అర్ధసత్యాలతో న్యాయం జరిగేనా?

0
251
రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

‘జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు’ అయిన బాధాసర్పదష్టుల దుఃఖోపశమనానికి దోహదం చేయడం కంటే కళకు సార్థకత ఏముంటుంది? ‘కశ్మీర్ ఫైల్స్’కు చాలాకాలం ముందే ‘పర్జానియా’ అనే సినిమా వచ్చింది. 2002 గుజరాత్ మతోన్మాద హింసాకాండలో యవ్వనారంభంలో ఉన్న కుమారుడిని కోల్పోయిన ఒక పార్శీ కుటుంబ దుఃఖభరిత గాథకు అద్దం పట్టిన చిత్రమది. జాతీయ అవార్డు పొందిన ఈ సినిమా అహ్మదాబాద్‌లో విడుదలవనున్న తరుణంలో దర్శకుడు రాహుల్ ధోలాకియాకు మల్టిప్లెక్స్ థియేటర్ అసోసియేషన్ నుంచి పిలుపు వచ్చింది. స్థానిక భజ్‌రంగ్‌దళ్ నాయకుడు బాబు భజ్‌రంగి అనుమతిస్తేనే తాము ‘పర్జానియా’ను ప్రదర్శిస్తామని ధొలాకియాకు ఆ అసోసియేషన్ స్పష్టం చేసింది. మరి భజ్‌రంగి మహాశయుడు 2002 గుజరాత్ హింసారిరంసలో హంతక మూకలకు నాయకత్వం వహించిన దళపతి. ‘పర్జానియా’ విడుదల వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు గుజరాత్ ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో ‘పర్జానియా’ను విడుదల నుంచి ఉపసంహరించుకోవడం మినహా ధోలాకియాకు గత్యంతరం లేకపోయింది. ‘సత్యాన్ని’ దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చిన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు. అంతేనా? ప్రతి ఒక్కరూ ఆ సినిమాను చూసేలా ప్రోత్సహించాలని తమ పార్టీ ఎంపీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అహ్మదాబాద్‌లో ‘పర్జానియా’ విడుదలకు అభ్యంతరాలు ఎదురైన సమయంలో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు మరి.

యథార్థాలు ఇబ్బందికరంగా ఉంటాయి. చరిత్ర నుంచి యథార్థాలను ఎవరు తుడిచిపెట్టగలరు? కనుకనే రాజకీయ నాయకులు, వారి మద్దతుదారులు చారిత్రక సత్యాలను ఎదుర్కోలేరు, భరించలేరు. ఈ పచ్చి నిజం అన్ని పార్టీల వారికీ వర్తిస్తుంది సుమా! 1984లో సిక్కుల ఊచకోతపై మీరొక సినిమాను తీయండి. కాంగ్రెస్ పార్టీ సహిస్తుందా? అనేకానేక ఆక్షేపణలతో ఆ సినిమాను తప్పక అడ్డుకుంటుంది. రాజకీయ హింసాకాండకు అద్దం ట్టిన ‘బెంగాల్ ఫైల్స్’ను వంగభూమిలో ఎక్కడా ప్రదర్శించే అవకాశమే ఉండకపోవచ్చు. కన్నూర్ రాజకీయ హత్యలపై ‘కేరళ ఫైల్స్’ తీస్తే ఆ సినిమాను ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న లెప్ట్ ఫ్రంట్ ప్రభుత్వం ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది. 2002 మారణకాండపై ‘గుజరాత్ ఫైల్స్’ తీస్తే అది, బీజేపీ పాలిత రాజకీయ విశ్వంలో వెలుగు చూసే ప్రసక్తే లేదని మరి చెప్పాలా? భారతీయ సినిమా చరిత్రలో సెన్సార్ కత్తెరకు ఘోరంగా గురయిన, ప్రదర్శనకు అనర్హమైనవిగా నిషేధానికి గురై అనామకంగా కాలంలోకి జారిపోయిన సినిమాల ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. సృజనాత్మక స్వేచ్ఛకు ప్రభువులు విధించిన పరిమితుల పర్యవసానాలు ఘోరంగా కాకుండా ఘనంగా ఉంటాయా?

