కశ్మీర్‌ను మళ్లీ వీడుతున్న పండిట్లు!

0
163
  • ఉగ్రవాద దాడులు, హత్యలతో భయాందోళన
  • ఐదు రోజుల వ్యవధిలో ఆరుగురు పౌరుల హత్య
  • లోయను వదిలి 500కుపైగా కుటుంబాల వలసబాట
  • హత్యలపై రంగంలోకి దిగిన ఎన్‌ఐఏ.. ఇద్దరి అరెస్టు
  • పోలీసుల అదుపులో 700 మంది అనుమానితులు

శ్రీనగర్‌/న్యూఢిల్లీ : మాతృభూమికి రెండున్నర దశాబ్దాలపాటు దూరమై.. ఎన్నో ఆశలతో తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టిన కశ్మీరీ పండిట్లకు ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. కశ్మీర్‌లో మైనారిటీలుగా ఉన్న పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని దాడులకు, హత్యలకు పాల్పడుతుండడంతో మళ్లీ జన్మభూమిని వీడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

కశ్మీర్‌ లోయలో గత కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న ఘటనలతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత గురువారం ఉగ్రవాదులు శ్రీనగర్‌లోని ఓ పాఠశాలలోకి చొరబడి సిక్కు వర్గానికి చెందిన ప్రిన్సిపాల్‌ సురీందర్‌ కౌర్‌ను, కశ్మీరీ పండిట్‌ వర్గానికి చెందిన ఉపాధ్యాయుడు దీపక్‌ చంద్‌ను కాల్చి చంపిన విషయం తెలిసిందే. వీరే కాకుండా గడచిన ఐదు రోజుల వ్యవధిలో శ్రీనగర్‌లో ఆరుగురు పౌరులను హత్య చేశారు. వీరిలో నలుగురు మైనార్టీ వర్గం వారే ఉన్నారు. దీంతో కశ్మీర్‌లో మళ్లీ 1990 నాటి పరిస్థితులు తలెత్తాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పట్లో కశ్మీరీ పండిట్లపై తీవ్రమైన దాడులు, ఇళ్లలో లూటీలు జరగడం, నిలువ నీడలేని పరిస్థితులు నెలకొనడంతో వందల సంఖ్యలో పండిట్ల కుటుంబాలు కశ్మీర్‌ను వీడాయి. వారందరినీ తిరిగి కశ్మీర్‌కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం 2003లో ప్రత్యేక చర్యలు చేపట్టింది.

వారి కోసం బుద్గాం జిల్లాలోని షేక్‌పొరాలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కశ్మీర్‌ లోయకు తిరిగివచ్చిన పండిట్ల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు.  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. పండిట్లకు మరింత భద్రత కల్పిస్తామన్న భరోసా ఇచ్చింది.

అఫ్ఘానిస్థాన్‌ తాలిబన్ల చేతికి వెళ్లడంతోనే!
పాకిస్థాన్‌ మద్దతిస్తున్న తాలిబన్లు అఫ్ఘానిస్థాన్‌ను చేజిక్కించుకున్న తరువాత జమ్ముకశ్మీర్‌లోనూ ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగాయి. ప్రత్యేకించి కశ్మీరీ పండిట్లు, సిక్కుల హత్యకు ఉగ్రవాదులు తెగబడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఈ వర్గాలకు చెందినవారి గుర్తింపు పత్రాలను సేకరించి హత్యలు చేస్తున్నారు. భయాందోళనకు గురైన పండిట్లు, సిక్కులు.. కశ్మీర్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.

శుక్రవారం పదుల సంఖ్యలో పండిట్ల కుటుంబాలు వలస వెళ్లిపోయాయి. బుద్గాం, అనంతనాగ్‌, పుల్వామా తదితర ప్రాంతాల నుంచి దాదాపు 500 కుటుంబాలు వలస వెళ్తున్నట్లు కశ్మీరీ పండిట్‌ సంఘర్ష్‌ సమితి అధ్యక్షుడు సంజయ్‌ టీకూ తెలిపారు. కశ్మీరీ పండిట్లపై దాడుల నేపథ్యంలో జమ్ము, కశ్మీర్‌ పీపుల్స్‌ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌, శివసేన, జాగరణ్‌ మంచ్‌ తదితర సంస్థల నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొని పాక్‌ వ్యతిరేక నినాదాలు చేశారు.

దళాల అదుపులో 900 మంది
కశ్మీర్‌ లోయలో ఉగ్రదాడుల నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులుగా అనుమానిస్తున్న 900 మందిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీరిలో 400 మందిపై వివిధ పోలీ్‌సస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. మరోవైపు ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఆదివారం లష్కరే తాయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది.

ఆస్తుల స్వాధీనమే కారణం!
కశ్మీర్‌కు తిరిగి వచ్చిన పండిట్లు తమ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయడమే హత్యలకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదం కారణంగా 1990లో కశ్మీరీ పండిట్లు లోయను వదిలి వెళ్లాక.. వారి భూములను, ఇళ్లను స్థానిక ముస్లింలు ఆక్రమించుకున్నారు. అయితే, ప్రభుత్వం ఇటీవల కొందరి ఆస్తులను ఆక్రమణదారుల నుంచి యజమానులకు అప్పగించింది. దీంతోనే దాడులకు కుట్రలు జరిగాయన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

Courtesy Andhrajyothi

Leave a Reply