విస్మృత వీరనారి

0
205

సింహం తన చరిత్ర తాను రాసుకోకపోతే వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది. ఇప్పటికీ చాలామంది స్వాతంత్ర్యోద్యమ వీరులకు చరిత్రలో స్థానం లేకుండా పోయింది. అందుకనే, మొదటి స్వాతంత్ర్య సమరం చేసింది ఎవరు అంటే.. ఝాన్సీ లక్ష్మీ బాయి అంటారే తప్ప, ఝల్కారి బాయి కోరి అనే విషయం ఎవరికీ తెలియదు. ఇలా కాలగర్భంలో మరుగున పడిన ఎందరో మహనీయుల చరిత్ర కొంతమంది బహుజన చరిత్రకారుల కృషివల్ల ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నది.

ఝాన్సీకి రాణి అయిన లక్ష్మీ బాయికి యుద్ధాలన్నా, ఆంగ్లేయులతో శత్రుత్వం అన్నా ఎంతో భయం. తిమ్మిని బమ్మి చేసే సత్తా మనువాద చరిత్ర కారులకు ఉంది. సామాజికంగా ఉన్నత వర్గానికి చెందిన లక్ష్మీ బాయిని తక్కువ చేసి చూపడం నాటి చరిత్రకారులకు ఇష్టం లేదు. కాబట్టి, లేని వీరత్వాన్ని లక్ష్మీబాయికి ఆపాదించారు. అందుకే చరిత్రలో లక్ష్మీ బాయికి, కస్తూరి బాయికి, దుర్గా బాయికి ఉన్న స్థానం సావిత్రి బాయికి, ఝల్కారి బాయికి, రమా బాయికి లేకుండా పోయింది.

1951లో పి.ఎల్‌. వర్మ రాసిన ‘ఝాన్సీ కి రాణి’ అనే పుస్తకంలో ఝల్కారిని గురించిన చరిత్ర బయటికి వచ్చింది. అలాగే రామచంద్ర హెరాన్ అనే రచయిత రాసిన ‘మాటి’ అనే నవలలో లక్ష్మీ బాయికి, ఝల్కారి బాయికి ఉన్న సంబంధం గురించి తెలిసింది, అలాగే 1964లో భవాని శంకర్ విశారధ్ అనే మేధావి ‘ఝల్కారి బాయి కోరి జీవిత చరిత్ర’ రాసారు. ఝల్కారి బాయి ఝాన్సీకి సమీపంలోని భోజ్లా గ్రామంలో బట్టలు నేసే కోరి కులానికి చెందిన సదోవా సింగ్, జమునా బాయిలకు 1830 నవంబర్ 22న జన్మించారు. చిన్నప్పుడే తల్లి మరణిస్తే తండ్రి పెంపకంలో ఝల్కారి కర్ర సాము, కత్తి సాము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకునేది. చిన్నప్పుడే ఒంటి చేత్తో చిరుతపులిని చంపడం, బందిపోటు దొంగల్ని తరిమి కొట్టడంతో ఆ ప్రాంతంలో వీరనారిగా పేరుతెచ్చుకుంది.

లక్ష్మీబాయి సైన్యంలో ఆయుధ విభాగంలో పనిచేసే పురాన్ సింగ్‌తో వివాహం అయిన తర్వాత మొదటిసారి ఝల్కారిని చూసిన లక్ష్మీ బాయి అచ్చం తన పోలికలోనే ఉన్న ఝల్కారి ధైర్యసాహసాల గూర్చి తెలుసుకొని ఆశ్చర్యపోయింది. వెంటనే తన 7వేల స్త్రీ సైన్యం కలిగిన ‘దుర్గా వాహిని’ బాధ్యతలు ఝల్కారికి అప్పగించింది. అప్పటినుండి లక్ష్మీ బాయికి ఝల్కారి బాయికి ఎంతో సాన్నిహిత్యం పెరిగింది. దానితో ఝల్కారీ, లక్ష్మీబాయికి ప్రధాన అనుచరురాలిగా ఉండేది. పాలనాపరమైన విషయాల్లో తగు సూచనలు ఇచ్చేది. 1858 ఏప్రిల్ 3న నాటి బ్రిటిష్ జనరల్ హాగ్ రోజ్ ఝాన్సీ కోటను ఆక్రమించినపుడు యుద్ధాన్ని విరమించి వారితో సంధి చేసుకోవాలని లక్ష్మీ బాయి ఆలోచించింది. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఝల్కారి బాయి కదనరంగంలో ముందుకు దూకి ఆంగ్లేయులతో పోరాడింది. లక్ష్మీబాయి మాత్రం అంతరంగికుల సాయంతో కోట దాటింది.