‘కశ్మీర్ ఫైల్స్’కు ఒక ప్రత్యేకత ఉంది. అరుదైన దృష్టాంతాలలో చాలా అరుదైన ఉదాహరణకు అదొక తార్కాణం. ఒక ప్రైవేట్ వ్యక్తి నిర్మించిన ‘కశ్మీర్ ఫైల్స్’కు అన్ని విధాల మద్దతునిచ్చేందుకు పాలక రాజకీయ పక్షం రాజ్యాధికారాన్ని అడ్డూ అదుపులేకుండా ఉపయోగించుకోవడమే ప్రత్యేకత. నిజంగా ఈ ప్రోత్సాహం చాలా చాలా అరుదు, సందేహం లేదు. ‘కశ్మీర్ ఫైల్స్’కు వినోద పన్ను రద్దు చేశారు. సబ్సిడీ రేట్లపై థియేటర్లను సమకూర్చారు. ఆ సినిమాను చూసేందుకు ప్రభుత్వోద్యోగులకు ఒకరోజు సెలవు కూడా ఇచ్చారు! ఒక పాలక రాజకీయ పక్షం, దాని అనుబంధ సంస్థలు ఒక వాణిజ్య సినిమాను తమ రాజకీయ ప్రయోజనాలకు మద్దతుగా ప్రజాసమీకరణకు ఇంతలా ఉపయోగించుకోవడం అరుదుగాక మరేమిటి? ఇలా ఎప్పుడైనా, కనీసం ఇటీవలి కాలంలో జరిగిందా? ‘కశ్మీర్ ఫైల్స్’కు రాజ్య వ్యవస్థ తోడ్పాటుతో ప్రభుత్వ ప్రచారానికి, సినిమా కథనాలకు మధ్య విభజన రేఖలు పూర్తిగా చెరిగిపోయాయని స్పష్టమవుతుంది.

అయినా ‘కశ్మీర్ ఫైల్స్’కు ప్రభుత్వ ప్రాపకం అంతగా లభించడం ఆశ్చర్యకరమా? కానేకాదు. ఎందుకంటే ఆ సినిమా కథ పూర్తిగా, అవును, సంపూర్ణంగా ప్రాబల్య మెజారిటీవాద రాజకీయ భావజాలానికి అనుగుణంగా ఉంది. దేశంలోని ముస్లిం జనాభాను, సరిహద్దులకు ఆవలి ముస్లింలను తమ ప్రధాన ‘శత్రువు’గా చూడాలని పురిగొల్పుతున్న రాజకీయ భావజాలమది. 1989–90లో కశ్మీరి పండిట్‌ల హత్యాకాండ, కశ్మీర్ లోయ నుంచి వారి మహా నిర్గమనం ఒక భయానక గాథ. ఈ చరిత్రనే ‘అనాగరిక’ ఇస్లామిజం వెర్సెస్ ‘శాంతి ప్రియ’ హిందూ ధర్మంగా ఆ సినిమా చూపించింది. కశ్మీర్‌లో హింసాగ్నులు రగుల్కొన్న సంవత్సరమది. ఆ ఏడాది శీతాకాలం గడ్డకట్టిన చలిలో పాకిస్థాన్ ప్రాయోజిత ఉగ్రవాద బృందాలు కశ్మీరీ హిందువులను ఊచ కోత కోశాయి. ఇప్పుడు ఆ బీభత్సాన్ని ‘నవ’ భారతదేశ కొత్తతరాల వారికి సినిమా రూపేణా మళ్లీ చూపించడంలో పరమార్థమేమిటి? అందునా మత విభేదాలను మరింతగా తీవ్రతరం చేసిన ఇస్లాం వ్యతిరేక విద్వేష రాజకీయాలతో ఉడికిపోతున్న వర్తమాన భారతదేశంలో ఆ సినిమా కళ పరమార్థాన్ని నెరవేరుస్తుందా?

