‘కోవిడ్’ దెబ్బకు ఇటలీ విలవిల

0
239

రోమ్: కరోనా వైరస్ ఉత్పాతానికి ఇటలీ దేశం విలవిల్లాడుతోంది. కోవిడ్-19 ప్రకోపానికి ఇటలీలో ఇప్పటివరకు 5,476 మంది ప్రాణాలు విడిచారు. 59,138 మంది కరోనా వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. ఇందులో 46,638 యాక్టివ్ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే కరోనా బారిన పడి 7,024 మంది కోలుకోవడం ఇటలీ వాసులకు ఊరట కల్పించే అంశం.

ఆదివారం (మార్చి 22) 5,560 కోవిడ్ కేసులు నమోదు కావడం గమనార్హం. అంతకు ముందు రోజే అంటే శనివారం(మార్చి 21) 6,557 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం భయాందోళన కలిగిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నా రికవరీ రేటు పెరుగుతుండటం కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. ఆదివారం కొత్త కేసుల నమోదు 15 శాతం, మరణాలు 18 శాతం తగ్గాయని సమాచారం. కరోనా కారణంగా ఆదివారం ఇటలీలో 651 మంది, శనివారం 793 మంది మృతి చెందారు.

ఇటలీలోని బెర్గామో నగరం అత్యధికంగా కోవిడ్ ప్రభావానికి గురైంది. మార్చి నెల 15 రోజుల్లోనే 108 మంది మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో మరణాలు సంభవించడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానిక అధికార యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఎక్కడిక్కడ మృతదేహాలు పేరుకుపోతున్నాయి. శ్మశానవాటిక, ఆస్పత్రుల్లో మృతదేహాలను భద్రపరిచే గదులు నిండిపోవడంతో శవాలను తిప్పి పంపిస్తున్నారు. కొన్నాళ్లు ఇళ్లలోనే భద్రపరచాలని కోరుతున్నారు. మృతదేహాలను ఖననం చేసే వీలు కూడా లేకపోవడంతో బెర్గామో నగర వాసులు బెంబేలు పడుతున్నారు. కాగా, కష్టకాలంలో ఉన్న ఇటలీకి భారత్ ఆపన్న హస్తం అందించింది. కరోనా నివారణకు అవసరమైన వైద్య పరికరాలు, మాస్కులు పంపించి పెద్ద మనసు చాటుకుంది. భారత్ చేసిన సహాయానికి ఇటలీ విదేశాంగ కృతజ్ఞతలు తెలిపింది.

Leave a Reply