సత్యవాక్కులూ కోర్టు ధిక్కారమేనా?

0
41
యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)

న్యాయకోవిదుడు ప్రశాంత్ భూషణ్‌కు వ్యతిరేకంగా పదమూడేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కారం కేసును మూసివేయాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఈ ఆదేశం ఎంతో ఉపశమనం కలిగించింది. స్వాగతించాల్సిన నిర్ణయం, సందేహం లేదు. అయితే ఇదే సమయంలో నన్ను చాలా విచారం కూడా ఆవహించింది. ఒక దశాబ్దానికి పైగా ఉపేక్షించిన ఒక ముఖ్యమైన విషయంపై విచారణ జరిపేందుకు లభించిన ఒక చరిత్రాత్మక అవకాశాన్ని కూడా సుప్రీంకోర్టు జారవిడిచింది. ప్రశాంత్ భూషణ్‌పై కోర్టు ధిక్కారం కేసును మూసివేయడం వల్ల సుప్రీం కోర్టులో దాఖలైన కొన్ని ప్రమాదకర అఫిడవిట్ లపై ఇక ఎప్పటికీ విచారణ జరిగేందుకు ఆస్కారం లేకుండా పోయింది. అవన్నీ మాజీ ప్రధాన న్యాయమూర్తుల ‘అవినీతి’కి సంబంధించినవే కావడం గమనార్హం.

2020లో సుప్రీం కోర్టు ఈ కేసు విచారణను పునరుద్ధరించినప్పుడు నేను స్వాగతించాను. ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనంతో ఆ కేసుపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని నేను అప్పుడు అభ్యర్థించాను. వాదనలు నివేదించేందుకు, సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించేందుకు తగు సమయాన్ని ఇవ్వాలని కూడా నేను సూచించాను. మాజీ ప్రధానన్యామూర్తి ఎస్‌ఏ బాబ్డే మోటార్ బైక్ విషయమై ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌లకు సంబంధించిన కేసు గురించి నేను ఇక్కడ ప్రస్తావించడం లేదు. జస్టిస్ అరుణ్ మిశ్రా తన పదవీ కాలం చివరిరోజున ప్రశాంత్ భూషణ్‌కు ఒక రూపాయి జరిమానా విధింపుతో ఆ కేసు ముగిసిపోయింది. అదే కాలంలో ప్రశాంత్ భూషణ్‌పై ఉన్న ఒక పాత కోర్టు ధిక్కారం కేసుపై విచారణను పునః ప్రారంభించాలని సుప్రీం కోర్టు హఠాత్తుగా నిర్ణయించింది. 2009లో తెహెల్కా మ్యాగజైన్‌కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ విషయమై ఆ కోర్టు ధిక్కారం కేసు దాఖలయింది. ‘నా అభిప్రాయంలో 16 లేదా 17 మంది మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులలో సగం మంది అవినీతిపరులు’ అని ప్రశాంత్ భూషణ్ ఆ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్య ప్రశాంత్ భూషణ్, తరుణ్ తేజ్‌పాల్ (అప్పటి తెహెల్కా ఎడిటర్)పై కోర్టు ధిక్కారం కేసు దాఖలుకు దారి తీసింది. అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్న హరీశ్ సాల్వే 2009లో ఆ కేసును దాఖలు చేశాడు. అయితే ప్రశాంత్ భూషణ్ తన వ్యాఖ్యకు మద్దతుగా సమగ్ర సాక్ష్యాధారాలతో మూడు అఫిడవిట్‌లు దాఖలు చేశారు. అయితే ఆ తరువాత ఆ కేసుపై విచారణను ప్రారంభించలేదు. 2012లో ఆ కేసును విచారణ జరిపే కేసుల జాబితాలో చేర్చి కూడా విచారణను చేపట్ట లేదు.. మళ్లీ 2020లో మరో కోర్టు ధిక్కారం కేసుతో పాటు దాన్ని కూడా జస్టిస్ అరుణ్ మిశ్రాకు అప్పగించారు. అది విచారణకు వచ్చినప్పుడే తరుణ్ తేజ్‌పాల్ బేషరతుగా క్షమాపణ చెప్పాడు. ప్రశాంత్ భూషణ్ ఇలా వివరణ ఇచ్చారు: ‘2009లో తెహెల్కాకు నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అవినీతి’ అనే మాటను ఔచిత్యం కొరవడిన వ్యవహారం అనే అర్థంలో వాడాను. ఆర్థిక అవినీతి లేదా ఆర్థిక ప్రయోజనాలు పొందారన్న అర్థంలో నేను వాడ లేదు. నా వ్యాఖ్య సంబంధిత మాజీ ప్రధాన న్యాయమూర్తులు, వారి కుటుంబాలకు మనస్తాపం కలిగించి ఉంటే అందుకు నేను విచారిస్తున్నాను’. ఈ వివరణను తిరస్కరించి, దానిపై విచారణ జరపాలని కోర్టు నిర్ణయించింది. ‘అవినీతి అనే మాటను ఉపయోగించడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందో లేదో విచారణ జరిపి నిర్ణయిస్తామ’ని కోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరి సంభావ్య చెడు నడవడికపై విచారణ జరిపేందుకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన అనుమతి ఉన్న దేశం మనది. అయినా ‘అవినీతి’ అనే మాటను ప్రస్తావించడం, ఆ ఆరోపణకు గురైన వారు అందుకు పాల్పడినప్పటికీ అటువంటి మాటను పేర్కొనడం కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా రాదా అనే విషయాన్ని కనుగొనాలని కోర్టు ఆకాంక్షించింది! రెండు సంవత్సరాల అనంతరం జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ఆ కోర్టు ధిక్కారం కేసును విచారణకు చేపట్టింది. ప్రశాంత్ భూషణ్ తన వ్యాఖ్యపై వివరణ ఇచ్చారని ఆయన న్యాయవాది కామినీ జైస్వాల్ పేర్కొన్నారు. తరుణ్ తేజ్‌పాల్ బేషరతుగా క్షమాపణ చెప్పారని ఆయన న్యాయవాది కపిల్ సిబాల్ తెలిపారు. ‘కోర్టు ధిక్కారం ఆరోపణ నెదుర్కొంటున్న వారు వివరణ ఇచ్చినందున, క్షమాపణ చెప్పినందున ఈ కేసుపై విచారణను కొనసాగించాల్సిన అవసరముందని మేము అభిప్రాయపడడం లేద’ని తాజా ధర్మాసనం తన ఆదేశంలో పేర్కొంది.

