సాహసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు

0
208
సాహసీ, నీ పేరు రాజకీయమా? వర్ధిల్లు
 యోగేంద్ర యాదవ్
(స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు)
Yogendra Yadav

జేఎన్‌యూ ఆలోచిస్తుంది; ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతుంది; ఒక కిండర్ గార్టెన్ లేదా ఒక కోచింగ్ ఫ్యాక్టరీ కావడానికి తిరస్కరిస్తుంది; వ్యథలు చించే ప్రగతిశీల రాజకీయానికి ఊపిరిగా ఉండడానికి సాహసిస్తుంది… కనుకనే ఆ విశ్వవిద్యాలయం పాలకుల కన్నెర్రకు గురవుతున్నది. మరో ఏ ఇతర విశ్వవిద్యాలయంగానైనా జేఎన్‌యూని మార్చివేయడానికి మహారాజశ్రీ ప్రభుత్వం ప్రయత్నిస్తే మరో జేఎన్‌యూగా జ్వలించడమే ప్రతి విశ్వవిద్యాలయం ప్రతిస్పందన అవుతుంది.

ప్రప్రథమంగా, నన్ను నేను జేఎన్‌యూ (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) మేధావర్గానికి చెందినవాణ్ణిగా భావించుకోవడానికి, పిలుచుకోవడానికి ఇష్టపడ్డాను.

అర్ధరాత్రి వేళ.. జేఎన్‌యూ ప్రధాన ప్రవేశ ద్వారం వెలుపల వున్నాను. ముసుగులు ధరించిన గూండాలు తమ పనిని పూర్తి చేశారు; వారిని గౌరవప్రదంగా సాగనంపారు! వారికి మద్దతు తెలిపిన వారూ చెల్లా చెదురైపోయారు. లక్ష్య పరిపూర్తి అయింది కదా వీధి దీపాలు మళ్ళీ వెలిగాయి! ఆపదలో చిక్కుకున్నవారు అపాయం నుంచి బయటపడినప్పుడు గుండె నిండా ఊపిరి పీల్చుకుంటూ తమ తమ భద్రమైన నెలవుల్లోకి తిరిగి వెళ్ళిపోవడం సహజం. అయితే జెఎన్‌యూ విద్యా కుటుంబం (విద్యార్థులు, అధ్యాపకులు) వారు ఎలాంటి అలజడికి తావివ్వకుండా శాంతియుతంగా వచ్చారు. తమ విద్యార్థులకు బాసటగా నిలవడానికి అధ్యాపకులు, ఆచార్యులు వచ్చారు. ముక్తకంఠంతో నినదించారు. నాగరీకంగా నిరసన తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారాన్ని తెరిచారు. కొద్ది గంటల క్రితం ముసుగు వీరులు అపవిత్రం చేసిన తమ నెలవులను మళ్ళీ స్వాయత్తం చేసుకున్నారు.

నేను చాలా గర్వించాను. ఈ ప్రతిష్ఠాత్మక ఉన్నత విద్యా సంస్థకు చెందిన వాడినని ఉప్పొంగిపోయాను. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఆత్మాతిశయాన్ని పొందాను.

జేఎన్‌యూ మేధా వర్గానికి చెందిన వాణ్ణిగా నన్ను నేను భావించుకునేందుకు, పిలుచుకునేందుకు 37 సంవత్సరాలుగా నేను ఇష్టపడలేదు. అటువంటి ఆలోచనను ప్రతిఘటించాను. బహుశా, అది నా స్వభావం కావచ్చు. ఎందుకంటే ఎటువంటి సంకుచిత ధోరణులు – కుల, మత, కుల , వర్గ, తెగ, క్లబ్, పాఠశాల, గ్రామం, జాతి, పార్టీ, మరేదైనా సరే- నాకు సరిపడవు. ఏ పేరుతోనైనా సరే సంస్థాగతమైన- స్టీఫెనియన్, ఆక్సోనియన్, జేఎన్‌యూ యైట్ – గర్వ ప్రదర్శనను నేను అంగీకరించలేను. జేఎన్‌యూ మేధావులనేవారు కొంత మంది ఇటువంటి అభిజాత్యాలను చూపడం కద్దు. ఈ కారణంగానే జేఎన్‌యూ మేధా వర్గం వారి మాటామంతీ, ఇష్టాగోష్ఠి సమావేశాలకు నేను దూరంగా వుండే వాణ్ణి. జేఎన్‌యూలోని వామపక్ష వాదులకు, నాకు మధ్య మేధోపరమైన, సైద్ధాంతికమైన అంతరం ఎంతైనా వుండేదని మరి చెప్పనవసరం లేదు.

