భూములు అమ్ముడే!

0
135
  • 20 వేల కోట్ల రూపాయల రాబడికి కసరత్తు
  • హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో హుషారు
  • మంత్రివర్గ ఉప సంఘం సిఫారసూ ఇదే
  • రాజీవ్‌ స్వగృహ, దిల్‌ భూములపై దృష్టి
  • అసైన్డ్‌ భూముల క్రమబద్ధీకరణపై పరిశీలన
  • మైనింగ్‌ సీనరేజీ చార్జీల పెంపు యోచన
  • ప్రత్యామ్నాయాల వైపు ఆర్థిక శాఖ చూపు
  • భారీ బడ్జెట్లో రాబడి పెంపునకు మార్గమిదే

హైదరాబాద్‌ : భారీ బడ్జెట్లు! దానికనుగుణంగా రాని రాబడులు! నెల నెలా తప్పని అప్పులు! ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు నిధుల కేటాయింపులో పెద్దపీట వేయాల్సిన పరిస్థితి! వెరసి, ఖర్చు బారెడు.. రాబడి మూరెడు! పోనీ.. ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిద్దామంటే పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరేలా లేదు. దాంతో, బడ్జెట్‌ కసరత్తు ఆర్థిక శాఖకు కత్తి మీద సాములా మారింది. ఈ నేపథ్యంలోనే, రాష్ట్ర పరిధిలోనే ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు నేతృత్వంలోని ఆదాయ వనరుల మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులను అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా పన్నేతర (నాన్‌ ట్యాక్స్‌) రాబడులను పెంచుకోవడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

భూముల అమ్మకం, అసైన్డ్‌ భూముల రెగ్యులరైజేషన్‌, మైనింగ్‌ సీనరేజీ చార్జీల పెంపు, రాజీవ్‌ స్వగృహ ఆస్తుల అమ్మకం, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ (దిల్‌) భూముల అమ్మకం వంటి వాటిపై దృష్టి పెట్టారు. కాగా, ఈసారి కూడా భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్‌ సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే కొన్నేళ్లుగా బడ్జెట్లలో ఆదాయ అంచనాకు, వాస్తవ రాబడులకు పొంతన కుదరడం లేదు. ఇప్పటికైనా ఆ ఆదాయ గ్యాప్‌ను పూడ్చాలంటే భూముల అమ్మకం, చార్జీల పెంపు వంటివి అధికారులకు కనిపిస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అధిక ఆదాయ వనరులను సమకూర్చి పెట్టే వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను పెంచాలన్నా తగ్గించాలన్నా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జీఎస్టీ కౌన్సిల్‌కే అధికారాలుంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యాట్‌ను పెద్దగా పెంచే అవకాశాలు లేవు. ఇప్పటికే పెట్రోలుపై 35.2%, డీజిల్‌పై 27% మేర వసూలు చేస్తోంది. దీనినే తగ్గించాలంటూ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. మద్యంపై విధిస్తున్న 70 శాతం వ్యాట్‌ను కూడా పెంచే మార్గం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం ధరలు మండిపోతున్నాయి. ఇలా పన్నుల పెంపు మార్గాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అధికారులు అన్వేషిస్తున్నారు.  ఆదాయ వనరుల పెంపుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులను పరిశీలిస్తున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ ఆస్తులపై దృష్టి పెట్టారు. దీనికి హైదరాబాద్‌లోని బండ్లగూడ (నాగోలు), పోచారంతోపాటు జిల్లాల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అపార్ట్‌మెంట్ల కోసం సేకరించి పెట్టిన భూములున్నాయి. వీటి రాజీవ్‌ స్వగృహలోని ఖాళీ స్థలాల అమ్మకానికి ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మహబూబ్‌నగర్‌, నల్లగొండ, గద్వాల, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో మార్చి నెలలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ సహా మిగిలిన జిల్లాల్లోనూ రాజీవ్‌ స్వగృహ ఆస్తులను వేలం వేయాలని భావిస్తున్నారు. తద్వారా, దాదాపు రూ.2000 కోట్ల మేర రాబడిని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుత బడ్జెట్‌లో పన్నేతర రాబడి కింద రూ.30,557.35 కోట్లను అంచనా వేయగా.. డిసెంబరు నాటికి రూ.5,181.46 కోట్లు మాత్రమే సమకూరాయి. ఇందులో ప్రధానంగా భూముల అమ్మకమే ఉంటుంది. కోర్టుల్లో పిటిషన్లు పడడంతో పెద్ద మొత్తంలో భూములను అమ్మలేకపోయింది. తాజాగా, ప్రభుత్వం తన భూములను అమ్ముకోవచ్చంటూ గురువారమే హైకోర్టు స్పష్టతనిచ్చింది. దాంతో, కొత్త బడ్జెట్‌లోనైనా భూముల అమ్మకం ద్వారా రాబడి పెంచుకోవాలని యోచిస్తున్నారు. మంత్రివర్గ ఉపసంఘం కూడా దీనిని సిఫారసు చేసింది. భూముల అమ్మకం ద్వారా కనీసం రూ.20 వేల కోట్లను రాబట్టేలా కసరత్తు చేస్తున్నారు. ఇక, రాష్ట్రంలో అసైన్డ్‌ భూముల సమస్య తీవ్రంగా ఉంది. దాదాపు 30 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములుంటే.. వాటిలో లక్ష ఎకరాల వరకు కబ్జాదారుల అధీనంలో ఉన్నాయని సర్కారు అంచనా. అటు అసైన్‌దారులు సాగు చేసుకోలేక, ఇటు కబ్జాదారులు వాటినుంచి తప్పుకోకపోవడంతో భూములు ఎందుకూ కొరగాకుండా మారుతున్నాయని ఆందోళన చెందుతోంది. అసైన్డ్‌ భూముల్లో దీర్ఘకాలంగా కబ్జాలో ఉన్నవారి నుంచి భారీస్థాయిలో ఫీజులు వసూలు చేస్తూ రెగ్యులరైజ్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. మైనింగ్‌ సీనరేజీ చార్జీలను పెంచడం ద్వారా ఆదాయాన్ని రాబట్టుకోవాలన్నది మరో ఆలోచన. దీంతో రూ.1000 కోట్ల అదనపు రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. ‘దిల్‌’కు రాష్ట్రంలో దాదాపు 5000 ఎకరాలభూములున్నాయి. ప్రస్తుతం ఈ భూములపై ఏపీ ప్రభుత్వం పేచీ పెడుతోంది.