2009లో ప్రశాంత్ భూషణ్ సమర్పించిన అఫిడవిట్‌లు లేవనెత్తిన ప్రశ్నలు ఏమిటి? చేసిన ఆరోపణలు ఏమిటి? (వీటికి సమగ్ర సాక్ష్యాధారాలను ప్రశాంత్ భూషణ్ నివేదించారు). ఈ ప్రశ్నలు 18 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులలో ఎనిమిది మందికి సంబంధించినవి. వ్యక్తులకు కాకుండా సంస్థకు ప్రాధాన్యమిస్తున్నందున సంబంధిత న్యాయమూర్తుల పేర్లను ప్రస్తావించకుండా అఫిడవిట్‌లలోని ప్రధాన అంశాలను పేర్కొంటాను.

సిజెఐ 1 : ఈయన పదవీ విరమణ అనంతరం ఒక రాజకీయ పదవిని అంగీకరించారు. తన నేతృత్వంలోని ఒక విచారణ సంఘం నివేదికలో అధికార పక్షం నేతలను తప్పుపట్టక పోయినందునే ఆయనకు ఆ రాజకీయ పదవి లభించలేదా? సిజెఐ 2 : ఈయన స్వల్పకాలం మాత్రమే భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఒక ఎగుమతుల సంస్థకు సంబంధించిన కేసులను తాను సభ్యుడుగా ఉన్న బెంచ్‌కు బదిలీ చేయించి, వాటిపై అసాధారణ ఆదేశాలు జారీ చేయలేదా? అలా కాని పక్షంలో, ఆయన పదవీ విరమణ అనంతరం సుప్రీం కోర్టు ఆ ఆదేశాలను తిరగదోడి వాటిని సమీక్షించవలసిన అవసరం ఏమిటి? సిజెఐ 3 : సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నిర్మాణ కార్యకలాపాలు అన్నీ నిషిద్ధమైన ప్రాంతంలో ఈయన ఒక ప్లాట్‌ను కొనుక్కుని, గృహాన్ని నిర్మించుకోలేదా? ఇందుకై ఆయన ఆ ఆదేశాలను నీరు కార్చలేదా? తాను పదవిలో ఉండగా తాను నెలకొల్పిన ఒక ట్రస్ట్‌కు జీవితకాల చైర్మన్ అవడమే కాకుండా, ఆ ట్రస్ట్‌కు ఆర్థిక ప్రయోజనాలు కలిగించలేదా? సిజెఐ 4 : ఈయన ఒక ముఖ్యమంత్రిపై ఉన్న ఒక కేసును కొట్టి వేశారు. ఆ కేసును కొట్టి వేసిన రోజునే సదరు ముఖ్యమంత్రి ఈ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలకు తన విచక్షణాధికార కోటా నుంచి రెండు నివేశన స్థలాలను కేటాయించలేదా? సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఈయన పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు కేసులపై విచారణ జరిపేందుకు ప్రయత్నించ లేదా? సిజెఐ 5 : ఒక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి నుంచి ఒక ప్లాట్‌ను పొంది, ఆ తరువాత ఒక కేసులో ఆ వ్యక్తికి అనుకూలంగా ఆదేశాలు జారీ చేయలేదా? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడే, ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూమిని పొందేందుకై తప్పుడు అఫిడవిట్ సమర్పించ లేదా? సిజెఐ 6 : ప్రధాన న్యాయమూర్తి అధికార నివాసం నుంచి పని చేస్తున్న తన కుమారులకు ఆర్థిక లబ్ధి సమకూర్చలేదన్న కారణంగా ఈయన ఒక మెట్రోలో వాణిజ్య కార్యాలయాన్ని మూసివేయించలేదా? ఆ తనయులు అదే కార్యాలయం నుంచి పని చేస్తూనే షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్‌తో వాణిజ్య లావాదేవీలు కుదుర్చుకోలేదా? అంతేకాకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం వారికి వాణిజ్యపరమైన ప్లాట్‌లను కేటాయించలేదా? సిజెఐ 7 : ఈయన కుమార్తెలు, అల్లుడు, సహాయకులలో ఒకరు పెద్ద ఎత్తున స్థిరాస్తులను సమకూర్చుకోలేదా? ఈయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి అయిన తరువాత వారు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల కంటే అత్యధికంగా ఆస్తులను సముపార్జించలేదా? సిజెఐ 8 : సుప్రీం కోర్టే నియమించిన పర్యావరణ నిపుణుల కమిటీ తీవ్రంగా తప్పు పట్టిన ఒక కంపెనీకి అత్యంత లాభదాయకమైన లీజును మంజూరు చేస్తూ ఈయన ఆదేశాలు జారీ చేయలేదా? విచారణ ప్రారంభమైన దశలో సదరు కంపెనీలో తనకు వాటాలు ఉన్నాయన్న విషయాన్ని ఆయన ఎందుకు వెల్లడించలేదు?

