ప్రభుత్వానికే పట్టని భూనిర్వాసితుల గోడు!

0
170

వి. బాలరాజ్‌

ఈదేశంలో భారీ పరిశ్రమలూ, ప్రాజెక్టులన్నీ అభివృద్ధి పేరిట భూమి నిర్వాసితుల జీవితాలను పునాదులుగా చేసుకొని నిర్మించినవే. 1894లో బ్రిటిష్‌ హయాంలో భూ సేకరణ కోసం చేసిన చట్టంతోనే 2013 వరకు కూడా భూ సేకరణ ప్రక్రియ జరిగింది. అంటే దాదాపుగా 120 ఏళ్ళపాటు బ్రిటిష్‌ వాళ్ళ చట్టమే చెల్లింది. ఈ 1894 చట్టానికి 1984లో ఒక చిన్న సవరణ చేసారు. కానీ దీని వలన భూములను కోల్పోయినవారికి ఏ మాత్రం లబ్ధి చేకూరేది కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భూ సేకరణ కోసం, భూమి పంపిణీ చేయటం కోసం లాండ్‌ సీలింగ్‌ చట్టాన్ని తెచ్చారు. ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ భూస్వాములు కోర్టుకు వెళ్ళారు. దీంతో ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31ని (రైట్‌ టు ప్రాపర్టీ) రద్దు చేసింది. దాన్ని తొమ్మిదవ షెడ్యూలులో పెట్టింది. మన రాజ్యాంగం ప్రకారం తొమ్మిదో షెడ్యూలులో చేర్చిన అంశంపై కోర్టుకు వెళ్ళటానికి లేదు.

వలస అభివృద్ధికి తొలిమెట్టు అని ఒక మాట ఉంది. అలా కావాలని వలస వెళ్ళటం వేరు. కానీ భూసేకరణ ద్వారా నిర్వాసితులై బలవంతంగా వలస వెళ్ళిన కుటుంబాలు కోలుకోవటం సులువు కాదు. రెండు మూడు తరాలుగా ఒక దగ్గర స్థిరపడ్డ కుటుంబం నిర్వాసితులై వేరే చోటకు వలస వెళ్లాల్సి వస్తే మళ్ళీ ఆ కుటుంబం కోలుకోవడానికి మరో రెండు మూడు తరాలు పడుతుంది. వీళ్ళ త్యాగాలను ప్రభుత్వాలు గుర్తించటం లేదు.

ప్రభుత్వాలు సేకరించే భూముల వల్ల అంతిమంగా సంపద, భూమి ఎక్కువగా ఉన్నవాళ్ళకే అధిక ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ప్రాజెక్టులు నిర్మించినా, పరిశ్రమలు నిర్మించినా అప్పటికే సంపద ఉన్నవాళ్ళ దగ్గరే మరింత సంపద పోగుపడుతుంది. ఇందులో భాగంగా ఇంకొంతమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వాలు ఈ లెక్కలు మాత్రమే చెప్పి, అభివృద్ధి అంటే ఉపాధి కల్పించటమే అనే భ్రమలో ప్రజలను ఉంచుతుంది. మైనింగ్‌ కోసం సేకరించిన భూములలో ఎక్కువగా భూమి కోల్పోయింది ఆదివాసీలే. అంతేకాకుండా భూమి కోల్పోయిన చిన్న సన్నకారు రైతులు, అసైన్‌మెంట్‌ పట్టాదారులు, కౌలు రైతులు, కూలీలు, వ్యవసాయ అనుబంధ వృత్తులు చేసుకునే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.

దేశంలో నిర్మించిన హీరాకుడ్‌, భాక్రానంగల్‌, నాగార్జున సాగర్‌ వంటి భారీ నీటి ప్రాజెక్టులకు, భారీ పబ్లిక్‌ సెక్టార్‌ పరిశ్రమల కొరకు, రైల్వేలకు, రక్షణ రంగానికి, రహదారులకు, చెరువుల విస్తీర్ణం పెంపుకు, ప్రభుత్వ పథకాలలో భాగంగా ఇళ్ళ నిర్మాణం కొరకూ దేశంలో ఎంతో భూసేకరణ జరిగింది. భూ నిర్వాసితులకు ఏ మాత్రం న్యాయం జరగడం లేదంటూ 1894లోని భూసేకరణ చట్టంపై చాలా విమర్శలు వచ్చాయి. దీనిపై సుదీర్ఘమైన చర్చల అనంతరం 2013లో కేంద్రం తయారు చేసిన కొత్త చట్టం వచ్చింది. ఈ కొత్త చట్టం ద్వారా భూ యజమానులకు, నిర్వాసితులకు పునరావాసం, పునస్థాపన, పారదర్శకతతో కూడిన న్యాయమైన నష్టపరిహారం అందేలా చట్టం రూపొందింది. ఈ చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలుపరచాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించింది. కానీ చాలా రాష్ట్రాలు 2013 భూ సేకరణ చట్టాన్ని యథావిధిగా అమలు చేయడం సాధ్యం కాదన్నాయి. ఒక్కో రాష్ట్రంలో భూ సమస్య, స్థానిక పరిస్థితులు, ఆర్థిక సామాజిక అంశాలు ఒక్కో రకంగా ఉన్నాయని చేతులేత్తేశాయి. దీంతో స్థానిక అవసరాల రీత్యా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ 2013 చట్టాన్ని అమలుపరుచుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది.

