కేసీఆర్ కిట్కు నిధుల కోత!

0
281

సర్కారుకు పేరు తెచ్చిన పథకం
ప్రభుత్వాస్పత్రుల్లో 50 శాతానికి పెరిగిన ప్రసవాలు
– 70 శాతానికి పెంచాలని లక్ష్యం
నిధులు పెంచాల్సిన సమయంలో తగ్గించిన వైనం

హైదరాబాద్‌ : కేసీఆర్‌ కిట్‌ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు తగ్గించింది. గతేడాది రూ.428 కోట్లు ఉండగా ఈ ఏడాది రూ.329 కోట్లతో సరిపెట్టింది. ఇప్పటికే లబ్దిదారులకు ప్రోత్సాహక నగదు అందిం చటంలో ఆలస్యమౌతున్నదని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిధుల కోతతో సమస్య మరింత తీవ్రమవుతుందని భావిస్తున్నారు. సర్వత్రా ప్రశంసలందుకున్న ఈ పథకం అమలుతో బాలింతలు, శిశువులకూ బహుళ ప్రయోజనకరంగా ఉందని విమర్శకులు సైతం కొనియాడారు. అనతి కాలంలోనే ఆదరణ పెరిగి మెరుగైన ఫలితాలు వస్తుండటంతో పలు అవార్డులను సొంతం చేసుకున్నది. లాభార్జనే ధ్వేయంగా మహిళల కడుపు కోతలకు కారణమవుతున్న ప్రయివేటుకు చెక్‌ పడుతున్నది. కేసీఆర్‌ కిట్‌కు ముందు రాష్ట్రంలో జరిగే ప్రసవాల్లో ప్రభుత్వాస్పత్రుల్లో 30 శాతమే ఉండగా ప్రస్తుతం అది కాస్తా 50 శాతానికి చేరింది. దాన్ని 70 శాతానికి తీసుకెళ్లాలని వైద్యారోగ్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకున్నది.

కోతలు తగ్గించేందుకు..
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలను పెంచటం, అదే సమయంలో సహజ ప్రసవాలను ప్రోత్సహించి ప్రయివేటు సిజేరియన్‌ శస్త్రచికిత్సల బారి నుంచి గర్భిణులను కాపాడటం అనే ఉదాత్తమైన లక్ష్యంతో 2017 జూన్‌ 2న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆ ఏడాది 2,59,335 మంది, 2018-19లో 2,77,383 మంది, 2019-20 లో 2,88,844 మంది, 2020-21లో ఫిబ్రవరి మాసాంతానికి 2,58,341 మంది అంటే మొత్తం 10,47,323 మంది ప్రభుత్వాస్పత్రుల్లో పురుడు పోసుకున్నారు. ఇందులో సగానికి పైగా 5,70,811 సహజ ప్రసవాలు కావడం గమనార్హం. మూడు దశల్లో రూ.12000 (మగ పిల్లవానికి), రూ.13,000 (ఆడపిల్లకు) చొప్పున ఇప్పటి వరకు రూ.990.26 కోట్ల నగదు లబ్ది, 8,65,383 మందికి 15 వస్తువుల కిట్‌ పంపిణీ చేశారు. ఆదివాసీ మహిళలకు ఇద్దరి కన్నా ఎక్కువ ప్రసవాలకూ కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. పథకం అమలు తర్వాత గర్భిణులు ఆ సమయంలో పనులకు వెళ్లడం తగ్గిందని గుర్తించారు.

వసతుల కల్పన
ఈ పథకంలో లబ్దిదారుల సంఖ్య పెరుగుతుండటంతో దానికి తగినట్టు ప్రభుత్వాస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పన చేయాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో రూ.28.46 కోట్లతో 305 ప్రసవ గదుల ఆధునీకరణతో పాటు రూ.407 కోట్లతో 22 కొత్తమాతా,శిశు సంరక్షణకేంద్రాలు మంజూరయ్యాయి. వీటిలో తొమ్మిదింటినీ ఇది వరకే ప్రారంభించగా అందులో 1,350 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 229 మంది గైనకాలజిస్టులు, 208 మంది అనేస్తీషియా వైద్యులు, 205 మంది పీడియాట్రిషియన్లు, 1225 నర్సుల నియామకం జరిగింది. మరింత విస్తరించి, నియామకాలు చేపట్టే డిమాండ్‌ ఉత్పన్నమయింది. అంతకు ముందు గర్బిణులు తొలి త్రైమాసికంలో 29 శాతం మంది మాత్రమే నమోదు చేసుకునేవారు. అదికాస్తా 73 శాతానికి పెరిగింది. రాష్ట్రంలో 96 శాతానికి చేరింది. సహజ ప్రసవాలు 65 శాతానికి పెరిగి సిజేరియన్లు 35 శాతానికి తగ్గగా, వ్యాక్సినేషన్‌ 68 శాతం నుంచి 96 శాతమయింది. శిశువుల మరణాలు ప్రతి వెయ్యి మందికి 39 నుంచి 26.4కు , ఐదేండ్ల లోపు పిల్లల మరణాలు 41 నుంచి 29.4కు, నవజాత శిశువుల మరణాలు 25 నుంచి 16.8కు, ప్రసవసమయంలో తల్లుల మరణాలు ప్రతి లక్షకు 92 నుంచి 63కు తగ్గాయి. అతి తక్కువ కాలంలో ప్రసవ సమయంలో మరణాలను తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలిపింది. ప్రసవానికి ముందు, తర్వాత ఆస్పత్రులకు వచ్చిపోయే ఒత్తిడి తగ్గించి వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఇక చిన్నారుల విషయంలో ఇప్పటి వరకు మూడున్నర ఏండ్ల చిన్నారులు 17,03,448 మంది, 9 నెలల చిన్నారుల్లో 15,48,577 మందికి సంపూర్ణ ఇమ్యూనైజేషన్‌ జరిగింది.

ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి
ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 10 శాతం కేటాయించాలని ప్రజారోగ్య కార్యకర్తలు, మేధావులు ప్రజాసంఘాలు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది వైద్యారోగ్యశాఖకు కనీసం రూ.8500 కోట్లు కేటాయించాలని వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు పంపగా బడ్జెట్‌లో రూ.6295 (మొత్తం బడ్జెట్‌లో 2.27 శాతం) మాత్రమే కేటాయించింది. దీని ప్రభావం పలు కీలకమైన పథకాలపై పడింది. ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ ప్రారంభంలో వెంటనే లబ్దిదారులకు నగదు ప్రోత్సాహం ఇచ్చినట్టు కాకుండా నెలల తరబడి ఆలస్యమవుతున్నదని లబ్దదారులు చెబుతున్నారు.

2019-20లో లబ్దిదారులకు రూ.392.04 కోట్లు పంపిణీ చేయగా,2020-21లో 11 నెలల కాలంలో ఇప్పటి వరకు రూ.263.65 కోట్లు చేశారు. 2021-22లో లబ్దిదారులకు పంపిణీలో మరింత జాప్యం జరిగే అవకాశముందని భావిస్తున్నారు. ఇప్పటికై రాష్ట్రం పేరును ఇనుమడింపజేసిన పథకానికి నిధులు పెంచాలనీ, మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని మేధావులు సూచిస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply