తెలంగాణలో పొత్తుకు సిద్ధం

0
158
  • ఎవరైనా ముందుకొస్తే సంతోషం
  • 7 నుంచి 14 లోక్‌సభ స్థానాల్లో జనసేన అభ్యర్థులు
  • అసెంబ్లీలో 10 మంది జనసేన ఎమ్మెల్యేలుండాలి
  • ఏపీలో కులాల గీతల మధ్య రాజకీయం చేయాల్సిన దుస్థితి..
  • తెలంగాణలో అలాంటి నాయకత్వం లేదు
  • ఏపీలో బీజేపీతో కలిసే పోటీ.. కాదంటే ఒంటరిగానే
  • అక్కడ కొత్త పొత్తులకైనా ఓకే.. ఎన్నికలప్పుడే స్పష్టత: పవన్‌
  • కొండగట్టులో ‘వారాహి’కి పూజలు.. ధర్మపురిలో మొక్కులు
  • జగిత్యాల జిల్లా కొండగట్టులో పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యలు

జగిత్యాల : తెలంగాణలో జనసేన ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో తమకు పది మంది ఎమ్మెల్యేలు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎ్‌సగా ఆవిర్భవించడాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయానికి మంగళవారం వచ్చిన ఆయన.. తొలుత స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం తన ‘వారాహి’ ప్రచార రథానికి వాహనపూజ చేయించారు. ఈ సందర్భంగా ఆయన తన భక్తులు, అభిమానులు, జనసేన కార్యకర్తలనుద్దేశించి వారాహి వాహనంపై నుంచి ప్రసంగించారు. ఆ తర్వాత, అక్కడి నుంచి జగిత్యాల శివారులోని బృందావనం ఫ్యామిలీ రిసార్ట్స్‌కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. అనంతరం వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సభ్యులతో సమీక్ష జరిపారు. పవన్‌ను చూడడానికి పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో అభిమానులు కొండగట్టు వద్దకు తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కచ్చితంగా పర్యటిస్తానన్నారు.

జనసేనతో పొత్తుకు ఎవరైనా ముందుకు వస్తే సంతోషమన్నారు. భావజాలానికి దగ్గరగా వస్తే ఓకేనని, అది బీజేపీ అయినా సరేనని, ఎప్పుడూ బీజేపీ తనకు దోస్తేనని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రా రెండు రాష్ట్రాలలో సమస్యలు వేరు వేరుగా ఉన్నాయని.. ఆంధ్రాతో తెలంగాణను పోల్చిచూడలేమని అభిప్రాయపడ్డారు. ఏపీలో రాజకీయంలో ఉన్న వారు మామూలు వారు కాదని.. సొంత బాబాయిని చంపించుకున్న వాళ్లని విమర్శించారు. అలాంటి నాయకత్వం తెలంగాణలో లేదని.. ఏపీలో తను ఏం సాధించినా ఇక్కడి పోరాట స్ఫూర్తితోనే అని పవన్‌ పేర్కొన్నారు.

జనసేన ప్రభావం చూపాలి..
రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేయని స్థానాల్లో సైతం ప్రభావం చూపేవిధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పవన్‌ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటుకు రాజకీయ నాయకులు భయపడతారని, కాబట్టి దానికున్న విలువను ప్రజలకు తెలియజెప్పి కార్యకర్తలు అవగాహన కల్పించాలన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. జనసేనపొలిటికల్‌ మైలేజీని మరింత పెంచుకునేవిధంగానే ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతలు ఎవరూ తిరగకూడదన్నదే ఆలోచనతోనే ఏపీ సర్కారు జీవో 1 తెచ్చిందని పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఏపీలో ప్రస్తుతానికి జనసేన పార్టీకి బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసే వెళ్తామని.. కాదంటే ఒంటరిగానైనా వెళ్తామని.. లేదా కొత్త పొత్తులు కలిస్తే వారితో కలిసి వెళ్తామని పవన్‌ అన్నారు. ఏదేమైనా ఎన్నికల తేదీలు ప్రకటించడానికి వారం ముందు మాత్రమే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. కొండగట్టు ఆలయం తనకు సెంటిమెంట్‌ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ముఖ్యమైన ఏ కార్యక్రమానైనా కొండగట్టు నుంచి ప్రారంభిస్తానన్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి దయతో గతంలో తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని, అది తనకు పునర్జన్మలాంటిదన్నారు. తెలంగాణలో మార్పు కోసం జనసేన పనిచేస్తుందన్నారు.

పవన్‌ పర్యటనలో అపశ్రుతి రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
వెల్గటూర్‌: పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. పవన్‌ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న ఓ యువకుడు ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొని మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్‌ మండలం ముక్కట్రావ్‌పేటకు చెందిన కూస రాజ్‌కుమార్‌ (22) ద్విచక్ర వాహనంపై కుమ్మరిపల్లికి చెందిన జక్కుల అంజి అనే మరో యువకుడితో కలిసి పవన్‌ కాన్వాయ్‌ను అనుసరిస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ కిషన్‌రావుపేట దాటిన తరువాత ఓవర్‌టేక్‌ చేయాలని యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి, అదే వేగంతో ఎదురుగా వస్తున్న కారును కూడా ఢీ కొట్టారు. ఈ ఘటనలో రాజ్‌కుమార్‌ మృతి చెందాడు.

Leave a Reply