కఫిల్‌ఖాన్‌ నిర్దోషి     

0
242

                                                 

– చిన్నారులపై మృతికి అతను కారణం కాదు
– తేల్చిన విచారణ కమిటీ

లక్నో : గోర్‌ఖ్‌పూర్‌ బీఆర్‌డీ వైద్య కళాశాలలో ఆక్సిజన్‌ అందక చిన్నారులు మృతిచెందిన ఘటనలో ఆస్పత్రి వైద్యుడు కఫిల్‌ఖాన్‌ను విచారణ కమిటీ నిర్దోషిగా తేల్చింది. 2017 ఆగస్టులో ఆక్సిజన్‌ సరఫరా సక్రమంగా లేకపోవడంతో 60 మందికి పైగా చిన్నారులు మరణించిన విషయం తెలిసిందే. వైద్య నిర్లక్ష్యం, అవినీతి, విధులను సక్రమంగా నిర్వహించకపోవటం వంటి అభియోగాలతో కఫీల్‌ ఖాన్‌ను సస్పెండ్‌ చేశారు. జైల్లో పెట్టారు. అతనిపై ఉన్న ఆరోపణలు నిరాధరమైనవని సీనియర్‌ ఐఏఎస్‌ హిమాన్ష్‌ కుమార్‌ నేతృత్వంలోని కమిటీ తేల్చింది. 15 పేజీల నివేదికను ప్రభుత్వానికి కమిటీ సమర్పించింది. పరిస్థితిని నియంత్రించేందుకు ఘటన జరిగిన రోజు ఆయన తీవ్రంగా కృషిచేశారని నివేదికలో పేర్కొన్నారు. ఆక్సిజన్‌ కొరత గురించి ఆయన సమాచారం ఇస్తూనే ఉన్నారనీ, అలాగే ఏడు ఆక్సిజన్‌ సిలిండర్లను కూడా ఆయన వ్యక్తిగత సామర్థ్యంతో సమకూర్చారనీ తెలిపింది. 2016 వరకూ ఆయన ప్రయివేటు ప్రాక్టీస్‌ చేశారనీ, ఆ తర్వాత ఆయన దానిని నిలిపివేసినట్టు పేర్కొన్నారు. అలాగే బీఆర్‌డీ ఆస్పత్రిలోని మెదడువాపు వ్యాధి వార్డుకు కఫిల్‌ నోడల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కూడా కాకపోవటం మరో అంశం. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తప్పును వైద్యునిపై రుద్దినట్టు అప్పట్లో ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి కోర్టు కఫిల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. తొమ్మిది నెలల పాటు జైలులో గడిపిన అనంతరం మాత్రమే కఫీల్‌ ఖాన్‌ బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, కమిటీ తనకు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంపై కపిల్‌ స్పందించారు. తనపై పడిన హంతకుడనే ముద్ర తొలగిపోయిందన్నారు. ఆక్సిజన్‌ అందక మరణించిన చిన్నారుల తల్లిదండ్రులు ఇంకా న్యాయం కోసం వేచిచూస్తున్నారనీ, వారికి న్యాయం అందాలని. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు.

Courtesy Navatelangana…

Leave a Reply