కాన్పూర్‌లో దారుణం; ఎన్‌హెచ్ఆర్సీ ఆగ్రహం

0
36

న్యూఢిల్లీ : కాన్పూర్ నగరంలోని బాలికల వసతిగృహంలో ఉన్న 57 మంది బాలికలకు కరోనా సోకడంతోపాటు వారిలో ఏడుగురు గర్భం దాల్చడం, మరో బాలిక హెచ్ఐవీ పాజిటివ్ అని తేలిన ఘటనపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు యూపీ డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ వసతిగృహంలో బాలికలకు కరోనా రావడంతోపాటు గర్భం దాల్చిన ఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా విచారణకు స్వీకరించిన మానవహక్కుల కమిషన్ అధికారుల వైఫల్యంపై నివేదిక సమర్పించాలని యూపీ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తు జరిపించి కేసులు నమోదు చేయాలని కమిషన్ డీజీపీని కోరింది.

ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సూచించింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని యూపీ మహిళా కమిషన్ ఉపాధ్యక్షురాలు సుష్మాసింగ్ కాన్పూర్ జిల్లా కలెక్టరును ఆదేశించారు. గర్భం దాల్చిన బాలికలు అత్యాచార బాధితులని వారిలో ఇద్దరికి 8నెలలని అధికారులు చెప్పారు. కొందరు బాలికలు వసతిగృహానికి వచ్చే ముందే గర్భం దాల్చారని అధికారులంటున్నారు. ఈ ఘటనపై కాన్పూర్‌ కలెక్టర్‌ విచారణకు ఆదేశించారు.వివిధ జిల్లాల నుంచి బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు ఈ బాలికలను డిసెంబరులో వసతి గృహంలో చేర్చారని, వారు అప్పటికే గర్భంతో ఉన్నారని తెలిపారు. అయితే, ఈ ఆరేడు నెలల్లో ఆ విషయం బయటకు రాకపోవడం గమనార్హం. మరోవైపు షెల్టర్‌ హోంలో కరోనా సోకిన ఇద్దరిని సిబ్బంది ఆస్పత్రికి తీసుకెళ్లి, తీసుకొచ్చే క్రమంలో మిగతావారికీ వైరస్‌ అంటుకుంది.

Courtesy Andhajyothy

Leave a Reply