ఈ ఆరోపణలు అంతిమ సత్యాలని నేను సూచించబోవడం లేదు. ఇవి అసత్యాలని, అంతేకాకుండా దురుద్దేశంతో చేసినవని కూడా అనుకుందాం. అయినప్పటికీ బహిరంగంగా చేసిన ఈ ఆరోపణలపై, అందునా సమగ్ర సాక్ష్యాధారాలతో అఫిడవిట్లు దాఖలు చేసినందున. దేశ సర్వోన్నత న్యాయస్థానం నిష్పాక్షిక విచారణ జరిపించవలసిన అవసరం లేదా? సిజెఐల దుర్వర్తనకు సంబంధించిన ఈ ఆరోపణలలో నిండు సత్యముందని, అయినప్పటికీ ఆ వ్యవహారాలు ఆ న్యాయమూర్తుల వృత్తిధర్మ నిర్వహణను ప్రభావితం చేయలేదని కూడా అనుకుందాం. అయినప్పటికీ ఈ ఆరోపణలపై విచారణ జరిపించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నిర్దిష్ట మార్గదర్శకాలను నిర్దేశించవలసిన అవసరం లేదా? ఈ ఆరోపణల్లో సత్యం పాలు ఎక్కువే అని భావించినప్పుడు వాటిపై విచారణ జరిపించడం న్యాయవ్యవస్థ జవాబుదారీతనానికి, సంస్కరణలకు దోహదం చేయదూ?

ప్రశాంత్ భూషణ్ 2020 లోనే దాఖలు చేసిన మరొక అఫిడవిట్‌లో ఒక పెద్ద రాజ్యాంగవిహిత ప్రశ్నను లేవనెత్తారు : ఒక సత్య ప్రకటన న్యాయవ్యవస్థను అపఖ్యాతిపాలు చేస్తే అది కోర్టు ధిక్కారం అవుతుందా? ఒక సదుద్దేశంతో వ్యక్తం చేసిన విశ్వసనీయ అభిప్రాయం సత్యంగా నిరూపితమైనా, కాకపోయినా కోర్టు ధిక్కారం కిందకు వస్తుందా? ఒక దశాబ్దానికి పైగా ఎటూ తేల్చకుండా ఉండిన ఒక కేసును హఠాత్తుగా మూసివేయడం ద్వారా సుప్రీం కోర్టు ఈ క్లిష్ట ప్రశ్నలు అన్నిటికీ పాతర వేసింది. ప్రశాంత్ భూషణ్ నాకు ప్రియమైన స్నేహితుడు. అయినప్పటికీ అతనిపై ఉన్న కోర్టు ధిక్కారం కేసును సుప్రీం కోర్టు విచారణ జరపకపోవడం నన్ను ఎంతైనా నిరుత్సాహపరిచింది.

Leave a Reply