చెరుకూరి సత్యనారాయణ
ఎనిమిదేళ్ళ క్రితం నాటి మాట. 2013 మార్చి 9వ తేదీ అన్ని దినపత్రికల్లో ఒక వార్త వచ్చింది. అంతకుముందు రోజు పదవీ విరమణ చేసిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు చాలా కేసుల్లో తుది తీర్పులిచ్చి చివర్లో కోర్టులో అందరికీ నమస్కరించి తన ఉద్యోగ బాధ్యతల్లో తనకు సహకరించిన కిందస్థాయి ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేసి, ఉదయం తాను ఎక్కి వచ్చిన అధికార వాహనాన్ని అక్కడే వదిలేసి ఆరోజు వరకు తనకు సేవలందించిన డ్రైవర్‌కి కృతజ్ఞతలు తెలిపి నడుచుకుంటూ రోడ్డుపైకి వెళ్లి, అక్కడ ఒక టీ స్టాల్‌లో టీ తాగి లోకల్ ట్రయిన్‌లో ఇంటికెళ్లిపోయారని ఆ వార్త సారాంశం. ఆ న్యాయమూర్తి పేరు జస్టిస్ కె. చంద్రు.
అరుదైన న్యాయమూర్తి, సందేహం లేదు. ఆయన ఛాంబర్ బయట ‘ఇక్కడెవరూ దేవుళ్లు లేరు మీరు పూలదండలు, బొకేలు తీసుకురాకండి; ఇక్కడెవరూ ఆకలితో నకనకలాడటం లేదు కనుక పండ్లూ, స్వీట్లూ తీసుకురాకండి; ఇక్కడెవరూ చలితో వణికిపోవటం లేదు కనుక శాలువాలు తేకండి’ అని రాసి ఉన్న బోర్డు ఉండేదట. ఆయన 2006 నుంచి 2013 వరకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
1951 మే 8న తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన చంద్రు విద్యార్ధి జీవితమంతా కష్టాల బాటలో సాగింది. మద్రాసు లయోల కాలేజీ నుంచి బహిష్కృతుడై మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరి చదివాడు. హాస్టల్ సీటు కోసం నిరాహార దీక్ష చేయాల్సివచ్చింది.
న్యాయమూర్తిగా ఉన్న కాలంలో ఎన్నో ప్రజాస్వామికమైన, ప్రజలకు న్యాయం కలుగజేసే తీర్పులు వెలువరించారు. న్యాయవాదులు న్యాయమూర్తిని ‘‘మై లార్డ్’’ (నా ప్రభువా) అని సంబోధించటంలో అర్థంలేదని అన్నారు. తన కారుపై వెలిగే ఎర్రబల్బును, సైరన్‌ని తొలగించారు. సెక్యూరిటీని నిరాకరించారు. ఆలయ పూజారులగా మహిళల్ని నియమించవచ్చని, కులాలకతీతంగా శ్మశానాలు ఉండాలని ఇంకా బిళ్ల జవానుల డ్రస్‌కోడ్‌ని మార్చే విషయంలోనూ, పత్రికాస్వేచ్ఛకి సంబంధించి గొప్ప తీర్పులిచ్చారు. నాకు బాగా పరిచయమున్న నిజాయితీపరుడైన ఒక హైకోర్టు న్యాయమూర్తిని పదవీ విరమణ తర్వాత అధికార వాహనంలో ఎందుకొచ్చారని ప్రశ్నించాను. పదవీ విరమణ చేసిన రోజు రాత్రి 12 గంటల వరకూ నేను హైకోర్టు జడ్జి హోదాలోనే ఉంటాను కనుక అధికార వాహనం వాడుకునే హక్కు ఉందని చెప్పాడు.
న్యాయవాదిగా కూడా చంద్రు వాదించిన కేసులు ప్రజాస్వామ్య హక్కులకు, మానవ హక్కులకు ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. అత్యవసర పరిస్థితి రోజుల్లో సి.పి.ఎం.కి చెందిన యువజన సంఘంలో ఆయన పనిచేస్తున్న రోజుల్లో, నాగమణి అనే మహిళ తనకు జరిగిన అన్యాయాల గూర్చి దేశ ప్రజల దృష్టికి తేగలిగింది. నిరక్షరాస్యురాలైన ఆ మహిళ అంతగా పోరాడుతుండే తానెందుకు మౌనంగా ఉండాలని భావించిన చంద్రు సి.పి.యం పార్టీ సహకారంతో అనేక కేసుల్లో పేదలు, మహిళలు, ప్రజల పక్షాన నిలిచాడు. ప్రజల హక్కులకోసం వాదించిన ఏ కేసులోనూ ఆయన ఫీజు తీసుకోలేదట. జస్టిస్ చంద్రు 2018లో ఒక సెమినార్‌లో ప్రసంగించటానికి విజయవాడ, హైదరాబాద్ వచ్చారు.
1993లో చంద్రు వాదించిన ఓ కేసు ఆధారంగా నిర్మితమై, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్న ‘జైభీమ్’ సినిమాతో ఇక ఆయన దేశంలో ఎక్కడికి వెళ్లినా సభ నిర్వహించటానికి సరిపోయే సమావేశ మందిరాలు ఉండకపోవచ్చు. లిజోమల్‌జోస్, మణికంఠన్‌ల సహజ నటన, దర్శకుడు జ్ఞానవేల్ ప్రతిభను పక్కన పెడితే, అత్యంత ఆదర్శప్రాయుడైన జస్టిస్ చంద్రు జీవితాన్ని ఈ ‘జై భీమ్’ సినిమా దేశ ప్రజల ముందుకు తేవటంలో విజయవంతమైంది.
జస్టిస్ చంద్రు విద్యార్ధి దశలోనే వామపక్ష భావాలకి ఆకర్షితుడై సి.పి.ఎం. పార్టీలో పూర్తి కాలం పనిచేశారు. శ్రీలంకలో భారత సైన్యాల ప్రవేశాన్ని వ్యతిరేకించి పార్టీ క్రమశిక్షణ చర్యలకు గురైయ్యారు. విద్యార్ధి ఉద్యమాల్లో పాల్గొన్నందుకు మద్రాసు లయోలా కాలేజి నుండి బహిష్కరింపబడ్డారు.
వామపక్ష విద్యార్ధి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో న్యాయమూర్తులైన జస్టిస్ రమణ, జస్టిస్ ఆమంచర్ల గంగాధరరావు, జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ కె.జి. శంకర్, జస్టిస్ టి. రజని, నంబూద్రిపాద్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన జస్టిస్ కృష్ణయ్యర్, వామపక్ష సానుభూతిపరులైన జస్టిస్ చిన్నపరెడ్డి, జస్టిస్ జీవన్‌రెడ్డి లాంటి వారు ఉన్నారు. సమాజంపై జస్టిస్ చంద్రు చూపినంత ప్రభావాన్ని వారెవ్వరూ చూపలేదేమో! చంద్రు న్యాయమూర్తిగా 90వేల పై చిలుకు కేసులు పరిష్కరించారని రికార్డులు చెబుతున్నాయి. న్యాయవాదిగా నాకున్న నాలుగు దశాబ్దాల అనుభవంతో ఆలోచిస్తే ఇది అసంభవం అనిపిస్తుంది. కాని జస్టిస్ చంద్రు దాన్ని సంభవం చేశారు. బహుశా ప్రపంచ న్యాయచరిత్రలోనే ఈ రికార్డు నభూతో నభవిష్యతి.
Courtesy Andhrajyothi