మన తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో, రాజధాని కోసమూ పోలవరం కోసమూ, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాయలసీమ ఏరియాలో లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కోసమూ, తెలంగాణలో భారీ నీటి ప్రాజెక్టుల కోసమూ లక్షల ఎకరాలు సేకరించారు. ఇందులో తెలంగాణలో ప్రాజెక్టుల కోసం 4.17లక్షల ఎకరాలు సేకరించాలనుకున్నారు, 3.66లక్షల ఎకరాలు సేకరించారు. కాళేశ్వరం మొదలు మల్లన్నసాగర్‌ ప్రాజెక్టుల వరకు దాదాపుగా లక్ష ఎకరాలు సేకరించారు. ఈ 14 ప్రాజెక్టుల పరిధిలో 94 గ్రామాలు పూర్తిగా, 16గ్రామాలు పాక్షింగా ముంపుకు గురయ్యాయి. ఈ ముంపు గ్రామాల్లో కొందరికి రూ.7.50లక్షల చొప్పున, కొందరికి రూ.5.50లక్షలు చొప్పున, భూమి విలువ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలలో రూ.పది లక్షల దాకా ఇచ్చారు. వీటిని మార్కెటు విలువ ప్రకారం గాక, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చెల్లించారు.

తెలంగాణ వచ్చాక భూమి విలువను ప్రభుత్వం మొన్నటి వరకు కావాలనే పెంచలేదు. పెంచితే ఆ రేటు ప్రకారం భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించవలసి వస్తుందని ఆలోచించారు. తమ అవసరాలు తీరాక ఈ సంవత్సరం మార్చిలో మార్కెట్ విలువను పెంచారు. ఇది భూ నిర్వాసితులను మోసగించడమే! ఈ అన్యాయానికి తోడుగా కొత్త చట్టంలో కేంద్రం కల్పించిన వెసులుబాటు ఆధారంగా, భూ సేకరణ చట్టంలో సవరణలు చేసి, జీవో నెంబరు.75ను తీసుకొచ్చారు. ఈ జీవో ప్రకారంగా నీటి పారుదల, రోడ్లు, పరిశ్రమల కోసం ఆయా శాఖలు భూసేకరణ చేసిన తర్వాత కూడా, ఎక్కడైనా చిన్న చిన్న బిట్స్‌ అదనంగా కావాల్సి వచ్చినా, లేదా తక్కువపడినా కొంత భూమిని అత్యవసరంగా సేకరించే అధికారం సంబంధింత శాఖకు ఉంది. జీవో నెంబరు 123లో భూ సేకరణకు ప్రత్యేక కలెక్టరు, భూ సేకరణ అధికారి రాయబడ లేదు. కలెక్టరును చైర్‌‍పర్సన్‌గాను, జాయింట్‌ కలెక్టరును మెంబరుగాను, స్థానిక ఆర్‌డివో జిల్లా ల్యాండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అధికారిగానూ కన్వీనరుగాను ఉంటారు. వీరితోపాటు మరో ముగ్గురు అధికారులుంటారు. పట్టాదారు తన భూమిని తనంత తానుగా ఇవ్వటానికి ముందుకు వస్తే, ఉత్తర్వుల ద్వారా పరిహారం ఇవ్వబడుతుంది. ఇష్టపూర్వక ఉత్తర్వులు పొందాక కోర్టుల జోక్యం ఉండదు. అంతేకాదు, భూ సేకరణలో ఏ తప్పులు జరిగినా కోర్టుకు వెళ్ళి న్యాయం కోరే అవకాశం ఇవ్వని భాషలో ఈ జీవోలను రాసారు.

ఎపిఐఐసి, టిఎస్‌ఐఐసిల ద్వారా ప్రభుత్వాలు తమ ఉద్దేశాలను, పరిభాషను మార్చుకొని ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం పేరిట ప్రజా ప్రయోజనాలంటూ వ్యాపార అవసరాల కోసం కూడా భూ సేకరణ చేస్తున్నాయి. ఈ పద్ధతిలో కూడా భూ సేకరణలకు వెసులుబాటును ప్రభుత్వాలే తమకు తాముగా కల్పించుకుంటున్నాయి. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం కోసం సేకరించబడిన ఈ భూమి నిజంగా ప్రజలకు ఏ మేరకు ఉపయోగపతుందనేది అనుమానమే.

తెలంగాణ ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టాన్ని వీలైనంత వరకు కుదించి, అనుకూలంగా మార్చుకుంది. భూ యజమానులను మాత్రమే గుర్తించింది. కూలీలకు, అసైనీలకు, కౌలు రైతులకు, చేతి వృత్తులు చేసుకునే వారికి ఎలాంటి సహాయం అందించడం లేదు. ప్రజలకు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించే బాధ్యత నుంచి ఉద్దేశపూర్వకంగా తప్పించుకుంది. ఈ విషయమై కోర్టులలో కేసులు కూడా వేసారు. న్యాయస్థానంలోని జడ్జీలు కూడా నష్టపరిహారం అంటే కేవలం భూ యజమానులకు మాత్రమే వర్తిస్తుంది అనే పాత ఆలోచనలో ఉన్నారు. ముంపు ప్రాంత ప్రజలే కాదు, తెలంగాణలోని ప్రజలందరూ బాధితుల పక్షాన ఆలోచించాల్సిన అవసరం ఉంది.

తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీలో ధర్నా చేసిన సమయంలో చనిపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చింది. కానీ ఇక్కడ నిర్వాసితులవుతున్న సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు రావటం లేదు. దీన్నిబట్టి 2013లో రూపొందించిన చట్టం స్ఫూర్తిని గౌరవించే ఉద్దేశం మన తెలంగాణ ప్రభుత్వానికి లేదని భావించవలసి వస్తుంది. ఈ వైఖరి ఇటు పాలకులకు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

రిటైర్డు తహశీల్దార్‌

Leave a Reply