1980 దశకం తొలి సంవత్సరాలలో ఆ విశ్వ విద్యాలయంలో బోధించిన మార్క్సిజం చాల వరకు యాంత్రికమైనది, తర్క వితర్కాలతో కూడినదై వుండేది. కొంత మంది అధ్యాపకులు మార్క్స్, ఇతర మార్క్సిస్టుల రచనలను మాకు పరిచయం చేసిన తీరు, వాటికి వారు చెప్పిన భాష్యాలు కృత్రిమంగా, ఆడంబర పూర్వకంగా వుండేవి. ఇది నన్ను సంప్రదాయ వామపక్ష వాదులకు మరింత దూరం చేసింది. నా సమకాలీనులు పలువురిలో ఉన్న విధంగా, సోవియట్ యూనియన్ పట్ల నాకు ఆరాధనా భావం వుండేదికాదు. అలాగే భారతీయ కమ్యూనిస్టుల భావాలు, కార్యాచరణలతో కూడా నేను ఏమంతగా ఏకీభవించే వాణ్ణి కాదు. నక్సలైట్ల సిద్ధాంతాలు, ఆచరణలు కూడా నన్ను మేధోపరంగానూ, నైతికంగానూ నిరుత్సాహపరిచాయి. సువ్యవస్థిత సంప్రదాయాలు, ధోరణుల పట్ల నాలో బలంగా నాటుకుపోయిన వ్యతిరేకత వాస్తవానికి ఉన్నత విద్యా వ్యవస్థలో ఆధిపత్యం చెలాయిస్తున్న వామపక్ష అనుకూల వర్గాల పట్ల తీవ్ర అసంతృప్తి వల్లే జనించిందని చెప్పక తప్పదు.

ఈ అనుభవాలన్నీ అప్పట్లో నా రాజకీయాలను ప్రభావితం చేశాయి. అప్పట్లో జేఎన్‌యూలో అత్యంత ప్రభావశీలంగా వున్న కమ్యూనిస్టు విద్యార్థి సంఘాలు ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌లలో కాకుండా సమతా యువజన సభలో నేను చేరాను. నాకు సీనియర్ అయిన సునీల్, రాజకీయాలలో చేరేలా నన్ను ఎంతగానో ప్రభావితం చేశాడు. నా రాజకీయ గురువు కిషన్ పట్నాయక్‌ను నేను జేఎన్‌యూలోనే కలుసుకున్నాను. నా మేధాసక్తులను అమితంగా ప్రభావితం చేసిన సచ్చితానంద్ సిన్హా కూడా నాకు ఆ విశ్వవిద్యాలయంలోనే పరిచయమయ్యారు. జేఎన్‌యూ అంటే నాకు, మార్క్స్, లెనిన్‌లను కనుగొని, వారి స్ఫూర్తిని ఆవాహన చేసుకోవడం గాకుండా, మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియాలను మరింత ప్రగాఢంగా అధ్యయనం చేసేందుకు పురిగొల్పిన జ్ఞాన వాటిక.

