స్థిరాస్తి దందాలో పేలిన తూటా!

0
66
  • భూ పంచాయితీల్లో ఇరువర్గాల మధ్య వివాదం
  • మాదాపూర్‌ వద్ద తపంచాతో కాల్పులు
  • రౌడీషీటర్‌ మృతి.. మరొకరికి గాయాలు
  • పోలీసుల అదుపులో నిందితులు!

హైదరాబాద్‌ మాదాపూర్‌, దుండిగల్‌: హైదరాబాద్‌ మాదాపూర్‌ సమీపంలోని 100 అడుగుల రోడ్డులో నీరూస్‌ జంక్షన్‌ – పోలీస్‌ ఠాణాకు కూతవేటు దూరంలో సోమవారం తెల్లవారుజామున తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. భూవివాదాల్లో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ హత్యకు దారితీసింది. ఘటనలో ఇస్మాయిల్‌ అనే వ్యక్తిపై ప్రత్యర్థి వర్గానికి చెందిన జిలానీ తపంచాతో అతి సమీపం నుంచి కాల్పులు జరపటంతో కుప్పకూలిపోయాడు. వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తల వెనుక భాగంలో బుల్లెట్‌ దూసుకెళ్లటం వల్లనే మరణించినట్టు వారు తేల్చారు. మరో వ్యక్తి జహంగీర్‌ చికిత్స పొందుతున్నాడు. ముజాహిద్‌, జిలానీ పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను నియమించినట్లు మాదాపూర్‌ ఇన్‌ఛార్జి డీసీపీ సందీప్‌ గోనె తెలిపారు. భూవివాదాలే హత్యకు దారితీసినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.

నెల క్రితమే హెచ్చరిక
బోరబండ ప్రాంతానికి చెందిన ముజాహిద్‌ (50), జిలానీ (35) అన్నదమ్ముల పిల్లలు. కాలాపత్తర్‌కు చెందిన ఇస్మాయిల్‌పై రౌడీషీట్‌ ఉంది. హత్య కేసులో జీవితఖైదు పడగా.. బెయిల్‌పై బయటకు వచ్చాడు. జైలులో ఉన్నపుడు ముజాహిద్‌, ఇస్మాయిల్‌ స్నేహితులయ్యారు. బయటకు వచ్చాక భూపంచాయితీలు, దందాలకు పాల్పడుతున్నారు. వివాదాల్లోని స్థలాలను కొంటూ క్రయవిక్రయాలు ప్రారంభించారు. జహీరాబాద్‌, సంగారెడ్డి, పటాన్‌చెరు, గండిమైసమ్మ ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. గండిమైసమ్మ వద్ద 250 గజాల స్థలాన్ని ముజాహిద్‌కు ఇస్మాయిల్‌ అప్పగించాడు. బదులుగా జహీరాబాద్‌ వద్ద స్థలం లేదా రూ.20లక్షలు ఇస్తానన్న ముజాహిద్‌ వాయిదాలు వేస్తూవచ్చాడు. దీనిపై నెలక్రితం ముజాహిద్‌, ఇస్మాయిల్‌ మధ్య వివాదం రేగింది. ఆ సమయంలో పక్కనే ఉన్న జిలానీపై ఇస్మాయిల్‌ చేయిచేసుకున్నాడు.తన జోలికొస్తే ప్రాణాలు తీస్తానంటూ హెచ్చరించాడు.

ప్రాణహానిని పసిగట్టి..
ఇదే విషయమై చర్చించుకునేందుకు ఆదివారం సాయంత్రం కలుద్దామంటూ ఇస్మాయిల్‌కు ముజాహిద్‌ ఫోన్‌ చేశాడు. అతడి వల్ల ప్రాణహాని ఉంటుందని అంచనా వేసిన ఇస్మాయిల్‌.. అనుచరులు జహంగీర్‌, అక్రం, గౌస్‌తో కారులో వచ్చాడు. ముజాహిద్‌ తన కారులో, సోదరుడు జిలానీ, అనుచరుడు ఫిరోజ్‌ స్కూటీపై బయల్దేరారు. వారంతా రాత్రి 7 గంటలకు బహదూర్‌పురలో కలిశారు. లంగర్‌హౌజ్‌, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో చర్చలు జరిపారు. సోమవారం అర్ధరాత్రి దాటాక 2 గంటలకు పంజాగుట్ట నుంచి బయల్దేరి మాదాపూర్‌ వద్ద నీరూస్‌ కూడలికి చేరారు. అందరూ టిఫిన్‌ చేశారు.

దేశీ తుపాకీతో కాల్పులు
తెల్లవారుజామున 3-4 గంటల మధ్య ఇస్మాయిల్‌, ముజాహిద్‌ మధ్య మరోసారి వాగ్వాదం మొదలై నడిరోడ్డులో కొట్లాటకు దిగారు. ముజాహిద్‌ సోదరుడు జిలానీ దేశీ తుపాకీతో ఇస్మాయిల్‌ తల వెనుక భాగంలో ఒక రౌండు కాల్పులు జరపడంతో అతను కుప్పకూలాడు. అడ్డుకునేందుకు యత్నించిన జహంగీర్‌ తలపై తుపాకీ మడమతో కొట్టి ముజాహిద్‌, జిలానీ, ఫిరోజ్‌ పరారయ్యారు. ఇస్మాయిల్‌ను అనుచరులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. ఘటనా స్థలికి చేరుకున్న మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ పి.రవీంద్రప్రసాద్‌ దర్యాప్తు చేపట్టారు. పఠాన్‌చెరులో తలదాచుకున్న ఫిరోజ్‌, జిలానీలను సోమవారం రాత్రి ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుల నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఆ అయిదెకరాలే కారణమా?
ముజాహిద్‌, జిలానీలపై వివాదాల్లో ఉన్న భూములను కబ్జా చేసి నకిలీ పత్రాలు సృష్టించి యజమానులను బ్లాక్‌మెయిల్‌ చేస్తారనే ఆరోపణలున్నాయి. 2020 జూన్‌లో గండిమైసమ్మ చౌరస్తా వద్ద కూకట్‌పల్లికి చెందిన స్థిరాస్తి వ్యాపారిపై జిలానీ, ముజాహిద్‌ కత్తులతో దాడి చేశారు. ్టదీంతో దుండిగల్‌ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఇస్మాయిల్‌, ముజాహిద్‌ అనుచరులు జహీరాబాద్‌ బైపాస్‌ సమీపంలో అయిదెకరాల విస్తీర్ణంలో వెంచర్‌ వేశారు. ఎకరా సుమారు రూ.3కోట్ల ధర పలుకుతుందని అంచనా. ఇదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి సారథ్యంలో 10మంది సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారం చేస్తున్నారు. వాటాల పంపిణీ విషయంలో తలెత్తిన వివాదం హత్యకు దారితీసినట్టు పోలీసు వర్గాల అంచనా వేస్తున్నాయి.

Leave a Reply