స్వస్థలాల నుంచి గెంటివేతకు గురై సుదూర ప్రదేశాలలోని శరణార్థుల శిబిరాలలో నివశిస్తున్న అసంఖ్యాక కశ్మీరీ హిందూ కుటుంబాలకు ‘కశ్మీర్ ఫైల్స్’ ఒక భావోద్వేగాత్మక అనుభవం. మనస్సు లోతులలో అణిగిపోయి ఉన్న భావావేశాలను ఒక్కసారిగా బయల్పరిచేందుకు ఆ సినిమా వీక్షణం వారికి దోహదం చేసింది. అంతేకాదు వారి బాధాకర గాథను విశాల ప్రపంచానికి ఆ సినిమా మరింత విపులంగా తెలియజేసింది. జాతీయ ప్రధాన స్రవంతి నుంచి కశ్మీర్ ముస్లింలు దూరమైపోవడంపైనే దృష్టిని నిలిపిన మనం కశ్మీరీ హిందువుల అంతులేని వ్యథల గురించి అంతగా పట్టించుకోలేదన్నది ఒక వాస్తవం. విశాల భారతదేశ పౌరులు కష్టాల్లో ఉన్న తమను ఉపేక్షించడం పట్ల వారు ఎంతైనా మనస్తాపం చెందారు. ముఖ్యంగా వామపక్ష -ఉదారవాద మేధో శ్రేణులు తమ విషాదాలను విస్మరించడం కశ్మీరీ హిందువులకు ఎంతైనా బాధ కలిగించింది.

సరే, ఒక సినిమా బాధితులకు దుఃఖోపశమనం కలిగించవచ్చుగానీ అది నిజంగా వారికి న్యాయం చేయగలుగుతుందా? వారి దుర్భర స్థితిగతులలో నిజమైన మార్పుకు దోహదం చేస్తుందా? అంతిమంగా రాజీకి తోడ్పడుతుందా? కశ్మీర్ చరిత్ర జటిలమైనది. రక్త పంకిలమైనది. అటువంటి శోకతప్త చరిత్రను సముచిత సందర్భం, సరైన దృక్కోణం లేకుండా ఒక పక్షపాత రాజకీయ రూపకంగా కుదించడం సబబేనా? కశ్మీర్ లోయ నుంచి పండిట్‌లు పెద్ద ఎత్తున కట్టుగుడ్డలతో సుదూర ప్రాంతాలకు వలస వెళ్ళిపోవడాన్ని విశాల భారతదేశ ప్రజలు విస్మరించడం గర్హనీయం. అయితే ఈ విస్మృతిని, ఎడతెగని కశ్మీర్ అసాధారణ సంక్షోభపు ఇతర అంశాల -ఢిల్లీ, శ్రీనగర్ రాజకీయ కుతంత్రాలు, ఎన్నికల రిగ్గింగ్, రాజ్యవ్యవస్థ దౌష్ట్యాలు, మరింత స్వతంత్ర ప్రతిపత్తికి, ఆ మాటకొస్తే ఆజాదీకి చరిత్రాత్మక డిమాండ్లతో ప్రమేయం లేకుండా, పరిగణనలోకి తీసుకోకుండా ఎలా సరిదిద్దుకోగలం?

