దళిత పోరాటాలకు దిక్సూచి

0
246

ఒక అస్పృశ్యుని యుద్ధగాథపుస్తకావిష్కరణ సభలో వక్తలు

-అమరావతి బ్యూరో
సమాజాన్ని పట్టి పీడిస్తున్న కుల వ్యవస్థను, అభివృద్ధికి అడ్డుగా నిలుస్తున్న కుల గోడల్ని బద్దలు కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ అధ్యక్షులు డాక్టర్‌ కత్తి పద్మారావు ఆత్మకథ ‘ఒక అస్పృశ్యుని యుద్ధగాథ’ పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారంనాడు ఒక అస్పృశ్యుని యుద్ధగాథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్‌ కనపర్తి అబ్రహాం లింకన్‌ అధ్యక్షత వహించారు. ముందుగా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌, పూలే చిత్రపటాలకు కత్తి పద్మారావు, అతిథులు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. పుస్తకాన్ని ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ వైస్‌ ఛాన్సెలర్‌ ప్రొఫెసర్‌ కె ఎస్‌ చలం, ప్రముఖ హేతువాది డాక్టర్‌ సమరం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ చలం మాట్లాడుతూ ఈ దేశంలో కుల వ్యవస్థ, కుల ఆధిపత్యం అంతం కాకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. డాక్టర్‌ సమరం మాట్లాడుతూ కాన్సర్‌, ఎయిడ్స్‌, కుష్టు వ్యాధులు కన్నా, అస్పృశ్యత భయంకరమైనదని, దీనివల్లే సమాజంలో కుల దురహంకార హత్యలు పెరుగు తున్నాయని అన్నారు. ప్రముఖ రచయిత రాచ పాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రాచ్య తత్వశాస్త్రం, మార్క్సిజం, అంబేద్కరిజం, బుద్ధి జం, చరిత్రల కలబోతే పద్మారావు రచించిన అస్పృశ్యుని యుద్ధగాథ పుస్తక సారాంశమని తెలి పారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన కుల, మత తత్వాలు, ఆలోచనలను మార్చడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అన్నారు. కారంచేడు ఘటన కత్తి పద్మారావును దళిత ఉద్యమ నేతగా మార్చిందని, ఆయన రచించిన పుస్తకం దళితుల అభ్యున్నతికి తోడ్పడుతుందని ప్రభుత్వ సలహాదారు కె రామచంద్రమూర్తి అన్నారు.

డిఎస్‌ఎమ్‌ఎమ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొన్న వివక్షను అస్పృశ్యుని యుద్ధగాథ పుస్తకం వివరిస్తుందని అన్నారు. కులం, మతం, అంటరానితనానికి గురై అణగదొక్కబడిన దళితుల పక్షాన పద్మారావు చేసిన పోరాటాలకు ఈ పుస్తకం నిలువుటద్దమన్నారు. దేశంలో కులాలు, మతాలు, విద్వేషాలను రెచ్చగొట్టే పార్టీ అధికారంలో ఉందని, ఇది అధికారంలో కొనసాగినంత కాలం పద్మారావు ఆశయం నెరవేరదని అన్నారు. దళితులంతా ఐక్యంగా పోరాడి బిజెపిని గద్దె దింపి పద్మారావు కన్న కలల రాజ్యాన్ని సాధించేందుకు కలిసి రావాలని తెలిపారు. జెఎన్‌యు విద్యార్థులు చేస్తున్న పోరాటాలను స్ఫూర్తిగా తీసుకుని, అరాచక పాలనను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. భావితరాలకు మార్గదర్శకంగా నిలిచే పుస్తకాన్ని రాసినందుకు పద్మారావుకు అభినందనలు తెలిపారు. పుస్తక రచయిత డాక్టర్‌ కత్తి పద్మారావు మాట్లాడుతూ 1953 నుండి తాను గమనించిన అంటరానితనం, కుల, మత విద్వేషాల విశేషాలు, విద్యాభ్యాసంలో తాను ఎదుర్కొన్న వివక్ష, దళిత మహిళలు ఎదుర్కొన్న సమస్యలు, దళితుల్ని సభ్యసమాజం అణగదొక్కిన విధానాలన్నింటినీ పుస్తకంలో పొందుపర్చానని అన్నారు. దళితుల అభ్యున్నతికి తాను రాసిన పుస్తకం మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉపయోగపడాలన్నదే తన లక్ష్యం అని స్పష్టం చేశారు. ఇది మొదటి భాగమేనని మరో మూడు భాగాలు ప్రచురణ కావాల్సి ఉందని, వాటిని త్వరలోనే ప్రచురిస్తామని తెలిపారు. మానవత్వం వికసించాలి, కుల, మత అంతరాలు తొలగిపోవాలనే తన కాంక్ష, మార్గదర్శకాలు పుస్తకంలో ఉంటాయని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని కాంక్షించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ చందు సుబ్బారావు, వల్లంపట్ల నాగేశ్వరరావు, ఉప్పులేటి దేవీప్రసాద్‌, తదితరులు పుస్తక విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ దళిత మహాసభ నాయకులు, కార్యకర్తలు, పద్మారావు కుటుంబ సభ్యులు, కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అండ్ర మాల్యాద్రి, జైభీం బాలకృష్ణ, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Courtesy Prajasakti..

Leave a Reply