‘ఐటం’ అన్న పిలుపు అవమానకరమే

0
47

బాలికను వేధించినందుకు ఏడాదిన్నర జైలు

ముంబయి : బాలికలను ‘ఐటం’ అంటూ కామెంట్లు చేయడం వేధింపుల కిందకే వస్తుందని ముంబైలోని ‘పోస్కో’ కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలాంటి వ్యాఖ్యలు చేసే రోడ్‌సైడ్‌ రోమియోలపై జాలి చూపించాల్సిన అవసరం లేదని ప్రత్యేక జడ్జి ఎ.జె.అన్సారీ వ్యాఖ్యానించారు. ముద్దాయికి ఏడాదిన్నర జైలు శిక్ష విధించారు. 2015 జులై 14న ఓ 16 ఏళ్ల బాలిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా 25 ఏళ్ల యువకుడు వెంట పడి వేధించాడు. తనను ఏమీ అనొద్దని ఆమె కోరగా మరింత రెచ్చిపోయి ‘ఐటం’ అని కామెంట్లు చేశాడు. జుట్టుపట్టుకొని లాగాడు కూడా. దాంతో ఆమె పోలీసు హెల్ప్‌లైన్‌ నెంబరు 100కు ఫోన్‌ చేసింది. పోలీసులు వచ్చేలోగానే నిందితుడు పరారయ్యాడు. ఇంటికి వెళ్లి తండ్రికి చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయస్థానం..లైంగికంగా వేధించాలన్న ఉద్దేశంతోనే ఐటం అన్న మాటను వాడారని, ఇది అవమానించడం కిందకే వస్తుందని తెలిపింది. జుట్టు పట్టి లాగడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. వీధుల్లో మైనర్‌ బాలికలను వేధించే వారి విషయంలో కనికరంతో వ్యవహరించకూడదని స్పష్టం చేసింది.

Leave a Reply