- కామారెడ్డిలో వివాదాస్పద ప్రణాళిక ఎట్టకేలకు రద్దు!
- ప్రకటించిన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
- దీనికిముందు రద్దుకు మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం
- ఫలించిన పోరాటం.. తమ విజయమన్న రైతు జేఏసీ
- జగిత్యాలలోనూ మాస్టర్ ప్లాన్ రద్దుకు కౌన్సిల్ తీర్మానం
కామారెడ్డి : అన్నదాతల పోరాటం ఫలించింది. నెలన్నర పైగా చేస్తున్న సుదీర్ఘ ఆందోళనకు ఫలితం దక్కింది. అధికార పార్టీ దిగొచ్చింది. వివాదాస్పద కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దయింది. ఈ మేరకు మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ కమిషనర్ దేవేందర్‌తో సుదీర్ఘంగా సమీక్షించారు. మాస్టర్ ప్లాన్‌పై రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాల మీద చర్చించారు. అనంతరం ముసాయిదా మాస్టర్‌ప్లాన్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. మునిసిపాలిటీలో కలిసిన గ్రామాల ప్రజల అభిప్రాయాలు తీసుకుని అందరి సమన్వయంతో కొత్త ప్లాన్‌ను రూపొందిస్తామని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌తో రైతుల భూమిని సేకరించే ఉద్దేశం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయ భూముల్లో రైతులకు నష్టం జరగకుండా కొత్త రోడ్లను నిర్మిస్తామన్నారు. మరోవైపు శుక్రవారం చైర్‌పర్సన్ నిట్టు జాహ్నవి అధ్యక్షతన మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
ముసాయిదా మాస్టర్‌ప్లాన్‌ను రద్దుచేస్తూ చైర్‌పర్సన్ తీర్మానం చేయగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్లు మీర్జా హఫీజ్‌బేగ్, శ్రీకాంత్‌కుమార్, అన్వర్ హైమద్ సయ్యద్ బలపర్చారు. మిగతా కౌన్సిలర్లు ఏకగీవ్రంగా ఆమోదించారు. ఇక పాలకవర్గం ప్రభుత్వానికి నివేదించిన ముసాయిదా మాస్టర్ ప్లాన్‌ను కాకుండా అందులో మార్పుచేర్పులు చేసి, ఢిల్లీలోని డిజైన్ అండ్ డెవల్‌పమెంట్ ఫోరమ్ (డీడీఎఫ్), రాష్ట్ర డీటీసీపీ (డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్) జాయింట్ డైరెక్టర్ రమేష్ బాబు గందరగోళానికి కారణమయ్యారని కౌన్సిల్ తప్పుబట్టింది. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదించింది.
జగిత్యాలలో ఎమ్మెల్యే సమక్షంలో..
జగిత్యాల టౌన్: కొత్త మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు కోరు తూ జగిత్యాల మునిసిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 10 రో జులుగా వివిధ గ్రామాల ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పుతో నిరసన తెలియజేస్తుండడంతో.. మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం చైర్‌పర్సన్ బోగ శ్రావణి అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసరంగా సమావేశమైంది. ఎక్స్ అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, కాంగ్రెస్, బీజేపీతో పాటు బీఆర్‌ఎస్, స్వతంత్ర కౌన్సిలర్లు హాజరయ్యారు. మాస్టర్‌ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ, మరో ప్లాన్ రూపొందించేందుకు కమిటీ వేయాలని కోరుతూ చైర్‌పర్సన్ తీర్మానం ప్రవేశపెట్టారు. కాగా, కామారెడ్డి, జగిత్యాలలో మాస్టర్ ప్లాన్ల రద్దును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రైతుల విజయంగా అభివర్ణించారు. రైతులు చూపి న పోరాట స్ఫూర్తికి అభినందనలు తెలిపారు.