కీసర తహసీల్దార్‌ నాగరాజు అవినీతి పడగ

0
190

భూ వివాద పరిష్కారానికి 2 కోట్లు డిమాండ్‌
1.10 కోట్లు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
లంచం ఇచ్చిన మరో ఇద్దరికీ బేడీలు
రాంపల్లిలో 53 ఎకరాల భూవివాదం
గ్రామ రెవెన్యూ అధికారిపైనా కేసు
రాత్రంతా కొనసాగిన సోదాలు
గతంలోనే ఏసీబీ కేసు.. పెద్దల అండదండలతో క్లీన్‌చిట్‌

హైదరాబాద్‌ సిటీ, రంగారెడ్డి జిల్లా, కీసర: ఓ భూవివాద పరిష్కారానికి రూ. 2 కోట్ల లంచం డిమాండ్‌ చేసి.. రూ. 1.10 కోట్లు తీసుకుంటున్న మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసర మండల తహసీల్దార్‌ ఎర్వ బాలరాజు నాగరాజును అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తహసీల్దార్‌కు లంచం ఇచ్చిన ఇద్దరు రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లను కూడా అరెస్టు చేశారు. ఏసీబీ హైదరాబాద్‌ జోనల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ రమణ్‌కుమార్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామంలోని సర్వేనంబర్లు 603 నుంచి 614 వరకు ఉన్న 53 ఎకరాలకు సంబంధించిన భూవివాదం కొనసాగుతోంది. దీనిపై ఓ వర్గం యజమానులు, ఆ భూమిపై కబ్జాలో ఉన్న రైతులు పోరాటం చేస్తున్నారు. ఉప్పల్‌కు చెందిన చోవ్ల శ్రీనాథ్‌, కీసరకు చెందిన కందాడి అంజిరెడ్డి అనే రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లు ఆ ప్రాంతంలో వెంచర్లకు ప్రణాళిక రూపొందించారు. కోర్టు కేసు విషయంలో భూ యజమానులకు సహకరించారు. 53 ఎకరాల్లో 28 ఎకరాలకు సంబంధించి అనుకూలంగా తీర్పు వచ్చే సూచనలు కనిపించడంతో.. వెంచర్ల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ భూముల్లో వివాదాన్ని పరిష్కరించి, యజమానుల తరఫున తమకు అనుకూలంగా ప్రొసీడింగ్స్‌ జారీ చేయాల్సిందిగా, న్యాయస్థానంలో సమర్పించేందుకు అనుకూలంగా డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా వారు కీసర తహసీల్దార్‌ నాగరాజును సంప్రదించారు.దీనికి రూ.2 కోట్ల లంచం కావాలని నాగరాజు డిమాండ్‌ చేశాడు.

ఈ వ్యవహారంపై ఏసీబీ రంగారెడ్డి/మేడ్చల్‌-మల్కాజిగిరి విభాగం అధికారులకు ఉప్పందింది. శుక్రవారం సాయంత్రం అంజిరెడ్డి ఏఎ్‌సరావునగర్‌లోని తన ఇంటికి తహసీల్దార్‌ నాగరాజును పిలిచాడు. శ్రీనాథ్‌ కూడా అతనితో ఉన్నాడు. వారిద్దరూ తహసీల్దార్‌కు రూ. 1.10 కోట్ల నోట్ల కట్టలను నాగరాజుకు ఇవ్వగానే.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ‘‘మాకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించాం. సుమోటోగా కేసు నమోదు చేశాం. నాగరాజుతోపాటు.. అవినీతి నిరోధక సవరణ చట్టం మేరకు లంచం ఇచ్చిన అంజిరెడ్డి, శ్రీనాథ్‌లను అరెస్టు చేశాం. రాంపల్లి దాయర్‌ వీఆర్వో బొంగు సాయిరాజ్‌పైనా కేసు నమోదు చేశాం. అని రమణ్‌కుమార్‌ వివరించారు. నాగరాజుకు చెందిన అల్వాల్‌లోని నివాసంలో, కీసర తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నామని తెలిపారు.  తహసీల్దార్‌ అరెస్టు సమయంలో సీజ్‌ చేసిన రూ. 1.10 కోట్లను లెక్కించడానికి అర్ధరాత్రి వరకు సమయం పట్టిందని అధికారులు తెలిపారు.

పెద్దల అండదండలు
కీసర తహసీల్దార్‌ నాగరాజుకు ముందు నుంచి అవినీతి చరిత్ర ఉంది. ఆయనపై 2011 జూన్‌లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్న కేసు ఉంది. అప్పట్లోనే నాగరాజు ఇంట్లో కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లతో ఓ మినీ బార్‌ ఉండటాన్ని చూసి తెల్లబోయారు. అప్పట్లో ఈ కేసు ఓ సంచలనం. అయితే.. కొందరు పెద్దల అండదండలతో మూడు నెలల క్రితమే నాగరాజు ఆ కేసు నుంచి విముక్తి పొందాడు. ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల్లో అక్రమాస్తుల్ని గుర్తించినా.. క్లీన్‌చీట్‌ తీసుకోగలిగాడు.

ప్రభుత్వ పెద్దలతోపాటు.. రాజకీయ నాయకులతో నాగరాజుకు సన్నిహిత సంబంధాలున్నాయని.. అందుకే ఎన్నడూ చిన్న, ప్రాధాన్యం లేని పోస్టులు చేపట్టలేదని ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఏసీబీ కేసు ఉండగానే.. తహసీల్దార్‌గా పదోన్నతి పొందాడు. ఇప్పటి వరకు రియల్‌ఎస్టేట్‌ పరంగా డిమాండ్‌ ఉన్న నగర శివారు మండలాల్లోనే పోస్టింగులు వేయించుకున్నాడు. సాధారణంగా ఏసీబీ కేసులో ఉన్న వారికి కీలకమైన మండలాల్లో పోస్టింగ్‌లు ఇవ్వరు. నాగరాజు విషయంలో ఆ నిబంధనేమీ అడ్డంకి కాలేదు.

Courtesy Andhrajyothi

Leave a Reply