ఆమెను ప్రతాప్‌గఢ్‌ మహారాజు సురక్షితంగా నేపాల్ పంపించాడు. ఝల్కారి బాయి మాత్రం ఝాన్సీ నుండి కల్కి చేరుకొని అక్కడ నుంచి గ్వాలియర్ వరకు ఆంగ్లేయులతో యుద్ధం చేస్తూనే ఉంది. చివరకు కుల్‌బాగ్ దగ్గర బ్రిటిష్‌వారి చేతిలో గాయపడి మరణించింది. అప్పటికి ఝల్కారి వయసు 25ఏళ్లు మాత్రమే.

నేపాల్‌లోని తరాయి అడవుల్లోకి పారిపోయిన లక్ష్మీ బాయి అక్కడ ఓ కుగ్రామంలో తలదాచుకొని, తన 80 సంవత్సరాల వయసులో అనగా 1915లో సహజ మరణం పొందినట్టు ‘చారు గుప్తా’ అనే వ్యాసకర్త తన పరిశోధన వ్యాసాల్లో చెప్పారు. కానీ, పీష్వా బ్రాహ్మణ చరిత్రకారులు ఝల్కారి చరిత్రను తమ వర్ణానికి చెందిన లక్ష్మీబాయికి అంటగట్టి రాసారు.

లక్ష్మీ బాయి బ్రిటిష్ వారితో యుద్ధం చేయకుండా రాజీ పడ్డారనడానికి నిదర్శనంగా 1857 ప్రథమ స్వాతంత్ర్య సమర కాలంలో బ్రిటిష్‌వారికి ఆమె రాసిన లేఖను ఇప్పటికీ మనం లండన్ బ్రిటిష్ లైబ్రరీలో చూడవచ్చు. అంతే గాకుండా ఝాన్సీని ఆక్రమించుకున్న తర్వాత (లక్ష్మీ బాయి చనిపోయిందని భావించిన కొంత కాలానికి) బ్రిటిష్ జనరల్ హాగరోజ్ ‘లక్ష్మీబాయి చనిపోలేదు’ అంటూ లండన్‌కు సందేశాన్ని పంపడమూ మనం చూడగలం. లక్ష్మీబాయి చనిపోకపోతే, మరి ఎవరు చనిపోయినట్టు? నిజానికి లక్ష్మీ బాయి స్థానంలో చనిపోయింది ఝల్కారి బాయి. కానీ ఇప్పటికీ ఆ విషయం చాలా మందికి తెలియకపోవడం, చరిత్రకారులు తెలియజెప్పకపోవడం శోచనీయం. లక్ష్మీ బాయి 14ఏళ్ల దత్త పుత్రుడు దామోదర్‌ను 3 ఏళ్ల శిశువుగా చూపడం, నానా సాహెబ్, తాంతియ తోపే, కున్వర్‌సింగ్ లాంటి అగ్రవర్ణ దేశభక్తుల కల్పిత కథలను రాయడం, అవే అనంతర కాలంలో పాఠ్యాంశాలుగా మారిపోవడం జరిగింది.

మాన్యవార్ కాన్షీరామ్‌ కృషి వల్ల ఉత్తరప్రదేశ్‌లోని బుందేల్ ఖండ్‌లో 100 అడుగుల ఝల్కారి బాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2000 సంవత్సరంలో బహుజనుల ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచిన ఝల్కారి బాయి పోస్టల్ స్టాంప్‌ను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటికైనా బహుజన మేధావులు, రచయితలు వెలికితీసిన వాస్తవ చరిత్రలను గ్రంథస్థం చేయాలి.

కులేరి ప్రేమ్ సాగర్
(నేడు ఝల్కారి బాయి జయంతి)

Leave a Reply