- రాష్ట్రంలో అసలు ప్రభుత్వం పనిచేస్తోందా?
- ‘ప్రైవేటు’ దోపిడీపై మౌనమెందుకు?
- ఆస్తులు అమ్ముకున్నా.. ప్రాణాలు దక్కట్లేదు
- ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్న హామీ ఏమైంది?
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థతే కారణం
- ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం
- ఆక్సిజన్ బెడ్లు, రెమ్‌డెసివిర్ కోసం విజ్ఞప్తులు
- ఆందోళన వద్దు.. చర్యలు తీసుకుంటున్నాం
- ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమంలో మంత్రి భరోసా
హైదరాబాద్ : ‘‘రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తోందా?’’.. ‘‘వైద్యం అందక చావాల్సిందేనా?’’.. ‘‘ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీపై ఎందుకు మౌనంగా ఉంటున్నారు?’’.. ‘‘కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తామన్న సీఎం హామీ ఏమైంది?’’.. అంటూ నెటిజన్లు ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఆక్సిజన్ కొరతతో.. ఆస్పత్రుల్లో పడకలు లేక జనాలు పిట్టల్లా రాలిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దవాఖానాల్లోనూ పడకల్లేవంటూ వెనక్కి పంపుతుండడంతో.. పేదలు ఇళ్లలోనే చనిపోతున్నారని ఆందోళన చెందారు. ఆస్తులు అమ్ముకుని.. కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులకు ధారపోసినా.. ప్రాణాలు దక్కే పరిస్థితి లేదంటూ వాపోయారు. రాష్ట్రంలో కొవిడ్ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గురువారం సాయంత్రం 6-8 గంటల మధ్య వరకు ట్విటర్ ద్వారా ప్రజలతో సంభాషించారు. సమస్యలు, సూచనలు, సలహాలు తెలపాలని కోరగా.. వేల మంది నెటిజన్లు స్పందించారు. కరోనా సెకండ్‌వేవ్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రభావితమవుతున్నారని, ప్రతి కుటుంబం కరోనా బారిన పడుతోందని నెటిజన్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్థత వల్లే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ మండిపడ్డారు. అధికశాతం నెటిజన్లు ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై నిలదీశారు. జీవిత కాలమంతా కూడబెట్టిన ఆస్తులు, సొమ్మును ఆస్పత్రులకు పెట్టాల్సిందేనా? కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో ఎప్పుడు చేరుస్తారంటూ ప్రశ్నించారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్, వ్యాక్సినేషన్ కొరతపైనా నిలదీశారు. కొవిడ్ బారిన పడ్డ తమవారికి ఆక్సిజన్ బెడ్లు, రెమ్‌డెసివిర్ అందించాలంటూ విన్నపాలు చేశారు. థర్డ్‌వేవ్ ప్రభావం చిన్నారులపై ఎక్కువగా ఉండే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీన్ని ఎలా ఎదుర్కొంటారని పలువురు ప్రశ్నించారు. అయితే.. కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై వచ్చిన ఫిర్యాదులకు మంత్రి సమాధానాలను దాటవేశారు.
మంత్రి సమాధానాలివి..
రాష్ట్రంలో కేసులు తక్కువే: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసుల తీవ్రత తక్కువగా ఉందని, అందుకే ఇక్కడ పెద్దగా సమస్య లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లోనూ ఇతర రాష్ట్రాల కంటే ముందున్నామన్నారు.
రెమ్‌డెసివిర్ కొరత: రెమ్‌డెసివిర్‌ను ప్రైవేటు ఆస్పత్రులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. వీటిపై ఆడిట్ నిర్వహిస్తున్నాం. అవసరమైతేనే రెమ్‌డెసివిర్‌ను వినియోగించాలని ప్రైవేటు ఆస్పత్రులను కోరుతున్నాం. ప్రభుత్వాస్పత్రుల్లో ఈ ఇంజక్షన్ కొరత లేదు.
ఆక్సిజన్ కొరత: ప్రాణవాయువు సమస్య ఒక్క తెలంగాణకు సంబంధించినదే కాదు. రాష్ట్రాలకు సరిపడేంత ఆక్సిజన్ అందించడం ఇప్పుడు దేశంలో సవాల్‌గా మారింది. ఈ అంశం రాష్ట్రాల పరిధిలో లేదు.
వ్యాక్సినేషన్: దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఉంది. దీనిపై కేంద్రం, వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో మాట్లాడుతున్నాం. జనాభాకి సరిపడా వ్యాక్సిన్‌ను అందిస్తే.. రాష్ట్రంలో 45 రోజుల్లో అందరికీ టీకా ఇచ్చే వసతులు, సామర్థత మనకు ఉంది. జూలై-ఆగస్టు కల్లా సమస్య తీరవచ్చు.
5-18 వయస్కులకూ వ్యాక్సిన్: చిన్నారులపై థర్డ్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో.. కొవాక్సిన్ ప్రయోగాలు 5-18 ఏళ్ల వారిపై కొనసాగుతున్నాయి. వాటి ఫలితాలు రాగానే.. ఆ ఏజ్‌గ్రూప్ వారికీ టీకా అర్హత లభిస్తుంది.
కరోనాతో బలహీనంగా ఉంది: నాకు పాజిటివ్ అని తేలాక.. ఏడు రోజులపాటు జ్వరంతో బాధపడ్డా. ఊపిరితిత్తుల్లో కొంత ఇన్ఫెక్షన్ కనిపించింది. బ్లడ్‌షుగర్, బీపీ నియంత్రణ సవాలుగా ఉండేది. డాక్టర్ల సలహాలు, సూచనలతో కరోనాను జయించాను. అయితే.. ఇప్పుడు కొంత బలహీనంగా అనిపిస్తోంది.
ఇలా జయించండి: కొవిడ్ సోకిన వాళ్లు చికిత్స కోసం వైద్యుల సలహాలు తీసుకోండి. వాట్సాప్ చిట్కాలు వద్దు. సొంత వైద్యం అస్సలు వద్దు. కరోనా చికిత్స సమయంలో వార్తలను చూడవద్దు. సోషల్ మీడియాలో భయాందోళనలు కనిపించే పోస్టులను చదవొద్దు. సాధ్యమైనంత వరకు ఎక్కువ వ్యాయామం చేయండి. కొవిడ్‌ను జయించిన తర్వాత కూడా మానసికంగా ధృఢంగా ఉండాల్సిన అవసరముంది.
భేష్.. మంచి ఆలోచన
కొవిడ్ నియంత్రణ, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి పలువురు ఇచ్చిన సూచనలను మంత్రి స్వాగతించారు. ‘‘మంచి సలహా.. తప్పకుండా ప్రయత్నిస్తాం..’’ అంటూ వారిని అభినందించారు. ఉస్మానియా వర్సిటీలోని హెల్త్‌సెంటర్, ఆర్టీసీ ఆస్పత్రిలో సిబ్బందితో పాటు అన్ని వసతులు సిద్ధంగా ఉన్నాయని, వాటిని కొవిడ్ చికిత్సకు ఉపయోగించుకోవచ్చని నెటిజన్లు కోరగా.. వెంటనే వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కరోనా కాటుకు తల్లిదండ్రులను పోగొట్టుకుని, అనాథలైన అనేక మంది చిన్నారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరగా.. తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బదులిచ్చారు.
Courtesy Andhrajyothi