‘గ్రేట్ బ్రిటన్’ చూపుతున్న గొప్పమార్గం!

0
86
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)

అంత ఘనంగా ఎన్నికల్లో నెగ్గగానే తాను కచ్చితంగా మరో రెండు మూడుపర్యాయాలు ప్రధాని కుర్చీలో ఉంటానని బోరిస్ జాన్సన్ అనుకొనిఉంటాడు. కానీ, ప్రస్తుత పదవీకాలాన్ని సగం కూడా పూర్తిచేయకుండానే పదవినుంచి దిగిపోవాల్సివచ్చింది, అదీ అవమానకరమైన రీతిలో. ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు సమాధానం– ఒక్కటే. బ్రిటిష్ ప్రజాస్వామ్యంలోని బలమైన వ్యవస్థలన్నీ ఆయన మాటనూ, చేతనూ తూకం వేశాయి, చర్యలకూ చేష్టలకూ బాధ్యుడిని చేశాయి, ప్రశ్నించాయి, నిలదీశాయి. కలసికట్టుగా వ్యవహరించి రాజకీయ వ్యవస్థ మనుగడకు బంగారు బాటలు వేశాయి. మనదేశంలో ఆ వ్యవస్థలన్నీ ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి, మరింత దిగజారిపోతున్నాయి.

నాలుగేళ్ళక్రితం, హార్వర్డ్ ప్రొఫెసర్లు ఇద్దరు ఓ పుస్తకాన్ని ప్రచురించారు. 2018లో విడుదలైన ఈ పుస్తకం పేరు ‘హౌ డెమోక్రసీస్ డై’. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాగానే రాసిన పుస్తకం ఇది. అతి గొప్ప, సువ్యవస్థిత, సుస్థిర, ప్రాచీన ప్రజాస్వామ్యాలు సైతం తమ రాజకీయవ్యవస్థ అదేరీతిన నిలుస్తుందనీ, కొనసాగుతుందనీ అనుకోకూడదని ఆ పుస్తకం వాదిస్తుంది. ఓటర్ల మౌలికమైన, స్వాభావికమైన బలహీనతల ఆధారంగా జనం మధ్య తంపులు పెట్టగలిగే, వ్యవస్థల స్వతంత్రతమీద గౌరవం లేని ఓ నాయకుడు చాలు, ప్రజాస్వామ్యాన్ని అతిసులువుగా పతనం అంచులకు చేర్చడానికి.బ్రిటన్‌లో ఇటీవలి పరిణామాలు గమనించినప్పుడు ఆ పుస్తకానికి కొనసాగింపుగా మరో పుస్తకం రాయవచ్చునని అనిపించింది. దానికి ‘హౌ డెమోక్రసీస్ సర్వైవ్’ అని పేరుపెడితే అతికినట్టు ఉంటుంది కూడా. కేవలం రెండున్నరేళ్ళక్రితం సార్వత్రక ఎన్నికల్లో తన కన్సర్వేటివ్ పార్టీకి అద్భుత విజయాన్ని సాధించిపెట్టిన ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అక్కడ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో మరొకరిని ఎన్నుకొనే సుదీర్ఘప్రక్రియ కూడా ఆరంభమైంది. బ్రిటిష్ ఎన్నికలు ప్రధానంగా రెండు పార్టీల మధ్య, ఒకదానితో ఒకటి పోటీపడుతూ జరిగేవే అయినప్పటికీ, ఎప్పుడూ కూడా అధ్యక్షతరహా ఎన్నికల లక్షణాలను ప్రదర్శించలేదు. అయినప్పటికీ, 2019 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ కేవలం బోరిస్ జాన్సన్ జనాకర్షణశక్తి ఆధారంగా ఘన విజయాన్ని సాధించింది. ఆయనకు మంచి వాగ్ధాటి ఉంది. నడక, జుత్తు, వేషభాషలు సాధారణ బ్రిటిష్ ఓటరును కూడా ఆకర్షించి, జనం భారీగా ఆయనవైపు మొగ్గడంతో 1987 తరువాత అత్యధిక సీట్లతో కన్సర్వేటివ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంతేకాదు, ఆ పార్టీ ఓట్లవాటాకూడా 1979 తరువాత ఇదే అత్యధికం. ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ 1935 తరువాత అతితక్కువ స్థానాలు దక్కించుకున్నదీ ఇప్పుడే. లేబర్ పార్టీ సంప్రదాయ ఓటర్లుగా ఉన్న శ్రామికజనం కూడా ఈ ఎన్నికల్లో గంపగుత్తగా కన్సర్వేటివ్‌లకు ఓటేశారు. ఇందుకు కారణం బోజో. ఈ విజయం ఆయనను పార్టీలో తిరుగులేని నేతగా చేసింది. ముఖ్యంగా, తొలిసారి టోరీ ఎంపీలైనవారు ఆయన భజన బృదంగా తయారైనారు. బోరిస్‌ను ట్రంప్ విజయం కొంతమేరకు ప్రభావితం చేసింది. బోరిస్ రాజకీయవైఖరీ, వ్యవహారశైలీ ఆ అమెరికన్ వాగాడంబరి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాయి. పార్టీనీ, దాని యంత్రాంగాన్నీ పక్కకు పెట్టి నేరుగా ప్రజలతో వ్యవహరించడం, తన మంత్రులను, అధికారిక సలహాదారులను కాదని వందిమాగధుల మాట వినడం వంటివి మొదలైనాయి. ట్రంప్ మాదిరిగానే గ్రేట్ బ్రిటన్ గ్రేట్ ఎగైన్ వంటి మాటలు వాడటానికి కూడా బోరిస్ సందేహించలేదు.

