అడవి బిడ్డలపై ‘జిందాల్‌’ పిడుగు

0
214

* కొత్త కంపెనీల పేరుతో మరోసారి దౌర్జన్యం
* గిరిజనుల తోటలను ధ్వంసం చేస్తున్న యాజమాన్యం
ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి
అడవిబిడ్డల జీవనంపై మరోసారి పిడుగు వేసేందుకు జిందాల్‌ యాజమాన్యం సిద్ధమవుతోంది. 12ఏళ్ల క్రితం అల్యూమినియం కర్మాగారం నిర్మాణం పేరిట గిరిజనుల నుంచి సుమారు 1100 ఎకరాలు భూమిని సేకరించిన జిందాల్‌ కంపెనీ, ఇప్పటి వరకు ఎలాంటి పరిశ్రమనూ స్థాపించని విషయం తెలిసిందే. వాస్తవానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం కంపెనీ పేరిట భూములు సేకరించిన యాజమాన్యం ఐదేళ్లలో పరిశ్రమ ఏర్పాటు చేయాలి. లేదంటే ఆ రైతులకు తిరిగి భూములను అప్పగించాలి. కానీ జిందాల్‌ యాజమాన్యం దశాబ్దాలు దాటినా నేటికీ భూములివ్వకుండా రైతులను వేధింపులకు గురి చేస్తోంది. తాజాగా మరోసారి కొత్త కంపెనీల పేరిట ఉన్న భూములను సైతం లాక్కోవడానికి కుట్ర పన్నుతోంది. అందులో భాగంగా ఇటీవల ఎస్‌.కోట మండలం చీడిపాలెంలో గ్రామ రెవెన్యూ పరిధిలో గిరిజనులు సాగు చేసుకుంటున్న టేకు, మామిడి, జీడి తోటలను దౌర్జన్యంగా తొలగించి, ఆదివాసీల్లో భయబ్రాంతులను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి గిరిజనులు ఎర్రజెండాను ఆశ్రయించారు.
విజయనగరం జిల్లా ఎస్‌.కోట మండలం మూల బొడ్డవర, ముషిడిపల్లి, కిల్తంపాలెం, పెద్దఖండేపల్లి పంచాయతీల పరిధిలో సుమారుగా 26 గ్రామాలకు చెందిన 2,298.43 ఎకరాలను 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సేకరించింది. ఇందులో 866.67 ఎకరాల ప్రభుత్వ భూమి, 151.04 డి-పట్టా, 180.63 ఎకరాల జిరాయితీ భూములున్నాయి. వీటిలో అల్యూమినియం కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పిన జిందాల్‌ యాజమాన్యం నేటికీ పరిశ్రమ పెట్టలేదు. కానీ అప్పటికే తాటిపూడి జలాశయానికి భూములిచ్చి నిర్వాసితులైన 73 మంది గిరిజనులు జిందాల్‌కు భూములివ్వడానికి నిరాకరించారు. తామంతా ఒకసారి నిర్వాసితులమయ్యామని, రెండోసారి ఎలా నిర్వాసితులను చేస్తారని అప్పటిల్లో వామపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో యాజమాన్యం భూములివ్వని గిరిజనుల జోలికి వెళ్లలేదు. తాజాగా జిందాల్‌ అనుకూల ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి ఆ కంపెనీ మిగిలిన భూములపై పడింది.

కొత్త కంపెనీల పేరిట నాటకం
జిందాల్‌ యాజమాన్యం తాజాగా కొత్త కంపెనీల ఏర్పాటును తెరమీదకు తెచ్చింది. ఈసారి పెయింట్‌, అపెరల్‌ పార్క్‌, సోలార్‌ విద్యుత్‌ వంటి పరిశ్రమలు పెడతామని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో జిల్లా అధికారులపై ఒత్తిళ్లకు దిగి, భూములివ్వని గిరిజనులపై దౌర్జన్యానికి తెగబడింది. అందులో భాగంగానే తాటిపూడి జలాశయ నిర్వాసిత గ్రామమైన చీడిపాలెంలో సర్వే నెంబరు 114/1లో ఎస్‌.భీమరాజు అనే గిరిజన రైతుకు చెందిన రెండున్నర ఎకరాల భూమిలో గత 30 ఏళ్లుగా సాగు చేస్తున్న టేకు, మామిడి, జీడి, అకేషియా చెట్లను యాజమాన్యం పొక్లెయిన్లతో అక్రమంగా తొలగించడం ప్రారంభించింది. మరో 70 మంది గిరిజనుల భూములపై దౌర్జన్యానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో బాధితులు సిపిఎం నాయకులను ఆశ్రయించి ఆందోళన చేశారు.

గత నిర్వాసితులపౖెెనా దౌర్జన్యం
40 ఏళ్ల కిందట తాటిపూడి రిజర్వాయర్‌ నిర్మాణంతో నిర్వాసితులైన గిరిజనులు మూడు పంటలు పండే భూములను వదులుకుని కిల్తంపాలెం, ముషిడిపల్లి పంచాయతీల పరిధిలో జలాధారం లేని మెట్ట భూములను తీసుకుని అక్కడే జీవిస్తున్నారు. మెట్ట భూముల్లో మామిడి, టేకు, జీడి వంటి తోటలు పెంచుకుని వాటిపై వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. మరికొంతమంది గిరిజన రైతులు బోర్లు వేసుకుని కూరగాయలు సాగుచేస్తున్నారు. గతంలో జిందాల్‌కు భూములు అప్పగించాలని ప్రభుత్వం చెప్పినా, వీరంతా నిరాకరించారు. కానీ ప్రభుత్వం బలవంతం చేయడంతో కొంతమంది లొంగిపోయి భూములను అప్పగించారు. కానీ సుమారుగా 73 కుటుంబాలు భూమిని ఇవ్వలేదు. రెండుసార్లు నిర్వాసితులం కాలేమని తేల్చి చెప్పారు. తాజాగా జిందాల్‌కు అనుకూలంగా వ్యవహరించే వైసిపి అధికారంలోకి రావడంతో గిరిజనుల భూములు లాక్కుని గిరిజనులను రెండోసారి నిర్వాసితులు చేయడానికి సిద్ధమవుతోంది.

దౌర్జన్యం తగదు
తాటిపూడి రిజర్వాయర్‌తో నిర్వాసితులైన గిరిజనుల నుంచి మరోసారి భూములు లాక్కోవడం చట్ట విరుద్దం. భూసేకరణ చట్టం ప్రకారం భూములు తీసుకుని ఐదేళ్లలో కంపెనీ పెట్టకుంటే తీసుకున్న భూములు తిరిగివ్వాలి. కానీ ప్రభుత్వం జిందాల్‌కు అప్పగించిన భూములు తిరిగి తీసుకోకపోగా, మరోసారి భూముల అప్పగింతకు సిద్ధమవ్వడం దుర్మార్గం. ఓల్టా చట్టాన్ని తుంగలో తొక్కి పంటలను ధ్వంసం చేస్తున్నప్పటికీ, అధికారులు పట్టించుకోక పోవడం అన్యాయం. జిల్లా కలెక్టర్‌ స్పందించి జిందాల్‌పై చర్యలు తీసుకోవాలి. లేని యెడల గిరిజనులను సమీకరించి ఉద్యమిస్తాం.
తమ్మినేని సూర్యనారాయణ, సిపిఎం జిల్లా కార్యదర్శి విజయనగరం

Courtesy Prajasakthi…

Leave a Reply