కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ లక్ష చదరపు అడుగులు

0
462

జీవో 111ను ఉల్లంఘించి నిర్మాణం… కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపణలు
జన్వాడ వద్ద విలేకరుల సమావేశం

అక్రమ నిర్మాణానికి పోలీసుల కాపలా
ఆ భవనాన్ని వెంటనే కూల్చేయాలి
కేసీఆర్‌ది ధృతరాష్ట్ర పాలన: రేవంత్‌
అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు
తోపులాటలో విశ్వేశ్వర్‌రెడ్డికి గాయం
రామచంద్రాపురం స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌/రామచంద్రాపురం/శంకర్‌పల్లి/నార్సింగి : మంత్రి కేటీఆర్‌ జీవో నంబర్‌ 111ను అతిక్రమించి జన్వాడలో అక్రమంగా ఇంద్రభవనం లాంటి ఫామ్‌హౌ్‌సను నిర్మించుకున్నారని కాంగ్రెస్‌ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జన్వాడ గ్రామ పరిధిలోని 301, 302, 312, 313 సర్వే నంబర్లలో తన స్నేహితులైన రాజులు, వారి కుటుంబ సభ్యుల పేరుతో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో, మూడంతస్థుల భవనాన్ని నిర్మించుకున్నారని తెలిపారు. ఈ మేరకు రేవంత్‌.. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయం నుంచి మీడియా ప్రతినిధులను జన్వాడకు తీసుకెళ్లారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితోపాటు తన వాహనంపైకి ఎక్కి.. ఆ భవనాన్ని విలేకరులకు చూపించారు. ఫామ్‌హౌస్‌ ఫొటోలను విడుదల చేశారు.

దాని సమీపంలోని చిన్నసముద్రం చెరువు నుంచి ఫిరంగి కాల్వ గండిపేట చెరువులో కలుస్తుందన్నారు. ఆ కాల్వను పూర్తిగా పూడ్చేసి 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారని ఆరోపించారు. ఆ భూమి సమీపంలో ఉన్న మహిపాల్‌రెడ్డితోపాటు పలువురిని నార్సింగి పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి బెదిరించి, ఆ భూములు లాక్కున్నారని చెప్పారు. ఇక్కడ అక్రమ కట్టడాల్ని కూల్చేయాలని హైకోర్టు సీజే కూడా పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌ జోలికి అధికారులు ఎందుకు వెళ్లడంలేదని ప్రశ్నించారు. ఆ భవనాన్ని వెంటనే కూల్చివేయాలని డిమాండ్‌ చేశారు.

పోలీసులతో రేవంత్‌ వాగ్వాదం
రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలోనే భారీ సంఖలో పోలీసులు అక్కడికి చేరుకుని, ఆయనను అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో రేవంత్‌, విశ్వేశ్వర్‌రెడ్డిలకు వాగ్వాదం జరిగింది. తాము ప్రైవేటు స్థలంలో ఉండి విలేకరులతో మాట్లాడుతుంటే పోలీసులకు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఫామ్‌హౌ్‌సకు పోలీసులు కాపలా కాస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విశ్వేశ్వర్‌రెడ్డి కాలికి గాయం అయింది. ఆయనతోపాటు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని రామచంద్రాపురం స్టేషన్‌కు తరలించారు.

కాంగ్రెస్‌ కార్యకర్తల ధర్నా
రేవంత్‌రెడ్డిని సుమారు మూడు గంటల పాటు స్టేషన్‌లో ఉంచడంతో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గేటు ముందు బైఠాయించారు. చివరికి రాత్రి 7.40 గంటలకు రేవంత్‌ను  విడిచిపెట్టారు. అనం తరం ఆయన మాట్లాడుతూ కుమారుడి అరాచకాలు చూడకుండా కేసీఆర్‌ ధృతరాష్ట్ర పాలనసాగిస్తున్నారని ఆరోపించారు. నగరంలోని దుర్గం చెరువు, నందినగర్‌లలోని నిర్మాణాలపైనా రేవంత్‌ ఆరోపణలు చేశారు. ఆరోపణలు తప్పయితే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధమేనన్నారు. రేవంత్‌పై నార్సింగి పోలీసులు 151 సీఆర్‌పీసీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై సెక్షన్‌ 188 కింద కేసు నమోదు చేసినట్లు మాదాపూర్‌ ఏసీపీ శ్యామ్‌సుందర్‌రావు తెలిపారు.

Courtesy Andhrajyothi

Leave a Reply