార్టీ ఎన్నడూ ఏ బూర్జువా పార్టీకీ తోకపట్టుకు పోయేది కారాదు. అది స్వతంత్రంగా తన లక్ష్యాన్నీ, తన సొంత విధానాన్నీ కలిగి వుండాలి.’’ (ఎంగెల్స్‌) ‘‘నాయకుల కర్తవ్యం ఏమిటంటే, సోషలిజం ఒక సైన్స్‌ అయింది గనుక, దానిని సైన్స్‌గా అనుసరించడమూ, కార్మిక జనాలలో వ్యాప్తి చేయడమూనూ.’’ (ఎంగెల్సు) అంటే, నాయకత్వ స్తానాలలో వుండే వారికి ముందుగా, సిద్ధాంతం తెలిసి వుంటేనే, దాన్ని కార్మిక జనాలలో వ్యాప్తి చేయగలుగుతారు. ఈ నాడుకూడా, లాభాలూ, కౌళ్ళూ, వడ్డీలూ అనే వాటికి మూలం ఏమిటో, ఇప్పుడున్న శ్రమ విభనలో వున్న తప్పు ఏమిటో, దాన్ని పూర్తిగా ఎలా మార్చవలసి వుంటుందో తెలియని నాయకులు ఎందరో!

‘‘వర్గ చైతన్యం లేని శ్రామిక జనాలకు, అతి కొద్ది మంది చైతన్యవంతులైనవారు మాత్రమే నాయకత్వం వహించి చేసే ఆకస్మిక దాడులూ; విప్లవ పోరాటాలూ; చేసే కాలం గతించింది. సామాజిక వ్యవస్థను సంపూర్ణంగా పరివర్తన చెందించడం – అనేదే ప్రశ్న అయినప్పుడు, శ్రామిక జనాలు తమంతట తాము వర్గ పోరాటంలో వుండి తీరాలి! సమస్య ఏదో, తాము దేని కోసం పోరాడుతున్నారో, అప్పటికే గ్రహించి వుండి తీరాలి! ఏమి చేయాలో, జనాలు అర్ధం చేసుకోవాలీ అంటే, సుదీర్ఘమైన, నిరంతరమైన కృషి అవసరం.’’ (ఎంగెల్స్‌) శ్రామిక ప్రజలకి, తాము పోరాటాలు ఎందుకు చెయ్యాలో, దేన్ని సాధించాలో తెలియాలి-అని ఎంగెల్సు నొక్కి చెపుతున్నాడు. కార్మిక వర్గానికి ప్రధానంగా కావల్సింది ‘కాపిటల్‌’లో మార్క్స్‌ చెప్పిన సిద్ధాంతమే. ఆ పుస్తకంలో మార్క్సు కేవలం పెట్టుబడిదారీ ఆర్ధిక శాస్త్రాన్ని విమర్శించి వూరుకోలేదు. కమ్యూనిస్టులు, సమానత్వ సంబంధాల్ని ఎలా ఏర్పర్చు కోవాలో, ఆ విషయాలన్నీ వివరించాడు. మార్క్సు తర్వాత, ఆ బాధ్యత అంతా ఎంగెల్సు తీసుకున్నాడు. వాటన్నినీ ఒక దగ్గిర చేర్చి, వాటి సారాంశాన్ని అర్ధం చేసుకోవడం కోసం చేసిన ప్రయత్నమే, ఈ సంకలనం.

(రంగనాయకమ్మ సంకలనం చేసిన కొత్త పుస్తకం ‘కమ్యూనిస్టు సమాజాన్ని చూద్దాం!’ నించి కొన్ని భాగాలు)

Courtesy Andhrajyothi

Leave a Reply