నీడలేని నిరాశ్రయులు

0
309

-లక్షలాది మందికి అందని లాక్‌డౌన్‌ సాయం
– వారిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం
– సర్క్యులర్‌లలో వారి గురించి ప్రస్తావించని వైనం

న్యూఢిల్లీ : దేశాన్ని కరోనా కాటేస్తున్న వేళ నిరాశ్రయుల పరిస్థితి చాలా దారుణంగా మారింది. మహమ్మారికి అడ్డుకట్టవేయడటానికి కేంద్రం అకస్మాత్తుగా ప్రకటించిన లాక్‌డౌన్‌ వారిని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. ఆపత్కాల సమయంలో ఆదుకొని చేయూతనివ్వాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. చేతల్లో చూపించడం మరచి మాటలకే పరిమితమవుతున్నాయి. లాక్‌డౌన్‌ పీరియడ్‌లో పేదలు, నిరాశ్రయులు, కార్మికులను సాయం అందించటానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రకటనలు చేశాయి. అయితే వీటిలో అధికం ప్రకటనలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా నిరాశ్రయులకు అందే సాయానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకూ జారీ చేసిన అనేక సర్క్యులర్‌లను ‘ఇండో గ్లోబల్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ’ అనే సంస్థ విశ్లేషించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నిరాశ్రయులకు ఆహారం, ఆరోగ్యం, శానిటైజేషన్‌, ఆర్థికంగా సాయం వంటివి ఏ విధంగా అందుతున్నాయన్న అంశంపై విశ్లేషించింది.

ఆహారం
నిరాశ్రయులకు ఆహారాన్ని అందించే విషయంలో దేశంలోని 16 రాష్ట్రాలు తాము జారీ చేసిన సర్క్యులర్‌లలో వారి గురించి పేర్కొనకపోవటం గమనార్హం. ఈ జాబితాలో తెలంగాణతో పాటు అసోం, గోవా, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ , మణిపూర్‌, వేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, పంజాబ్‌, సిక్కిం, తమిళనాడు, యూపీ, ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలున్నాయి. ఇందులో పంజాబ్‌, హర్యానా, పశ్చిబెంగాల్‌, యూపీ, గుజరాత్‌ వంటి రాష్ట్రాలైతే దాదాపు 40శాతం మంది నిరాశ్రయులను(2011 జనాభా లెక్కల ప్రకారం) కలిగి ఉండటం గమనార్హం.

హెల్త్‌, శానిటైజేషన్‌
మే 3 నాటికి, దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు మాత్రమే నిరాశ్రయులకు రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌లకు సంబంధించి ప్రస్తావించాయి. ఇంకా కేరళ రాష్ట్రం మాత్రమే నిరాశ్రయులను భద్రతా వలయంలోకి తీసుకొచ్చే విషయంపై ప్రస్తావించటం గమనార్హం. ఇక వారికి బేసిక్‌ శానిటైజేషన్‌ వసతులు(శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌, ఫేస్‌మాస్క్‌లు వంటివి) కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్‌, ఢిల్లీ, కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు మాట్లాడాయి. సహాయశిబిరాల్లో ఉన్నవారికి సరిపడా నీటిని అందించడంలో కేరళ చక్కగా పనిచేసింది.

ఆర్థిక సాయానికి దూరం
ఇక 14 రాష్ట్రాలు పెన్షన్‌ నిధులకు ప్రాధాన్యతనిస్తూ సర్క్యులర్‌లను జారీచేశాయి. అర్హులైనవారు ప్రభుత్వాల నుంచి ఆర్థికంగా సాయాన్ని పొందాయి. కానీ, ఆ ప్రభుత్వాలు నిరాశ్రయుల గురించి ఆలోచించలేదు. వారి వద్ద పత్రాలు లేకపోవటంతో ప్రభుత్వ సాయానికి దూరమయ్యారు. దీంతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ నిరాశ్రయులు ఆర్థిక సాయానికి నోచుకోలేదు. అలాగే ఒక్క మణిపూర్‌ రాష్ట్రంలో తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో వారి జీవన విధానం సంక్లిష్టంగా తయారైంది. ఇక వారికి వసతిని కల్పించటంలో కేరళ, ఢిల్లీ, బీహార్‌, అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలు తమ సర్క్యులర్‌లలో ప్రస్తావించాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం..
దేశంలో 10.77 లక్షల మంది నిరాశ్రయులు ఉంటారని అంచనా. అయితే కొన్ని ప్రజా సంఘాలు, సంస్థల లెక్కల ప్రకారం.. ఆ సంఖ్య 30 లక్షలు దాటిందని సమాచారం. అయితే నిరాశ్రయుల కష్టాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారిని ఆదుకోవాలని సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Courtesy Nava Telangana

Leave a Reply