జగన్‌ ప్రతివారం రావాల్సిందే!

0
230

హాజరు నుంచి మినహాయింపు కుదరదు

  • పిటిషన్‌ కొట్టేసిన సీబీఐ కోర్టు.. పాదయాత్ర ముందు చుక్కెదురు
  • రామోజీరావుతో జగన్‌ భేటీ.. గంటపాటు ఫిలింసిటీలో చర్చలు

పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ప్రతి శుక్రవారం జరిగే కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి ఆరు నెలలు మినహాయించాలన్న జగన్‌ వినతిని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తోసిపుచ్చింది. ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సోమవారం కోర్టు కొట్టివేసింది. కోర్టు విచారణకు తన తరఫున న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ గతంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 ప్రకారం దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో… ఇప్పుడు సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేసింది. వెరసి… ప్రత్యేకంగా అనుమతి తీసుకుంటే తప్ప ప్రతి శుక్రవారం జగన్‌ కోర్టుకు రావాల్సిందే!ప్రజలకోసమే పాదయాత్ర చేపట్టారు. వారిని కలిసి సమస్యలను తెలుసుకోవాల్సి ఉంది.

వారం వారం విరామం ఇస్తే అందులో సీరియ్‌సనెస్‌ తగ్గుతుంది’ అంటూ జగన్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే… జగన్‌, ఇతర నిందితులు ఏదో కారణం చూపుతూ ప్రత్యేక కోర్టులో విచారణను జాప్యం చేస్తున్నారని, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాదులు గట్టిగా వాదించారు. ప్రతి వాయిదాకూ హాజరుకావాలన్న షరతుపైనే ఆయనకు బెయిలు లభించిందని కూడా గుర్తు చేశారు. తన తరఫున కోర్టు విచారణకు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలంటూ జగన్‌ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఇప్పుడు మరో సెక్షన్‌ కింద మినహాయింపు కోరుతూ పిటిషన్‌ వేశారని తెలిపారు.

వాదనల అనంతరం.. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్‌ వినతిని తోసిపుచ్చింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుకాకుండా మినహాయింపు కోరేందుకే జగన్‌ పాదయాత్ర అంశాన్ని తెరపైకి తెచ్చారని గతంలో హైకోర్టు పేర్కొంది. నాలుగేళ్ల తర్వాత అకస్మాత్తుగా పాదయాత్ర పేరుతో వ్యక్తిగత హాజరునకు మినహాయింపు కోరుతున్నారు. జగన్‌ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు ఉన్నాయి. హాజరునకు మినహాయింపు ఇస్తే అది దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది.

నీతి బాహ్యమైన నేరాల్లో, ఎక్కువ శిక్షలు విధించేందుకు అవకాశమున్న కేసుల్లో నిందితుల హాజరు తప్పనిసరి. జగన్‌పై ఉన్న అభియోగాలు తీవ్రమైనవిగానే పరిగణించాల్సి ఉంటుంది. నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో మాత్రమే నిందితులకు హాజరు మినహాయింపు ఇవ్వాలని చట్టం స్పష్టం చేస్తోంది అని జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్‌ 205 కింద దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చారు. మినహాయింపు ఇవ్వాలా, లేదా అన్నది కిందికోర్టు జడ్జి విచక్షణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. దీంతో జగన్‌ మరోమారు సెక్షన్‌ 317 కింద సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేశారు.

రామోజీతో గంటసేపు చర్చలు…అమరావతి: ఈనాడు గ్రూపు అధినేత రామోజీ రావుతో వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మరోమారు సమావేశమయ్యారు. పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డితో కలసి సోమవారం రామోజీ ఫిలిం సిటీలో ఆయనతో దాదాపు గంట సేపు చర్చలు జరిపినట్లు తెలిసింది. దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జగన్‌ వచ్చేనెల 2 నుంచి చేపట్టనున్న పాదయాత్ర, సీబీఐ కేసులు, రాజకీయ పరిణామాలపైనే వీరిమధ్య చర్చ జరిగినట్లు భావిస్తున్నారు.

పాదయాత్రకు సంబంధించి కవరేజీతోపాటు… పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. కాగా, రామోజీని జగన్‌ వ్యక్తిగతంగా కలవడం ఇది రెండోసారి! 2015 సెప్టెంబరు 24న రామోజీ ఫిలింసిటీకి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అప్పట్లో ప్రత్యేక హోదాకోసం గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ భేటీ జరిగింది. అప్పట్లో ఈ సమావేశం వైసీపీలో సంచలనం సృష్టించింది. అంతకుముందు వరకు తన మీడియా వేదికగా రామోజీరావుపై యుద్ధం చేసిన జగన్‌… ఆయనతో వ్యక్తిగతంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఒక వాహ వేడుకలోనూ రామోజీతో జగన్‌ సమావేశమయ్యారు. ఇప్పుడు.. తన పాదయాత్రకు ముందు మరోసారి రామోజీని కలవడం విశేషం.

ఏం జరుగుతుందో చూడండి..ప్రతి వాయిదాకు జగన్‌ కోర్టుకు హాజరుకావాల్సిన అవసరం లేదని, ఈ మేరకు చట్టంలో వెసులుబాటు ఉన్నా హాజరవుతున్నారంటూ జగన్‌ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి గత విచారణ సమయంలో వ్యాఖ్యానించడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. హాజరుకాకుండా వెసులుబాటు ఉన్నప్పుడు ఎందుకు హాజరవుతున్నారు? హాజరుకాకండి… ఏం జరుగుతుందో చూడండి అంటూ వ్యాఖ్యానించారు.

Courtesy Andhrajyothi...

 

Leave a Reply