గత కొద్ది సంవత్సరాలుగా విద్యారంగంలో వామపక్షాల ప్రభావం తగ్గి పోతున్న కొద్దీ, ప్రభుత్వాలను నడిపిన రాష్ట్రాలలో కూడా అవి ప్రజాదరణ ను కోల్పోతున్న కొద్దీ , వాటి పట్ల నా వ్యతిరేకత సడలిపోతూ వున్నది. భారతీయ జనతా పార్టీ రాజకీయ ఆధిపత్యం అంతకంతకూ పెరిగిపోతోన్న కొత్త రాజకీయ వాతావరణంలో పాత విభేదాలను, పోరాటాలను కొనసాగించడం అవివేకమవుతుందని నేను భావిస్తున్నాను.

గడచిన కాలాన్ని సింహావలోకనం చేసుకుంటే భారతదేశపు రాజకీయ జీవితానికి వామపక్షాలు విశిష్ట సేవలనందించాయని నిస్సందేహంగా చెప్పితీరాలి. ‘బూర్జువా ప్రజాస్వామ్యం’, సంస్కృతి పట్ల ఎంత తిరస్కార భావ మున్నప్పటికీ మన ప్రజాస్వామిక వ్యవస్థ ప్రజాస్వామ్య స్వభావాన్ని సమున్నతంగా ఉంచేందుకు; ప్రజాసంస్కృతి, ప్రజా జీవనం ప్రజానుకూలంగా వుండేందుకు వామపక్షాలు ఇతోధికంగా దోహదం చేశాయి.

జేఎన్‌యూ వామపక్ష విద్యార్థి రాజకీయాలలో లొసుగులు, లోపాలకు కొదవేమీ లేదు. అయితే సంపన్న, అగ్రకులాల నేపథ్యం నుంచి వచ్చిన భారతీయ యువజనులకు తాము నివశిస్తున్న సమాజపు కఠోర వాస్తవాల పై అవగాహన కల్పించి, వాటిని మార్చేందుకు వారిని పురిగొల్పడంలో ఆ విద్యార్థి రాజకీయాల పాత్ర అవిసర్మణీయమైనది. ఒక ఉన్నత విద్యా సంస్థగా జేఎన్‌యూ మన సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన అసంఖ్యాక యువజనులను ఉత్కృష్ట విద్యావంతులుగా తీర్చి దిద్ది , వారికి ఒక గౌరవనీయమైన వృత్తి జీవితాన్ని సమకూర్చి, జీవితాన్ని అర్థవంతం చేసుకునేందుకు విశేషంగా తోడ్పడింది.

మరి ఈ విశ్వ విద్యాలయం భారతీయ రాజకీయ రంగానికి ఎంతో మంది నాయకులను సమకూర్చడంలో ఆశ్చర్యమేముంది? మీరు మార్క్సిస్టు కాకపోవచ్చు (నేను నిశ్చితంగాకాను) గానీ మన సమాజాన్ని అర్థం చేసుకోవడంలో మార్క్సిస్టు మేధావులు అందించిన తోడ్పాటును మీరు నిరాకరించలేరు. మన దేశంలో సామాజిక శాస్త్రాల అధ్యయనం, పరిశోధనలను మార్క్సిస్టులు అర్థవంతమూ, సమున్నతమూ చేశారనడంలో సందేహమేమీ లేదు.

నేనూ జేఎన్‌యూకి ఎంతో రుణపడివున్నాను. ప్రొఫెసర్ సుదీప్త కవిరాజ్, రాజీవ్ భార్గవ లాంటి గొప్ప ఆచార్యుల వద్ద నేను చదువుకున్నాను. ఈ మహదవకాశాన్ని జేఎన్‌యూనే నాకు కల్పించింది. దేశంలోని ఇతర ఉన్నత విద్యా సంస్థలతోను, ప్రపంచంలోని విఖ్యాత విశ్వ విద్యాలయాలతో పోల్చిచూసినప్పుడు కూడా జేఎన్‌యూ ఒక ప్రశస్త విశ్వవిద్యాలయమని, వాస్తవానికి అది మన జాతి ఆస్తి అని ఎటువంటి సంకోచం లేకుండా చెప్పవచ్చు.

