కష్టాల్లో కమలా నెహ్రూ కాలేజీ.. ఇక ప్రైవేటుకేనా?

0
294

వేధిస్తున్న ఫ్యాకల్టీ కొరత.. జీతాలు చెల్లించని సర్కారు
నిర్వహణ భారంతో  ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీగా మార్చేందుకు ప్రయత్నాలు
ఆసియాలోనే తొలి మహిళా పాలిటెక్నిక్​ కాలేజీని కాపాడుకునేందుకు ఉద్యమం

హైదరాబాద్ : ఆసియాలోనే మొట్టమొదటి మహిళా పాలిటెక్నిక్​ కాలేజీ అది. ఎందరో పేద అమ్మాయిలకు విద్యాబుద్ధులు చెప్పి.. ఉన్నత శిఖరాలకు చేర్చిన 60 ఏండ్ల ఘన చరిత్ర దాని సొంతం. ఆ కాలేజీని ఇప్పుడు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. ఫ్యాకల్టీ కొరత, జీతాలకు నిధులు లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆ ఎయిడెడ్​ డిప్లొమా కాలేజీని ప్రైవేట్​ ఇంజనీరింగ్​ కాలేజీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్​లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్ మహిళా కాలేజీ. దీన్ని ప్రైవేట్​​ కాలేజీగా మారిస్తే  ఎందరో పేద బాలికలకు పాలిటెక్నిక్​ విద్య దూరం అవుతుందని, పూర్వ విద్యార్థులు వాపోతున్నారు.

నెహ్రూ నెలకొల్పిన కాలేజీ
గ్రామీణ, పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలకు సాంకేతికతతో కూడిన చదువును అందించాలని, వారికి సమాన అవకాశాలను కల్పించాలని 1961లో నాటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఒక కాలేజీని నిర్మించాలని అనుకున్నారు. ఇందుకోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఐదెకరాల భూమిని కేటాయించారు. అలా 1962లో జవహర్ లాల్ నెహ్రూ తన భార్య కమలా నెహ్రూ పేరు మీద పాలిటెక్నిక్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. సువిశాల స్థలంలో నిర్మించిన ఈ కాలేజీని 1966లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రారంభించారు.

ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహణలో..
ప్రభుత్వ భూమిలో, ప్రభుత్వం నిర్మించిన బిల్డింగ్ లో నడుస్తున్న ఈ కాలేజీ నిర్వహణను నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ చూసుకుంటోంది. సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తున్న నిధులతో దీన్ని కొనసాగిస్తున్నారు. 60 ఏండ్లుగా మంచిగానే నడిచిన కాలేజీకి గతేడాది నుంచి కష్టాలు మొదలయ్యాయి. 115 పోస్టులకు 34 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. అందులో 56 టీచింగ్ స్టాఫ్ పోస్టుల్లో కేవలం తొమ్మిది మంది లెక్చరర్లు, ఒక ప్రిన్సిపల్ మాత్రమే ఉన్నారు. చాలా ఏండ్లుగా 39 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లతో క్లాసులు చెప్పిస్తున్నారు. గతేడాది వరకు రాష్ట్ర ప్రభుత్వమే కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలు ఇచ్చింది. అయితే ఈ ఏడాది నుంచి చెల్లించలేమని చెప్పేసింది. దీంతో తాము కూడా ఆ ఆర్థిక భారాన్ని భరించలేమని ఎగ్జిబిషన్​ సొసైటీ చేతులెత్తేసింది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీగా అప్ డేట్ చేయాలని నిర్ణయించింది.