రాష్ట్ర విభజన హక్కుల్లో భాగంగా ఈ భూములపై తమకూ అధికారం ఉందని వాదిస్తోంది. ఆ సమస్యలపై సమావేశాలు జరుగుతున్నందున ఇది పరిష్కారమైతే దిల్‌ భూములను అమ్మాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎంతో కొంత నిధులను రాబట్టాలన్న ఉద్దేశంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించాలని యోచిస్తున్నారు. ఆయన అనుమతితో ఆయా అంశాలపై తుది నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

భారీ బడ్జెట్‌లతోనే సమస్య
రాబడులతో సంబంధం లేకుండా ఏటా భారీగానే బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.1,82,914 కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో 26ు పెంచి ఏకంగా రూ.2,30,825 కోట్ల బడ్జెట్‌ను పెట్టింది. భారీ బడ్జెట్‌లకు నిధులను సమకూర్చుకోవడం కష్టతరంగా మారుతోంది. 2020-21లో జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, సేల్స్‌ ట్యాక్స్‌, కేంద్ర పన్నుల్లో వాటా, ఇలా అన్ని రకాల ఆదాయాలు కలిపి రెవెన్యూ రాబడుల కింద రూ.1,43,151.94 కోట్లు అంచనావేస్తే రూ.99,903 కోట్లు సమకూరాయి. దాంతో, రూ.45,638 కోట్ల అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో రెవెన్యూ రాబడుల కింద రూ.1,76,126 కోట్లు అంచనా వేస్తే డిసెంబరు వరకు రూ.86,051 కోట్లు  వచ్చాయి. జనవరిలో రూ.10 వేల కోట్లు వచ్చాయనుకుంటే రూ.96 వేలకోట్లకు చేరినట్లు లెక్క. ఫిబ్రవరి, మార్చి నెలల రాబడులు కలిస్తే రూ.1.25 లక్షల కోట్లకు అటు ఇటుగా ఉండవచ్చు. ఈ ఏడాది బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించిన అప్పులు తక్కువేమీ కాదు. రూ.45 వేల కోట్లమేర అప్పు తీసుకోవాలని అంచనా వేస్తే.. జనవరి నాటికే దాదాపు లక్ష్యం పూర్తయింది.

ఈ నెలలో ఇప్పటికే రూ.2000 కోట్లు అప్పు తీసుకుంది. మరో వెయ్యి కోట్లకు ఇండెంట్‌ పెట్టింది. రూ.2.30 లక్షల కోట్ల ప్రస్తుత బడ్జెట్‌లో రుణాలు, అడ్వాన్సుల పేమెంట్లు మినహా రెవెన్యూ, మూలధన వ్యయాల కింద రూ.1,98,430 కోట్లు అంచనా వేయగా… డిసెంబర్‌నాటికి రూ.1,21,090 కోట్లు ఖర్చు చేసినట్లు ఆర్థిక శాఖ ‘కాగ్‌’కు సమర్పించిన నివేదికలో పేర్కొంది. మార్చి చివరికి ప్రభుత్వ వ్యయం రూ.1.80 లక్షలకోట్లకు చేరుతుందని ఇటీవల కేసీఆర్‌ చెప్పారు. వాస్తవ రాబడులకు తెచ్చిన అప్పులు తోడవుతుండడంతో కనీసం ఇంత మొత్తమైనా సర్కారు ఖర్చు చేయగలుగుతోంది.

నేటి నుంచి భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తులు
హైదరాబాద్‌ : ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, నిర్మాణాలు చేపట్టిన వారికి 2014 డిసెంబరు 30న విడుదలైన జీవో 58, 59 కింద క్రమబద్దీకరణకు ప్రభుత్వం గతంలో వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దీన్ని పొడిగిస్తూ ఈ నెల 14న జీవో విడుదలైంది. 125 గజాలలోపు భూములను ఉచితంగా క్రమబద్దీకరిస్తారు. 126-150 గజాల భూముల విషయంలో.. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు, మురికివాడల ప్రజలు మార్కెట్‌ విలువలో 10% చెల్లించాల్సి ఉంటుంది. ఇతరులు 25% చెల్లించాలి. 151-250 గజాల విస్తీర్ణానికి బేసిక్‌ విలువలో 25%, 251-500 గజాల విస్తీర్ణానికి బేసిక్‌ విలువలో 50%, 500 గజాలకు పైన విస్తీర్ణానికి బేసిక్‌ విలువలో 75% చొప్పున చార్జీలు చెల్లించాలి.

Courtesy Andhrajyothi

Leave a Reply