జేఎన్‌యూ గురించిన నా అభిప్రాయాలు మారినప్పటికీ నేను ఆ విశ్వ విద్యాలయ వ్యవహారాల తటస్థ పరిశీలకుడుగానే కొనసాగాను. జేఎన్‌యూ మేధా వర్గానికి చెందిన వాడినిగా భావించలేదు. గత నాలుగు సంవత్సరాలుగా చోటుచేసుకున్న వివిధ పరిణామాలతో ఇదంతా మారిపోయింది. ప్రస్తుత పాలకులకు ఒక ఆంతరంగిక శత్రువు అవసరం ఎంతైనా వున్నది. అందుకే వారు జేఎన్‌యూపై తమ దృష్టిని కేంద్రీకరించారు. ఆ సుప్రసిద్ధ ఉన్నత విద్యా సంస్థను తమ లక్ష్యంగా చేసుకున్నారు. తత్ఫలితమే జేఎన్‌యూపై రాజ్యవ్యవస్థ బహుముఖీనమైన దాడులు జరుపుతోంది.

జేఎన్‌యూని ఓడించేందుకు అవసరమైన మేధా వనరులు తమకు కొరవడ్డాయన్న వాస్తవాన్ని అర్థం చేసుకున్న పాలకులు తమకు సానుకూలంగా వ్యవహరించే మీడియా సహకారంతో ఆ విశ్వ విద్యాలయాన్ని అప్రతిష్ఠ పాలుచేయడానకి సకల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతోపాటు కేంపస్ రాజకీయాలపై రాజకీయ దాడి చేశారు. విశ్వ విద్యాలయ అధికార యంత్రాంగం కూడా ఈ వ్యవహారంలో తన వంతు పాత్ర పోషించింది. జేఎన్‌యూ స్వతసిద్ధ వ్యక్తిత్వాన్ని సమూలంగా మార్చి వేసి, దాన్ని సర్వనాశనం చేసేందుకు ప్రస్తుత వైస్ ఛాన్సలర్‌ను నియమించారు. పోలీసు రక్షణతో గూండాల దాడి ఈ సమున్నత విద్యా సంస్థను సంపూర్ణంగా ధ్వంసం చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియకు పరాకాష్ఠ. గూండాల దాడి ఒక నిర్ణయాత్మక అంతిమ చర్య.

ఈ నిరంతర దాడులతో తల్లడిల్లుతూనే దేశ పాలకులు ఆకాంక్షించని ఒక సమున్నత ఆదర్శానికి లేదా సమర్థంగా వ్యవహరించలేని ఒక వాస్తవానికి ప్రతీకగా జేఎన్‌యూ నిలిచింది. ఆ విఖ్యాత విశ్వవిద్యాలయం ఇప్పుడు ప్రజాస్వామిక అసమ్మతికి ఒక సంకేతంగా వున్నది. దేశ పాలకులు జేఎన్ యూని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? జేఎన్‌యూ ఆలోచిస్తుంది; ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతుంది; ఒక కిండర్ గార్టెన్ లేదా ఒక కోచింగ్ ఫ్యాక్టరీ కావడానికి తిరస్కరిస్తుంది; వ్యథలు చించే ప్రగతిశీల రాజకీయానికి ఊపిరిగా ఉండడానికి సాహసిస్తుంది.. కనుకనే ఆ విశ్వవిద్యాలయం పాలకుల కన్నెర్రకు గురవుతున్నది. ఈ అనాగరిక వ్యవహారాన్ని ప్రతిఘటించడం మినహా మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. మరో ఏ ఇతర విశ్వవిద్యాలయంగానైనా జేఎన్‌యూని మార్చివేయడానికి మహారాజశ్రీ ప్రభుత్వం ప్రయత్నిస్తే మరో జేఎన్‌యూగా జ్వలించడమే ప్రతి విశ్వవిద్యాలయం ప్రతిస్పందన అవుతుంది.

(Courtesy Andhrajyothi)

Leave a Reply