2019లో పార్టీని విజయపథంవైపు నడిపించేటప్పటికి బోరిస్ వయసు యాభైఐదు. పోల్చిచెప్పాలంటే, నరేంద్రమోదీ భారత ప్రధాని అయినప్పటి వయసుకంటే ఎనిమిదేళ్ళు తక్కువ. ఆ ఏడాది ఎన్నికల్లో అంత ఘనంగా నెగ్గగానే కచ్చితంగా మరో రెండు మూడుపర్యాయాలు ప్రధాని కుర్చీలో కొనసాగుతాననే బోరిస్ అనుకొని ఉంటాడు. ఎందుకంటే, పిన్నవయసులో ఉన్నాడు, పార్టీ కూడా గుప్పిట్లోనే ఉంది, ఓటర్లకు తనమీద అధికవిశ్వాసమూ ఉంది. వీటన్నింటికీ మించి, ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీ బాగా దెబ్బతిని, దిక్కుతోచని స్థితిలో ఉంది. అయినా, బోరిస్ జాన్సన్ తన పదవీకాలాన్ని సగం కూడా పూర్తిచేయకుండానే పదవినుంచి దిగిపోవాల్సివచ్చింది, అదీ అవమానకరమైన రీతిలో. ఇలా ఎందుకు జరిగిందన్న ప్రశ్నకు సమాధానం– ఒక్కటే. బ్రిటిష్ ప్రజాస్వామ్యంలోని బలమైన వ్యవస్థలన్నీ ఆయన మాటనూ, చేతనూ తూకం వేశాయి, చర్యలకూ చేష్టలకూ బాధ్యుడిని చేశాయి, ప్రశ్నించాయి, నిలదీశాయి. అక్కడి మీడియానే తీసుకుందాం. లండన్ మేయర్‌గా, విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తన పరిమితుల్లోనే ఉన్నాడు. మీడియా అప్పుడు కూడా విమర్శించినప్పటికీ, ప్రధాని అయిన తరువాత అస్సలు వదలలేదు. అక్కడి స్వతంత్ర మీడియా ఆయనను అనుక్షణం తూచి ప్రజలకు లెక్కచెబుతూనే ఉంది. జనసామాన్యం మీద ప్రధాని హోదాలో విధించిన కొవిడ్ లాక్‌డౌన్ నిబంధనలను తానే ఉల్లంఘించి, తన మిత్రులతో పార్టీలు చేసుకున్న విషయం తెలియగానే మీడియా ‘పార్టీ గేట్’ పేరిట ఆయనను దుమ్ముదులిపేసింది. ఆంక్షల ఉల్లంఘనల కథనాలతో పత్రికలూ, చానెళ్ళు మారుమోగిపోయాయి. మనబోటి పరిమితంగా పనిచేసే ప్రజాస్వామ్యాల్లో ప్రధానమంత్రి చెప్పే అసత్యాలు, కట్టుకథలు, వంచనలను మీడియా అంత తీవ్రంగా తీసుకోదు. పత్రికలు, చానెళ్ళు వాటి తీవ్రతను లెక్కగట్టి ప్రజలకు తెలియచెప్పవు. బ్రిటన్‌లోనూ టోరీలవైపో, లేబర్‌వైపో కాస్తంత మొగ్గుచూపే కొన్నిపత్రికలు లేకపోలేదు. కానీ, అదృష్టవశాత్తూ అక్కడ నేరుగా రాజకీయ నాయకుల నుంచి ఆదేశాలు స్వీకరించే గోదీ మీడియా మాత్రం లేదు.