ఎక్కువ మంది పేదలే 
పదో తరగతి తర్వాత ఇంటర్‌‌తో పాటు పాలిటెక్నిక్  చేసే చాన్స్ ఉంటుంది. టెక్నికల్ కోర్సులు చేసి, ఆయా రంగాల్లోకి వెళ్లాలనుకునే వారికి పాలిటెక్నిక్  బెస్ట్ ఆప్షన్. ఈ మూడేండ్ల డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఆయా రంగాల్లో ఉద్యోగాలు పొందొచ్చు. లేదా ఈ-సెట్ ద్వారా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో జాయిన్ అవ్వొచ్చు. ఇలాంటి అవకాశం ఉండటంతో చాలామంది అమ్మాయిలు పాలిటెక్నిక్  చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏటా కమలా నెహ్రు కాలేజీలో 380 మందికి పైగా అడ్మిషన్లు పొందుతుంటారు. అన్నీ కోర్సులు కలిపి 1,100  నుంచి 1,300 మంది వరకు చదువుతున్నారు. ఇందులో 90 శాతానికి పైగా నిరుపేద, గ్రామీణ స్టూడెంట్లే ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేయాలని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రభుత్వానికి లెటర్​ రాసింది.

అన్నీ రకాల కోర్సులతో
ఈ కాలేజీలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, సివిల్స్, ఆర్కిటెక్చర్, ఫార్మసీ, ఫ్యాషన్ టెక్నాలజీ వంటి కోర్సులు ఉన్నాయి. ఇవన్నీ మార్కెట్‌‌లో డిమాండ్ ఉన్నవే.  అందుకే చాలామంది ఈ కాలేజీలో సీటు కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక్కడ చదివిన వారెందరో మంచి ఉద్యోగాలు సంపాదించారు. అయితే సొసైటీ ఈ కాలేజీని విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.

ఫండ్స్​ కొరత
జీహెచ్ఎంసీ టాక్స్‌‌లు, కరెంట్ బిల్లులు, అన్ ఎయిడెడ్ స్టాఫ్ జీతాలు వంటివి కట్టలేకపోతున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ చెప్తోంది. తాము 19 ఇన్​స్టిట్యూట్స్ కు సపోర్ట్ ఇస్తున్నామని, కానీ ఇప్పుడు ఫండ్స్ లేకపోవడం వల్ల ఆర్థికంగా కష్టాల్లో ఉన్నామని అంటోంది.  డిప్లొమా కోర్సులు కంటిన్యూ చేయడానికి టీచింగ్ ఫ్యాక్టలీని నియమించాలని కోరుతూ గవర్నమెంట్ కు పదుల సంఖ్యలో లెటర్లు రాశామని, విద్యాశాఖ మంత్రిని కలిసి మెమొరాండం ఇచ్చామని కమలా నెహ్రూ కాలేజీ చైర్మన్ గంగాధర్  అన్నారు. ఫ్రీ సీట్ స్టూడెంట్స్ కు  అనుమతి ఇస్తున్నప్పుడు, లెక్చరర్ల పోస్ట్ లను భర్తీ చేసి, వారి జీతాలను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలా కానప్పుడు తమకు కన్వీనర్ కోటాలో స్టూడెంట్స్ ఉన్నారని, సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్ లో డిప్లొమా కోర్సులు కంటిన్యూ చేస్తామని, ఈ ఇయర్ ఫ్రీ అడ్మిషన్లు ఆపేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

ప్రైవేట్‌కు ఒప్పుకోం
ఎంతోమంది ఆడపిల్లలు ముందుకు వచ్చి కమలా నెహ్రూ పాలిటెక్నిక్​ కాలేజీలో చదువుకుని తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. ఎన్నో ఏండ్లుగా ఉన్న ఈ కాలేజీని ప్రైవేట్​ ఇంజనీరింగ్ కాలేజీగా మారుస్తామంటే మేం ఒప్పుకోం. ఇందులో గవర్నమెంట్ ఇన్వాల్వ్  అవ్వాలి. ఇప్పటివరకు ఎగ్జిబిషన్ సొసైటీకి ఎన్నో ఫండ్స్ వచ్చాయి. వాటిని కాలేజీ కోసం ఖర్చు చేస్తే తప్పేంటి?                                   – ప్రమీల, సేవ్ కమలా నెహ్రు మహిళా    పాలిటెక్నిక్ కాలేజ్ కమిటీ ప్రతినిధి

Courtesy V6velugu

Leave a Reply