ధారవిలో భౌతిక దూరం సాధ్యమేనా?

0
293

ముంబై: ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవిలో కరోనా వైరస్‌ వ్యాప్తి భయాందోళన రేపుతోంది. జనసాంద్రత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 55 మందికి కోవిడ్‌-19 సోకింది. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 2.4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ధారావిలో 60,000 కుటుంబాలు, 8.5 లక్షల మంది నివాసంగా ఉంటున్నారు. భూమి మీద అత్యంత దట్టమైన జనావాస ప్రాంతమైన ధారవిలో కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించడం ప్రభుత్వ యంత్రాగానికి సవాల్‌గా మారింది. ఎక్కువ జన సాంద్రత కలిగిన ధారవిలో ‘కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌’ ద్వారా కోవిడ్‌ విజృంభించే అవకాశముందన్న భయాందోళన వ్యక్తమవుతున్నాయి.

అత్యంత ఇరుకైన గదుల్లో పదుల సంఖ్యలో ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు. ధారవిలో ఉండేవారు పరస్పరం చాలా దగ్గరగా మసలుకుంటూ ఉంటారు. దీంతో ఇక్కడ భౌతిక దూరం పాటించాలంటే సాధ్యమయ్యే పనికాదని విశ్లేషకులు అంంటున్నారు. కాసేపు బయటకు వద్దామంటే లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు వీరిని ఇంట్లోంచి బయటకే రానీయడం లేదు. ‘మా ముగ్గురు పిల్లలతో కలిసి ఇరుకు గదిలో ఏడుగురం ఉంటున్నాం. రోజంతా గదిలోనే ఉండాల్సి రావడంతో రెండేళ్ల పిల్లాడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పచ్చిగాలి కోసం వాడిని నా భర్తకు కాసేపు బయటకు తీసుకెళ్తున్నాడు. మిగతా ఇద్దరు పిల్లలు రోజంతా టీవీలో కార్టూన్లు చూస్తూ ఇంట్లోనే గడుపుతున్నారు.

ధారవిలో భౌతిక దూరం పాటించడం అనేది జోక్‌ లాంటిదని అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ధారవిలో గదులు చాలా చిన్నవిగా ఉంటాయని, వెంటిలేషన్‌ కూడా ఉండకపోవడంతో వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడి వారు ఇళ్లల్లోంచి బయటకు రావడం మినహా మరోదారి లేదని సామాజిక కార్యకర్తలు అంటున్నారు. అయితే పాలకులు మాత్రం ధారవిలో కరోనా వ్యాప్తిని అరికట్టడమే తమ ముందున్న కర్తవ్యమని చెబుతున్నారు. శానిటేషన్‌, కంటైన్‌మెంట్‌, ఐసోలేషన్‌ ద్వారా కోవిడ్‌ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వర్షా గైక్వాడ్‌ తెలిపారు.

కాగా, ధారవిలోని బలిగ నగర్‌లో ఏప్రిల్‌ 1న మొట్టమొదటి కరోనా పాజిటివ్‌ నమోదైంది. తబ్లిగి జమాత్‌ సభ్యులకు ఆశ్రయం ఇవ్వడంతో బాధితుడికి కోవిడ్‌ సోకినట్టు పోలీసులు తెలిపారు. ముకుంద్‌ నగర్‌లో మూడో వెలుగులోకి వచ్చిన తర్వాతే తబ్లిగి జమాత్‌ లింకు బయటపడింది. దీంతో ఇప్పటివరకు 55 మంది కరోనా బారిన పడ్డారు. ఈ సంఖ్య మరింత పెరగకుండా చర్యలు చేపడుతున్న అధి​కారులకు ధారవిలో అధిక జనసాంద్రత పెద్ద సమస్యగా మారింది. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి లేకపోవడంతో ధారవిలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. కరోనా మహమ్మారి నివారణ చర్యలతో పాటు తమ ఆకలి తీర్చేచాలని ధారవి వాసులు దీనంగా వేడుకుంటున్నారు.

Leave a Reply