ప్రశ్నించడమే నేరమా?

0
324

సమాజ హితం కోసం ప్రభుత్వ నిర్ణయాలలోని లోపాలను, లొసుగులను పాలకుల దృష్టికి తీసుకురావడానికి మీడియా ప్రయత్నించినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అసహనం ఎందుకు హద్దులు దాటుతుంది. తమ లోపాలను ఎవరూ ఎత్తిచూపకూడదు? ఎవరూ ప్రశ్నించకూడదు? అనే విపరీత మనస్తత్వంతో ప్రశ్నించినవారిని చీదరించుకోవడం, ఎగతాళి చేయడం, అవమానించడం, బెదిరించడం ముఖ్యమంత్రి స్థాయికి తగదు. గతంలో కూడా మెడలు విరిచేస్తాం, 10 కిలోమీటర్ల లోతున పాతరేస్తామని మీడియాను బెదిరించిన చరిత్ర కేసీఆర్‌ది. ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన కేసీఆర్ వాస్తవాలు వెల్లడిస్తే తట్టుకోలేకపోతున్నారు. టీవీ ఛానల్స్‌ ఏర్పాటు చేసుకొని రక్షణ కవచాలుగా వాడుకొంటూ ప్రజల్ని ఉద్ధరిస్తున్నట్లు బాకాలు ఊదుకొంటున్నారు.

వైద్యులకు రక్షణ ఏది?.. అని వార్త రాస్తే జీర్ణించుకోలేక వార్త రాసినవారికి కరోనా సోకాలని శపిస్తూ చిందులు తొక్కారు. మీడియా ఉన్నది పాలకుల లోపాలు ఎత్తి చూపడానికే కానీ పాలకులకు భజన చేయడానికి కాదుకదా? లోపాలు, తప్పులు, అక్రమాలు, అవినీతి ఎత్తి చూపడం మీడియా వృత్తి ధర్మం. మీరు ఏం చేసినా నోరు ఎత్తవద్దని హూంకరించగానే మీడియా చేతులు కట్టుకొని నిలబడాలా? వాస్తవాలు ప్రజల ముందుంచడం నేరమా? మీడియా మౌనంగా ఉండి మీ లోపాల్లో, ఘోరాల్లో, నేరాల్లో పాలుపంచుకోవాలా? తప్పులు ఎత్తి చూపినప్పుడు, ప్రశ్నించినప్పుడు మీ వైపు నుండి సరిదిద్దుకోవాల్సిన భాధ్యత లేదా? కరోనా కట్టడిలో భాగంగా డాక్టర్లకు, నర్సులకు రక్షణ ఏది అంటూ లోపం ఎత్తి చూపినప్పుడు వివరణ ఇవడమో, రక్షణ కల్పించడమో చెయ్యాలి. అంతే తప్ప కరోనా రోగం రావాలని, చనిపోవాలని శపించడం ఏమిటి?. మీకు నచ్చినట్లు రాయక పోతే గుణపాఠం చెపుతారా? తండ్రి లాంటి ముఖ్యమంత్రే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? మీడియా సమాజం, ప్రజల మేలు కోరాలి తప్ప ప్రభుత్వానికి మేలు చేయాలనుకోవడం భాధ్యతా రాహిత్యం. ప్రజాస్వామ్యంలో పత్రికలు, టీవీ ఛానల్స్‌ ఏర్పాటు చేసుకోవడానికి ఎవరికైనా హక్కు వుంది. దానిని ఎవరూ తప్పు పట్టడంలేదు. కానీ మీ సొంత మీడియా, మీ బినామీ మీడియా మీకు నచ్చని వారిపై ఉన్నది, లేనిది పోగేసి రాస్తున్న కథనాలను ఎలా సమర్ధించుకొంటారు? ప్రజల కోసం మీడియా అన్న భావన పోయి మీ కోసమే మీడియా అన్న భావన కల్పించడం ఏమిటి? ఈ జాడ్యం దేశమంతా ఉన్నప్పటికీ ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత వేళ్లూనుకొంది.

