స్వర్గసీమకు సత్యభామ!

0
114
  • సీనియర్‌ నటి జమున అస్తమయం
  • నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యం
  • తెల్లవారుజామున నిద్రలోనే కన్నుమూత
  • నటీనటులు, అభిమానుల నివాళులు
  • సీఎం కేసీఆర్‌, రేవంత్‌, బండి సంజయ్‌,
  • నారాయణ, తమ్మినేని సంతాపం
  • మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌ సిటీ : సావిత్రి తరానికి చెందిన నటీమణి, ఆ మహానటికీ కించిత్‌ అసూయ పుట్టేలా సినీ సత్యభామగా ప్రేక్షకులను మెప్పించి.. ఆ పాత్ర అంటే ఆమే అనేలా సినీ అభిమానుల మదిలో వన్‌ అండ్‌ ఒన్లీగా నిలిచిపోయిన సీనియర్‌ నటి జమున (89) ఇకలేరు. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జమున మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉదయం నుంచే బంధువులు, సినీ ప్రముఖులు, అభిమానులు.. ఆమె ఇంటికి చేరుకున్నారు.

సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌, నిర్మాత అల్లు అరవింద్‌, నటుడు నారాయణమూర్తి, మాదాల రవి, రోజా రమణి, రాక్‌ విల్లాలోని జమున నివాసానికి వచ్చి నివాళులర్పించారు. ఉదయం 11 గంటలకు జమున పార్థివ దేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌కు తీసుకొస్తున్నట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. దీంతో జమునను కడసారి చూసేందుకు సినీనటులు, ఆర్టిస్టులు, అభిమానులు అక్కడికి తరలివచ్చారు. అయితే మధ్యాహ్నం వరకు రాకపోవడంతో చాలాసేపు నిరీక్షించారు.

మధ్యాహ్నం 2.45 గంటల కు ఇంటి నుంచి బయలుదేరి 3:04 గంటలకు తీసుకొచ్చారు. సినీ రంగప్రముఖులు అక్కడికి చేరుకుని నివాళులర్పించారు. మురళీ మోహన్‌తోపాటు మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి, దగ్గుబాటి సురేశ్‌బాబు, జీవిత రాజశేఖర్‌, కేవీ కృష్ణకుమారి, సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి, కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు, రేలంగి నర్సింహరావు, కరాటే కల్యాణి, పసునూరి శ్రీనివాస్‌, సీనియర్‌ నటి శివపార్వతి, సీపీఐ నాయకులు రామకృష్ణ, పశ్య పద్మ, బాబ్జీ, రవి, తదితరులు పార్థీవ దేహం వద్ద నివాళులర్పించారు. సాయంత్రం 4.05 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో జమున అంత్యక్రియలు జరిగాయి. జమున కూతురు చితికి నిప్పంటించారు.

జమున మృతిపట్ల ప్రజానాట్యమండలి సినిమాశాఖ అధ్యక్షుడు వందేమాతరం శ్రీనివాస్‌, కార్యదర్శి మద్దినేని రమేశ్‌ బాబు, కోశాధికారి మాదాల రవి సంతాపం ప్రకటించారు. పుట్టిల్లు సినిమాతో జమున తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పారు. జమున మృతిపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల నివాళులర్పించారు. కాగా ప్రజానాట్యమండలి కోసం జమునను ముక్దుం భవన్‌కు ఆహ్వానిస్తే వచ్చారని.. తన కుటుంబం చెంతకొచ్చినట్లుగా ఉందని ఆనందం వ్యక్తం చేశారని నారాయణ గుర్తు చేసుకున్నారు. జమున, ప్రజానాట్యమండలి గరికపాటి రాజారావు ద్వారా కళారంగానికి పరిచయం అయ్యారని తమ్మినేని వీరభద్రం అన్నారు.

తెలుగుతనం మూర్తీభవించిన నటి
సీనియర్‌ నటి జమున మరణం చాలా బాధాకరం. తెలుగు, హిందీ, దక్షిణాది భాషల్లో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, తెలుగుదనం మూర్తీభవించిన నటి. మచ్చలేని నటిగా జీవితాన్ని కొనసాగించారు. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు జమున ఢిల్లీకి వచ్చి సినీరంగం, ప్రజా సమస్యలపై చర్చించేవారు. సమస్యల పరిష్కారానికి కృషిచేసేవారు. జమున ఆత్మకు శాంతి చేకూరాలి.
– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్‌

సత్యభామగా అందరి హృదయాల్లో
సత్యభామగా జమున అందరి హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు. తెలుగు, హిందీ, కన్నడం, తమిళంలో 150కి పైగా సినిమాల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. 1980లో రాజమండ్రి నుంచి ఎంపీగా పనిచేసి రాజకీయనేతగా ప్రజాభిమానం పొందారు. సీనియర్‌ నటులు వరుసగా చనిపోతుండడం సినీ పరిశ్రమకు తీరని లోటు.
– తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మంత్రి

 

Leave a Reply