కాషాయ మూకదాడులకు ముగింపులేదా?

0
187

దేశంలో మతోన్మాద మూకల అకృత్యాలు శృతిమించిపోతున్నాయి. కేవలం వారి పుట్టుక కారణంగా సాటి మనుషులను కిరాతకంగా పొట్టన పెట్టుకుంటున్నారు. తాజాగా జార్ఖండ్‌కు చెందిన తబ్రేజ్‌ అన్సారీ (24) అనే యువకుడు మూకదాడికి బలైపోయాడు. జార్ఖండ్‌ సరారుకేలా జిల్లా కాడండిహా గ్రామానికి చెందిన అన్సారీ ఈ నెల 17 రాత్రి పొరుగూరి నుంచి తన గ్రామానికి వస్తుండగా దొంగగా అనుమానించిన మూక అతడిని కరెంటు స్తంభానికి కట్టేసి దారుణంగా హింసించింది. దెబ్బలకు తాళలేక అల్లాడుతున్న అన్సారీ చేత బలవంతంగా ‘జై శ్రీరామ్‌.. జై హనుమాన్‌’ అంటూ నినాదాలు ఇప్పించింది. ఆ మరుసటి రోజు అన్సారీని పోలీసులకు అప్పగించగా, పోలీసులు ఎలాంటి వైద్యం అందించకుండా జైలుకు తరలించారు. జైలులో సైతం సరైన వైద్యం అందకపోవడంతో ఆ అభాగ్యుడు 22వ తేదీ మరణించాడు. అన్సారీతో పాటు ఉన్న ఆయన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కనిపించకుండా పోయారు. వారిని కూడా చంపేసి ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు. మృతుని గ్రామానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో కేంద్ర గిరిజన శాఖా మంత్రి అర్జున్‌ ముండే స్వగ్రామం ఉంది. అన్సారీ మృతిచెందిన సమయంలో మంత్రి స్వగ్రామంలోనే ఉన్నా, కనీసం బాధితుడి కుటుంబాన్ని పరామర్శించలేదు. కాగా, జార్ఖండ్‌ డీజీపీ నారాయణ్‌ చౌబే అస్సలు అది మూకదాడే కాదని ప్రకటించారు. ఈ సంఘటన పార్లమెంటులో చర్చకురాగా, స్పందించిన ప్రధాని మోడీ ఇదొక సాధారణ సంఘటనగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. మూకదాడులకు జార్ఖండ్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చెదురుమదురు సంఘటనను అడ్డుపెట్టుకుని ఓ రాష్ట్రాన్ని నిందించడం, అవమానపరచడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి దాడులు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే అంటూ కేరళ, పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల సరసన ఈ మూక దాడిని చేర్చి సాధారణీకరించే ప్రయత్నం చేసి తన స్వభావాన్ని బయట పెట్టుకున్నారు.
జార్ఖండ్‌లో బీజేపీ పాలనలో ఇప్పటికి 12మంది మూకదాడుల్లో చనిపోయారు. వీరిలో 10మంది ముస్లింలు కాగా, ఇద్దరు గిరిజనులు. ఈ దాడుల్లోని నిందితులకు బీజేపీ, వీహెచ్‌పీలతో సంబంధ మున్నట్టు బయటపడింది. పాలక బీజేపీ అండదండలతోనే ఈ మూకదాడులు జరుగుతున్నాయన్నది సత్యం. గతంలో రాంగడ్‌లో అలీముద్దీన్‌పై జరిగిన మూకదాడి కేసులో జైలునుంచి బెయిల్‌ విడుదలైన నిందితులకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని నాటి మంత్రి జయంత్‌ సిన్హా పూలమాలలు వేసి స్వాగతించడం ఇందుకు నిదర్శనం.
ఇతర మతస్తులను, ముఖ్యంగా ముస్లింలను అవమానించేందుకు శ్రీరాముడిని, హనుమంతుడిని వాడుకోవడం మతోన్మాద మూకలకు పరిపాటిగా మారింది. సాక్షాత్తూ పార్లమెంట్‌లోనే ఒవైసీ తదితర ముస్లిం సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా ‘జైశ్రీరామ్‌’ అంటూ నినదిస్తూ బీజేపీ సభ్యులు వారిని అపహాస్యం చేశారు. వారిని దేశవ్యాప్తంగా ఉన్న వారి కార్యకర్తలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. విద్వేష రాజకీయాల ద్వారా అధికారాన్ని సొంతం చేసుకున్న కమలనాథులు, ఆ అధికారాన్ని పరమత ద్వేషం ద్వారా పొడిగించుకోవాలనుకుంటున్నారు. దేశంలో మెజారిటీ ప్రజలైన హిందువులకు ముస్లింలను శతృవులుగా చిత్రీకరించడం ద్వారా ఒక అభద్రతా భావాన్ని సృష్టించి, తమ ఏలికలోనే మీకు భద్రత ఉంటుందని నమ్మించి ఓట్లు దండుకునేందుకు పన్నాగం పన్నుతున్నారు. తమ అధికారం కోసం, ఆధిపత్యం కోసం అమాయకులను దారుణంగా హింసించడం, చంపడం దుర్మార్గం. ఈ దుర్మార్గాలు చేసినందుకు సంఫ్‌ుపరివార్‌ శక్తులు ఏమాత్రం చింతించడం లేదు. పైపెచ్చు ఇలాంటి దాడులు చేయడం తమ హక్కుగా, అనివార్యంగా ప్రచారం చేసుకుంటూ తమ ఘనకార్యాలకు మురిసిపోతున్నారు. మానవత్వం, మనిషితనం ఉన్న వారెవ్వరూ ఇలాంటి దారుణాలకి పాల్పడరు. అయితే, ఇలాంటి దుర్మార్గాల సమర్ధుకులే ఇప్పటి మన పాలకులు. నేరస్తులకు పాలకుల అండ దొరికితే నేరం వ్యవస్థీకృతమవుతుంది. వ్యవస్థీకృతమైన నేరం దేశాన్ని చీకటి యుగంలోకి లాక్కెళుతుంది. ఈ దుస్థితి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు, దుర్మార్గుల దాడుల నుంచి సాటి మనుషులను కాపాడుకునేందుకూ ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన సమయమిది. ఏ మనిషి ఏ మతంలో, కులంలో పుడతాడో ఎవరికీ తెలియదు. తాను పుట్టిన కుల, మతాల ఆధారంగా అవమానాలు ఎదుర్కోవడం, దాడులకు గురికావడం, చివరకు ప్రాణాలు కోల్పోవడం మన రాజ్యాంగం అనుమతించదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసి పాలన సాగిస్తున్న పెద్దలే పరమ దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్నప్పుడు, కేవలం ప్రజా స్పందన మాత్రమే వారికి అడ్డుకట్ట వేయగలదు. అవును! మానవత్వమున్న ప్రతి ఒక్కరూ స్పందించాలి. ఈ దుర్మార్గాలను ప్రశ్నించాలి. దుర్మార్గులను ఎదుర్కోవాలి. మంచితనాన్నీ, మనిషితనాన్నీ బతికించుకోవాలి.

(నవ తెలంగాణసౌజన్యంతో)

Leave a Reply