గత మూడు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ, మూడో ఫ్రంట్ ప్రభుత్వాలు అన్నీ కశ్మీరీ పండిట్ కుటుంబాలకు స్వస్థలాలలో పునరావాసం కల్పించడం లేదా వారిని ఊచకోత కోసిన ఉగ్రవాదులను చట్టం ప్రకారం శిక్షించడంలో చాలవరకు విఫలయ్యాయి. ఉదాహరణకు ‘ఆజాదీ’ నాయకుడు యాసిన్‌ మాలిక్ విషయాన్నే తీసుకోండి. 1990లో ఒక ఉగ్రవాద దాడిలో వాయుసేనకు చెందిన నలుగురు అధికారులు హతమయ్యారు. ఆ సంఘటనకు సంబంధించి మాలిక్‌పై 2020 సంవత్సరంలో మాత్రమే చార్జిషీట్ దాఖలు చేశారు! ఈ విస్మయకర వ్యవహారం మన నేర న్యాయ–నిర్ణయ వ్యవస్థ గురించి ఏమి చెబుతుంది? కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ, బీజేపీ ప్రభుత్వాల హయాంలోనూ జైలులో ఉన్నా, బయట ఉన్నా మాలిక్ కశ్మీర్ చర్చల్లో భాగస్వామిగా ఉంటూ వస్తున్నాడు మరి. ‘కశ్మీర్ ఫైల్స్’కు ఎనలేని ప్రోత్సాహమివ్వడం ద్వారా కశ్మీర్ పండిట్‌ల విషయంలో తన వైఫల్యాలను భారత రాజ్య వ్యవస్థ మరింత సుళువుగా కప్పిపుచ్చుకోగలుగుతుందని చెప్పవచ్చు. అవును, బీజేపీకి గట్టి మద్దతుదారుడు అయిన వ్యక్తి ఒకరు తీసిన సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’. ‘ఉగ్రవాదిగా ముస్లిం’ అనేది దాని ఇతివృత్తం. ఉగ్రవాద దౌష్ట్యాల బాధితులకు న్యాయం సమకూరేందుకు లేదా సంక్లిష్ట కశ్మీర్ సమస్య పరిష్కారానికి దోహదం చేయడానికి బదులుగా ప్రమాదకర అర్ధ సత్యాలను మాత్రమే ఆ సినిమా ప్రచారం చేసింది. కశ్మీరీ పండిట్‌ల కుటుంబాలకే కాదు, ఉగ్రవాదుల దాడులు, ప్రతీకారాత్మక హింసాకాండ మధ్య చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వేలాది కశ్మీరీలకు, వారి కుటుంబ సభ్యులకు కూడా న్యాయం జరగాలి.

దురదృష్టవశాత్తు 1990 అనంతర తరం (ప్రస్తుతం మన దేశ జనాభాలో 1990 సంవత్సరం తరువాత జన్మించిన వారే సగ భాగంగా ఉన్నారు) మన సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తున్న సమస్యల చారిత్రక యథార్థతను తెలుసుకునే విషయమై శ్రద్ధ చూపడం లేదు. సత్యానంతర కాల వక్రీకరణలు, శక్తిమంతమైన జాతీయ వాదం ఆదరణ పొందుతున్న ‘నవ’ భారతదేశంలో పోటీదాయక ప్రచారానికే ప్రాధాన్యం లభిస్తోంది. ఈ ‘నూతన’ భారతీయ తరం వారు వాట్సాప్ ఫార్వార్డ్‌లు, సామాజిక మాధ్యమాల సందేశాలు, 60 సెకండ్ల వైరల్ వీడియోల నుంచి మాత్రమే ‘వాస్తవాల’ను గ్రహిస్తున్నారు. గాంధీజీపై వెలువడుతున్న పుస్తకాల కంటే గాడ్సేపై వస్తున్న సినిమాలే ఈ ‘నవ’ భారత్‌కు ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఉధృతమవుతున్న ఇస్లామిక్ తీవ్రవాదం, హిందూ జాగృతి మధ్య చిక్కుకున్న ఈ తరం ‘ఇతరుల’ పట్ల కరుణ, సహన భావాలతో కాకుండా భయ విద్వేషాలతో కొట్టుకుపోతోంది. శాంతియుత సహజీవనం నెలకొల్పుకునేందుకు సత్సంకల్పులు అయిన కశ్మీర్ ముస్లింలు, కశ్మీర్ పండిట్‌ల పరస్పర కృషిని, ‘జాతివ్యతిరేకి’ అనే అపనిందను భరించకుండా మీరు ఏ విధంగానైనా రికార్డు చేయగలరా?

తాజా కలం: ‘భజ్ రంగి భాయీజాన్’ అనే బాలీవుడ్ సినిమాలోని ఒక డైలాగ్ నా మనస్సులో నిలిచిపోయింది. ఇప్పటికీ నాకు పదేపదే జ్ఞాపకం వస్తుండే ఆ సంభాషణ సారాంశం: ‘ప్రేమను పంచడం కంటే విద్వేషాన్ని రెచ్చగొట్టడం చాలా తేలిక’. అవును, ఇది ఓటు బ్యాంకు రాజకీయవేత్తల విషయంలో ఎంత నిజమో రాజకీయ అభిమాన దురభిమానాలు ప్రగాఢంగా ఉన్న సినిమా స్రష్టల విషయంలోనూ అంతే సత్యం.

Courtesy Andhrajyothi

Leave a Reply