
- ఏకం చేసిన చేతులతోనే నేడు చీలిక వ్యూహాలు
- తొలిగా ఎమ్మార్పీఎస్ ముక్కలు
- ఇప్పటి గురి టీఎంయూ
- సచివాలయ సంఘాలన్నీ మాయం.. మిగిలింది ఒకటే
- అప్పట్లో విధేయులు లచ్చిరెడ్డి, మల్లయ్య, మధుసూదన్
- ఇప్పుడు వారే ప్రభుత్వ సంస్థలకు, సర్కారుకు టార్గెట్
- ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు చీలికలు పేలికలు
- సామ.. దాన.. భేద.. దండోపాయాలతో గుప్పిట్లోకి
హైదరాబాద్: ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు బతుకమ్మ ఆడిన విషయం గుర్తుందా!? రాష్ట్ర సాధనకు సచివాలయంలో నాలుగు ఉద్యోగ సంఘాలు తీవ్ర పోరాటం చేశాయి! తెలంగాణ ఏర్పడిన తర్వాత అసిస్టెంట్ సెక్షన్ అధికారుల సంఘంతోపాటు సచివాలయ టీఎన్జీవో విభాగాలు ప్రధాన సంఘంలో విలీనమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైంది. 2009 డిసెంబరులో కేసీఆర్ ఆమరణ దీక్ష చేసినప్పుడు దానిని విరమింపచేయడానికి జ్యూస్‌ను అందించింది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్ తొలి గురి ఎమ్మార్పీఎ్‌సపైనే పెట్టింది. మంద కృష్ణ మాదిగకు కుడి, ఎడమ భుజంగా ఉన్న కీలక నేతలతో రహస్యంగా సమావేశమైన కేసీఆర్.. ఎమ్మార్పీఎ్‌సను ముక్కలు చేసేశారు.
తెలంగాణ ఉద్యమ సమయానికి కొన్ని ప్రజా, ఉద్యోగ సంఘాలు తలో దిక్కున ఉన్నాయి. వాటికితోడు మరికొన్ని సంఘాలను అప్పట్లో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేయించింది. విడివిడిగా ఉన్న సంఘాలను దగ్గరికి చేర్చి బలమైన తాడుగా పేనింది. రాష్ట్ర సాధన ఉద్యమంలో మమేకం చేసింది. అన్నిటినీ కలిపి జేఏసీగా ఏర్పాటు చేసి.. ఉద్యమానికి కొత్త ఊపిరులూదింది. సొంతరాష్ట్రం సాకారమైంది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరించిన వివిధ సంఘాలు రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అదే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా మారిందని ప్రకటించిన ప్రభుత్వ పెద్దలకు ఇది నచ్చడం లేదని, ప్రశ్నించేతత్వాన్ని జీర్ణించుకోవడం లేదని ప్రజా, ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వంలోని ముఖ్యులు సంఘాలను నిలువునా చీల్చే వ్యూహాలకు పదును పెడుతూ చాలా వరకూ సఫలీకృతులు అవుతున్నారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సామ.. దాన.. భేద.. దండోపాయాలన్నింటినీ ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో చీలిక వర్గం ప్రభుత్వానికి పూర్తి విధేయత ప్రకటిస్తోంది. రెండో వర్గం న్యాయమైన డిమాండ్ల సాధనకు పోరాటం కొనసాగిస్తామని చెబుతోంది. రాష్ట్ర సర్పంచ్‌ల సంఘంలో ఒక వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే.. మరొక వర్గం అధికార టీఆర్‌ఎస్ దిక్కు నిలుస్తోంది.
తాజాగా, ఆర్టీసీ సమ్మెకు నేతృత్వం వహిస్తున్న టీఎంయూ చీలికకు తెర వెనక పావులు కదులుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. పైగా, ప్రభుత్వం ముందు న్యాయమైన తమ వర్గం సమస్యలను ఉంచి, పరిష్కారం కోసం కొట్లాడుతున్న సంఘాల నేతలకు వేధింపులు తప్పడం లేదనే ఆందోళన నెలకొంది. అప్రాధాన్య పోస్టుల్లోకి, సుదూర ప్రాంతాలకు బదిలీ చేయడం.. ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టడం, ప్రభుత్వ సంస్థల ద్వారా వేధింపులకు గురి చేయడం వంటి అనైతిక చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
అప్పుడు విధేయులు.. ఇప్పుడు వ్యతిరేకులు
తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ అధినేతకు విధేయత చాటిన వారికి కూడా ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదనే చర్చ నడుస్తోంది. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఉద్యోగులతో అప్రకటిత యుద్ధం చేస్తున్న క్రమంలోనే ఒకే సంఘానికి చెందిన నేతలు భిన్న స్వరాలు వినిపించడం ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి, ఉద్యమ సమయంలో వీరంతా టీఆర్‌ఎస్ నేతలకు చాలా సన్నిహితంగా మెలిగినవారే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్ నేతలకు సహకరించారు.
