కాశ్మీర్లో స్వేచ్ఛకు సంకెళ్లు

0
1264

  • ఆర్టికల్‌ 370పై మాట్లాడితే మళ్లీ జైలుకే
  • కొత్త షరతులతో ‘బాండ్‌’.. దానిపై సంతకం చేస్తేనే ఖైదీల విడుదల
  • ఇది రాజ్యాంగ విరుద్ధం : న్యాయనిపుణులు, హక్కుల కార్యకర్తలు

    శ్రీనగర్‌ : మోడీ సర్కారు నిరంకుశ వైఖరితో కాశ్మీర్‌లో వాక్‌స్వాతంత్య్రం గగనమైపోయింది. ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూకాశ్మీర్‌ విభజన అనంతరం ఆంక్షలు, నిర్బంధాలతో లోయ ఇప్పటికే అస్తవ్యవస్తమైంది. అంతేకాదు, మోడీ సర్కారు, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తమ బాధలను చెప్పుకునే స్వేచ్ఛ కూడా కాశ్మీరీలకు లేకుండా పోయింది. ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం కాశ్మీర్‌లోని ఎందరో రాజకీయ నాయకులను, అగ్ర నేతలను కేంద్రం జైలులో నిర్బంధించింది. అయితే వారిని జైలు నుంచి విడుదల చేయడానికి పలు కొత్త కొత్త షరతులను విధిస్తున్నారు. ఆర్టికల్‌ 370, జమ్మూకాశ్మీర్‌ విభజన వంటి ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడబోమని హామీనిస్తూ బాండ్‌పై సంతకాలు పెట్టాలంటున్నారు. ష్యూరిటీ కింద పెద్ద మొత్తంలో డబ్బునూ జమ చేయాలనీ బాండ్‌లో జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వం షరతులు విధించింది. ఒకవేళ ఈ షరతులు ఉల్లంఘిస్తే సదరు ఖైదీ తిరిగి జైలుకు వెళ్లేలా అందులో నిబంధనలున్నాయి. అయితే ఈ కొత్త షరతులు సమస్యాత్మకం, రాజ్యాంగ విరుద్ధమని న్యాయనిపుణులు, హక్కుల కార్యకర్తలు తప్పుబడుతున్నారు.
    సవరించిన ‘సెక్షన్‌ 107’ బాండ్‌పై ఇటీవల విడుదలైన ఇద్దరు మహిళా ఖైదీలు సంతకాలు చేశారు. ఎవరినైనా కస్టడీలోకి తీసుకునే క్రమంలో పాలనాధికారాలను ఉపయోగించి సాధారణంగా దీనిని జిల్లా మేజిస్ట్రేటు వాడుతుంటారు. ఈ బాండ్‌లోని నిబంధనల ప్రకారం.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించబోమంటూ ఖైదీలు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ హామీని ఉల్లంఘిస్తే సదరు ఖైదీ బాండ్‌లో పేర్కొన్న మొత్తం నగదును రాష్ట్ర సర్కారుకు కోల్పోవాల్సి ఉంటుంది.
    బాండ్‌లో రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అవి 1. ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజనపై జమ్మూకాశ్మీర్‌లో నిర్వహించే కార్యక్రమాల్లో ఎలాంటి కామెంట్లూ, ప్రకటనలూ, బహిరంగంగా ప్రసంగాలు చేయబోమనీ, బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయబోమని బాండ్‌పై ఖైదీలు సంతకాలు చేయాల్సి ఉంటుంది.
    2. ఇందుకు ష్యూరిటీ కింద రూ. 10వేలు.. బాండ్‌లోని షరతులను ఉల్లంఘిస్తే మరో రూ. 40వేలు ష్యూరిటీ కింద డిపాజిట్‌ చేయాలి. ఇలా బాండ్‌కు కట్టుబడకపోతే సదరు వ్యక్తి తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
    కాగా, ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, వ్యక్తి వాక్‌స్వాతంత్య్రాన్ని హరించేలా ఉన్నదని పలువురు న్యాయనిపుణులు, హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ” రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(2) కింద.. హింసకు తావుంటే వాక్‌స్వాతంత్య్రపై పరిమితులుంటాయి. ప్రజల వాక్‌స్వాతంత్య్రాన్ని పరిమితం చేస్తూ ప్రస్తుతం ‘సెక్షన్‌ 107’ను ప్రయోగించడం రాజ్యాంగానికి వ్యతిరేకం” అని గౌతం భాటియా అనే న్యాయవాది తప్పుబట్టారు. అయితే సవరించిన సెక్షన్‌ 107పై స్పష్టత లేదని పలువురు నిపుణులు అంటున్నారు.
    కాగా, దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ డిసి రైనాను సంప్రదించగా.. సెక్షన్‌ 107లో ఏవైనా మార్పులు దాని ప్రాథమిక స్ఫూర్తిని దూరం చేయలేవని అన్నారు. కొత్త బాండ్‌ను తాను చూడలేదనీ, తాను విన్నదాన్ని బట్టి అయితే అది కచ్చితంగా న్యాయపూర్వకమేనని ఏజీ తెలుపడం గమనార్హం. సెక్షన్‌ 107 లో మార్పులు చేయడానికి జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వానికి(ప్రస్తుతం రాష్ట్రపతి పాలన ఉన్నందును ఆ అధికారం గవర్నర్‌కు ఉంటుంది) ఉంటుందని రైనా వివరించారు. కాగా, కొత్త షరతులతో కూడిన బాండ్‌పై గతవారం సంతకం చేసిన మహిళల తరఫు న్యాయవాది అల్తాఫ్‌ ఖాన్‌ స్పందించారు. ” ఈ బాండ్‌ కొత్తది. ఇందులో చేసిన మార్పులు రాజ్యాంగానికి లోబడి లేవు” అని అల్తాఫ్‌ అన్నారు. రెండు నెలల నుంచి జమ్మూకాశ్మీర్‌లో దాదాపు ఆరువేల మందిని నిర్బంధించారనీ, అందులో చాలా మందిని కొత్త బాండ్‌పై సంతకాలు చేయించి విడుదల చేశారని మానవహక్కుల కార్యకర్త ఖుర్రం పర్వేజ్‌ ఆరోపించారు. ఇప్పటికే పలు ఆంక్షల నడుమ విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న కాశ్మీరీలను కొత్త షరతులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులపాల్జేస్తున్నాయని సామాజికవేత్తలు, ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.

Courtesy Navatelangana

Leave a Reply