మీడియా ఎప్పుడైతే ప్రధానమంత్రి దుర్నీతినీ, చట్ట ఉల్లంఘనలను వెలికితీసి యోగ్యతను ప్రశ్నించిందో ఇక అక్కడి వ్యవస్థలు ఆగలేదు. ఆ దేశ పార్లమెంటు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకొని ఆయనను నిలదీసింది. బ్రిటిష్ పార్లమెంటులో ఒక అంశం చిన్నదైనా పెద్దదైనా పూర్తిస్థాయిలో చర్చ జరుగుతుంది. సభలో ప్రధానిని నేరుగా ప్రశ్నించే సంప్రదాయం ఒకటి ఉన్నందున కొత్త లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ ప్రశ్నలతో నులిపేస్తూంటే బోరిస్ జాన్సన్ తనను తాను రక్షించుకోవలసి వచ్చేది. స్టార్మర్‌కు జనాకర్షణశక్తి లేకపోయినా పోరాడే స్వభావం ఉంది. పార్టీని నిలబెట్టుకోవాలన్న తపనా ఉంది. మనదేశంలో కాంగ్రెస్ వైఖరి పూర్తిభిన్నం. రాహుల్ గాంధీకి ఓట్లు సంపాదించే శక్తి లేదని తేలిపోయినా, ఆయనను గానీ, ఆ కుటుంబాన్ని కానీ ఆ పార్టీ వదిలించుకోలేకపోతున్నది. తన అనుచిత ప్రవర్తనను మీడియా వెలుగులోకితెచ్చి, ఆ తరువాత పార్లమెంటులో తీవ్రవిమర్శలు రేగడంతో బోరిస్ జాన్సన్ విచారణకు ఆదేశించక తప్పలేదు. ఒకసారి ఆ బాధ్యత అప్పగించిన తరువాత అక్కడి పోలీసువ్యవస్థ కానీ, అధికార యంత్రాంగం కానీ రాజీపడలేదు. అద్భుతమైన సమర్థతతో, అధ్యయనంతో, లోతైన దర్యాప్తుతో తమ పాలకుల తప్పిదాలను వారు రికార్డుల్లోకి ఎక్కించారు. ఇక్కడ కూడా మనం ఓసారి పోల్చిచూసుకోవచ్చు. నరేంద్రమోదీ ప్రభుత్వం విపక్షాలు ఎంత పట్టుబట్టినా ముఖ్యమైన బిల్లులను కూడా పార్లమెంటరీ కమిటీలకు నివేదించదు. పాలనాపరమైన అవకతవకలను తేల్చిచెప్పే కమిటీలు, కమిషన్ల జోలికి పోదు. ఒకవేళ అటువంటివి ఏమైనా తప్పిజారి ఏర్పాటు చేయవలసివచ్చినా మన అధికారగణం ఒంటికి నూనెరాసుకున్నట్టే వ్యవహరిస్తుంది. ప్రధానిని కాస్తంత పలుచనచేసే విషయాలను ప్రస్తావించడానికి కూడా అది భయపడిపోతుంది. ఒకపక్క ఇంట్లో ఇలా మంటలు రేగగానే బోరిస్ జాన్సన్ తాను ఓ అంతర్జాతీయ నేతలాగా, రాజనీతిజ్ఞుడిలాగా కనిపించే ప్రయత్నమూ చేశారు. ప్రపంచం దృష్టి తనమీదే ఉండేట్టుగా, బ్రిటన్ ఇమేజ్‌ని పెంచుతున్నట్టుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం విషయంలో వ్యవహరించారు. బాంబులు పడుతున్న సమయంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ వీధుల్లో నడిచి బాధితపక్షం వహిస్తున్నట్టుగా ఫోటోకు పోజులిచ్చారు. అయితే, ఇవేమీ స్వదేశంలో ఆయన పార్టీ వారిని ప్రభావితం చేయలేకపోయాయి. మీడియా, పార్లమెంట్, అధికారవ్యవస్థ అప్పటికే నిజం నిగ్గుతేల్చడంతో, మోసపూరితంగా వ్యవహరించిన తమ నాయకుడిని కన్సర్వేటివ్ ఎంపీలు వ్యతిరేకించడం ఆరంభించారు. 2019 ఎన్నికల్లో తమను విజయతీరాలకు చేర్చిన నాయకుడిని వదిలిపెట్టడానికి వారు సంశయించలేదు. విశ్వాసతీర్మానంలో బోరిస్ గట్టెక్కినప్పటికీ, ఆయన మంత్రివర్గ సహచరులు రాజీనామాలు చేసి, చివరకు బోరిస్ అయిష్టంగానే రాజీనామాచేసి పోయే పరిస్థితిని కల్పించారు.