నాడు వారి పోరాటానికి ఆయువు పట్టుగా నిలిచిన సమాచారాన్ని గుట్టుగా అందజేశారు. ఉదాహరణకు, హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో భూముల అక్రమ కేటాయింపుల సమాచారాన్ని తెలంగాణ తహసీల్దార్ల సంఘం అధ్యక్షుడు వి.లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల నుంచే కేసీఆర్ సేకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత, సబ్-రిజిస్ట్రార్ల అధికారాన్ని తహసీల్దార్లకు కట్టబెట్టడాన్ని తహసీల్దార్లంతా తీవ్రంగా వ్యతిరేకించగా.. సీఎం విధేయుడిగా ఉన్న లచ్చిరెడ్డి మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. అందుకు నజరానాగా లచ్చిరెడ్డికి కీసర ఆర్డీవోగా పోస్టింగ్ ఇచ్చారు. రె ండేళ్లపాటు అంతా బాగానే ఉన్నా.. కలెక్టర్ల సదస్సులో ఏం జరిగిందో తెలుసుకోవడానికి మంత్రి ఈటలతో లచ్చిరెడ్డి భేటీ అయ్యారంటూ ప్రభుత్వ అనుకూల పత్రికల్లో కథనాలు వచ్చాయి. వాటిని సాకుగా చేసుకున్న ప్రభుత్వం లచ్చిరెడ్డిని బదిలీ చేయడమే కాకుండా.. ఇటీవలే కొందరు డిప్యూటీ కలెక్టర్లతో ఆయన పెట్టుకున్న సంఘంలో కూడా చీలిక తెచ్చింది. ఆ సంఘంలోని కీలక కార్యవర్గ సభ్యులంతా మంగళవారం రాజీనామాలు చేశారు.
తాజాగా ఆయనపై ఏసీబీ గురి పెట్టిందనే ప్రచారం సాగుతోంది. ఇక, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కూడా ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కానీ, ఇటీవల ఇంటర్ ఫలితాల వివాదం వంటి కారణాలతో ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు అభియోగాలు మోపుతూ ఆయనను అరెస్ట్ చేయించడం గమనార్హం.
టార్గెట్ టీఎంయూ
‘టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకీకృతంగా పని చేస్తున్న సంఘాల్లో చీలికలు తెస్తోంది’ అనే చర్చ అధికార యంత్రాంగంలో నడుస్తోంది. ఉద్యమ సమయంలో ఆర్టీసీలో ప్రధాన సంఘమైన ఎన్‌ఎంయూలో చీలిక తేవడంలో టీఆర్‌ఎస్ పాత్ర కీలకం. దానిని చీల్చి తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఏర్పాటు చేశారు. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టీసీ మనుగడ కోసం పోరాటం చేయడమే టీఎంయూ ఉనికికి ముప్పు తెస్తోంది. గత 16 రోజులుగా సమ్మె చేస్తున్న టీఎంయూను కూడా చీల్చే ప్రయత్నాలు ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సకల జనుల సమ్మెలో ఆర్టీసీ తర్వాత కీలక భూమిక కోల్‌బెల్ట్‌దే. కోల్‌బెల్ట్‌లో టీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఉంది.
దీనికి గౌరవాధ్యక్షురాలు కేసీఆర్ తనయ కవిత. ఉద్యమ సమయంలో ఈ సంఘాన్ని ముందుండి నడిపించిన కెంగర్ల మల్లయ్యకు కూడా ఆ తర్వాత ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దాంతో, ఆయన ఇటీవలే బీజేపీ అనుబంధ కార్మిక సంఘంలో చేరారు. ఇక, విద్యుత్తు రంగ నిపుణుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో పీపీఏలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కంచర్ల రఘును ఐదేళ్లుగా ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోందని నేతలు చెబుతున్నారు. ఛత్తీ్‌సగఢ్ విద్యుత్తుపై మాట్లాడిన వెంటనే.. ప్రాధాన్యం లేని పోస్టులకు బదిలీ చేయడం వంటి చర్యలతో రఘు గొంతు నొక్కేసిందని వివరిస్తున్నారు.
ఉద్యమ సమయంలో తమ పోరాటాన్ని వాడుకున్న టీఆర్‌ఎస్.. ఇప్పుడు తమను ప్రశ్నించేవారు ఉండవద్దనే ఒకే ఒక్క కారణంతో సంఘాలను నిర్వీర్యం చేస్తుండడం కలచి వేస్తోందని ఉద్యమ నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ పక్షాన గుడ్డిగా నిలుస్తున్న సంఘాల నేతలు ఎన్ని తప్పులు చేస్తున్నా చర్యలు మృగ్యం కావడమూ చర్చనీయాంశమవుతోంది. ‘‘సీఎం ఏ ఉద్దేశంతో సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారో తెలియదు. కానీ, ఈ పరిణామం ఎప్పుడో ఒకప్పుడు టీఆర్‌ఎ్‌సకి రాజకీయంగా నష్టం చేయక తప్పదు’’ అని అధికార పార్టీ ముఖ్యుడొకరు విశ్లేషించారు.
courtesy Andhra Jyothy