ఉన్నది రాస్తే ఉలుకెందుకు? నిప్పును, రోగాన్ని దాచి పెడితే మొదటికే మోసం అన్న విషయాన్ని విస్మరించడం మంచిది కాదు. తన అనుకూల మీడియా చెప్పినవే వాస్తవాలుగా ప్రజలంతా నమ్మాలన్నది కేసీఆర్ ఉద్దేశంగా కనిపిస్తుంది. తెలంగాణ సెంటిమెంటుతో అందరిని అదిరించి, బెదిరించి సాగించుకొనడానికి అలవాటు పడ్డ కేసీఆర్‌ లోపాలు ఎత్తి చూపిన మీడియాను ఆ కోవలోనే బెదిరించారు. ఆర్థికంగా దెబ్బతీయాలని యోచిస్తూన్నారు. కొన్ని మీడియా వ్యవస్థలు ఆయనకి గులాంగిరీ చేస్తున్నాయి. ఆ బాటలోనే అందరూ చేయాలనుకోవడం అవివేకం. మీకు భజన చెయ్యాలనుకోవడం, భుజాన మోయాలి అనుకోవడానికి… మీడియా మీ గడిలో బానిస కాదు. మీడియా పొరపాటు చేస్తే చర్య తీసుకోండి. తప్పులు సరి చేసుకోవడం విజ్ఞుల లక్షణం, ఎదురుదాడి చేయడం మూర్ఖుల లక్షణం. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు తనను కాపాడాలని, అండగా నిలవాలని కోరిన విషయం కేసీఆర్‌ విస్మరిస్తే ఎలా? ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీడియా. దానిని గడిలో కట్టాలనుకోవడం దుస్సాహసమే, మేము చెప్పిందే వేదం, చేసిందే బ్రహ్మాండం అన్న విధంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో చెల్లదు.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్న మీడియా సంస్థలు ప్రతిరోజూ గిట్టనివారిపై దుర్గంధం వెదజల్లడమే పనిగా పెట్టుకున్నాయి. అసత్యాలతో, అభూత కల్పనలతో, తప్పుడు రాతలతో బరితెగిస్తున్నాయి. ఒక నిజం చెప్పి దాని మాటున పది అబద్ధాలు ప్రచురించడంలో వారి మీడియా ఆరితేరింది. తమ ఆలోచనలను ప్రజలపై రుద్దే సాధనంగా మారింది. మీ రాజకీయ మీడియా ఎవరి మీదనైనా విషం కక్కవచ్చు కానీ ఇతర మీడియా మిమ్మల్ని ప్రశ్నించకూడదు, రాయకూడదా? రాజకీయ పార్టీల అధినేతల సొంత మీడియా పెడపోకడలు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. తమ విధానాలే గొప్పవని, తామే గొప్పవారిమని, తాము మాత్రమే జనం కోసం అన్నట్లు, జనం కోసం పుట్టినట్లు తమ రచనా కౌశలంతో ప్రజలను నమ్మించడానికి యత్నిస్తున్నారు. అబద్ధాలతో, కుతర్కవాదనలతో ప్రజల కళ్ళకి గంతలు కడుతున్నారు. తాము మాత్రమే ప్రజా పక్షమని, ఇతరులు ప్రజాపక్షం కాదని వారి మీడియా స్వోత్కర్షలు వల్లిస్తుంది. కొన్ని వర్గాలను, కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టడం వల్ల సమాజంలో వైషమ్యాలు పెంచి విష బీజాలు నాటబడుతున్నాయి.

రాజకీయ పార్టీలు మీడియా ముసుగు వేసుకొని ప్రజాస్వామ్యానికే మూల స్తంభంగా నిలిచిన పత్రిక రంగాన్ని తమకు ఊడిగం చేసేందుకు ఉపయోగించుకుంటున్నాయి. అట్లాగే కొందరు పాత్రికేయులు దురుద్దేశంతో అవాస్తవాలు రాస్తూ రాజకీయ పార్టీలకు మద్దతు పలుకుతున్నారు. ఈ విధంగా మీడియా రాజకీయ పార్టీలు, నాయకుల స్వీయ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునే సాధనంగా మారింది. ఇది మంచి పరిణామం కాదు.

నన్నూరి నర్సిరెడ్డి
ప్రధాన కార్యదర్శి, తెలుగుదేశం పార్టీ

Courtesy AndhraJyothy

Leave a Reply