పోలీసుల అదుపులో జనశక్తి అగ్రనేత రాజన్న!

0
35

హైదరాబాద్‌ నుంచి వేములవాడకు తరలింపు

సిరిసిల్ల, నల్లకుంట : సీపీఐ(ఎంఎల్‌) జనశక్తి అగ్రనేత కూర రాజన్నను సిరిసిల్ల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన్ను సోమవారం ఉదయం వేములవాడకు తరలించినట్లు సమాచారం. 2013లో వేములవాడ మండలం మారుపాక వద్ద సుద్దాల మాజీ సర్పంచి వేణుగోపాల్‌రావు అలియాస్‌ ప్రభాకర్‌రావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో అరెస్టయిన రాజన్న బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి జనజీవనంలోనే ఉంటున్నారు. ఈ కేసు విచారణలో కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో నాన్‌బెయిలబుల్‌ వారెంటు కింద రాజన్నను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ఇటీవల జిల్లాలో జనశక్తి కదలికలపై నిఘా పటిష్ఠం చేశారు. ఈ క్రమంలో కొంతమందిని అరెస్టు చేసి విచారించారు. ఇందులో పార్టీ పునర్నిర్మాణం, విస్తరణ దిశగా ఏమైనా కార్యకలాపాలు జరుగుతున్నాయా? వాటిలో రాజన్న ప్రమేయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతనే రాజన్నను అరెస్టు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* కూర రాజన్నను వైద్యులు, న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని మానవహక్కుల వేదిక డిమాండ్‌ చేసింది. రాజన్న అరెస్ట్‌ను సీపీఐ(ఎం.ఎల్‌) న్యూడెమోక్రసీ ఖండించింది.

Leave a Reply