ఒక ట్రంప్, ఒక మోదీ మాదిరిగా పార్టీలో వ్యక్తిపూజను పెంచిపోషించి చిరకాలం నిలబడిపోవాలని అనుకున్నారు బోజో. కానీ, బ్రిటన్‌లో ఆ తరహా ఆరాధన రాజకీయాలకు చోటులేదు. రెండో ప్రపంచయుద్ధం తరువాత విన్‌స్టన్ చర్చిల్‌ను సైతం కిందకు తోసేసింది ఆ దేశం. బోరిస్ జాన్సన్ తమకు నాయకుడిగా ఉండే నైతిక అర్హత కోల్పోయాడని నిశ్చయించుకొని ఆ స్థానంలో వేరొకరిని కూచోబెట్టడానికి సిద్ధపడ్డారు కన్సర్వేటివ్‌లు. భారతదేశంలో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. భారతీయ జనతాపార్టీకి ఉన్న మూడువందలమంది పైచిలుకు ఎంపీల్లో ఒక్కరంటే ఒక్కరు పార్టీ సమావేశాల్లో కూడా మోదీని ప్రశ్నించరు, సున్నితంగానైనా విమర్శించరు. పెద్దనోట్ల రద్దునుంచి కరోనా కష్టాలవరకూ ఏ ఒక్కటీ కూడా వారిని కదలించలేదు. పైగా, మంత్రులూ ఎంపీలూ ఆయనను మహోన్నత నాయకుడిగా, దార్శనికుడిగా చిత్రీకరించేందుకు పరస్పరం పోటీపడుతుంటారు. జాన్సన్ రాజీనామా బ్రిటిష్ ప్రజాస్వామ్య విలువలకు, సమర్థతకు నిదర్శనం. అక్కడి మీడియా, పార్లమెంట్, అధికారగణం, అధికారపక్షం, విపక్షం కలసికట్టుగా వ్యవహరించి రాజకీయ వ్యవస్థ మనుగడకు బంగారు బాటలు వేశాయి. నూతనోత్తేజాన్నిచ్చి మరింత వెలగడానికి తోడ్ప డ్డాయి. మనదేశంలో ఈ వ్యవస్థలన్నీ పూర్తిభిన్నంగా వ్యవహరిస్తున్నాయి, దిగజారిపోతున్నాయి. భారతీయులుగా మనం వలసపాలకులను తిట్టుకోవడం సహజం. కానీ, ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ఆ దేశం ప్రదర్శించిన ఈ కట్టుబాటునూ తాపత్రాయాన్నీ కచ్చితంగా గుర్తించి, నేర్చుకోవాల్సింది మాత్రం ఎంతో ఉంది.

Courtesy Andhrajyothi

Leave a Reply