కొత్త ఏడాదిలో మనం ఏం చెయ్యాలి?

0
58
రాజ్‌దీప్‌ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

ఈసంవత్సరం ఆరంభంలో కరోనా విలయం నుంచి తెరిపిన పడ్డాం. ఇదే ఏడాది ముగియనున్న సమయంలో కొవిడ్ భయాలు మనలను మళ్లీ చుట్టుముట్టుతున్నాయి. అయినా, ఒక ఆంగ్ల మహాకవి శుభ గానం Ring out the old, ring in the newలో గళం కలుపుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. గురుదేవ్ రవీంద్రుడు ఆశించినట్టు ‘నిర్జీవమైన ఆచారపుటెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా’ ఉండే స్వేచ్ఛా సౌభాగ్య సీమగా మన భారత ధాత్రి రాబోయే రోజులలో వర్థిల్లాలి. అందుకు మనం ఏం చేయాలి?

దుష్ట సంకల్పంతో మన ముంగిటకు వచ్చిన చైనా నుంచి ఎదురవుతున్న పెనుముప్పును మనం సమైక్యంగా ఎదుర్కోవాలి. వాటిల్లుతున్న ప్రమాదంపై రాజకీయ ప్రతిస్పందనలు అపరిణతంగా ఉండకూడదు. లక్ష్యం సాధించేందుకు దోహదం చేయని వాదోపవాదాలను కట్టి పెట్టాలి. దాపరికం లేకుండా వ్యవహరించాలి. వాకిలి వద్ద వేచివున్న విరోధులతో లోపాయకారీగా వ్యవహరిస్తున్నట్టు పాలక ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపించుకోవడం ఎవరికి ప్రయోజనం? దేశ సరిహద్దుల పరిరక్షణకై ప్రచండ శీతగాడ్పులలో ప్రాణాలను పణంగా ఒడ్డుతోన్న వీర సైనికులకు ప్రభుత్వమూ ప్రజలూ బాసటగా నిలవాలి. వర్తమానంలో వక్రగతి పట్టిన పరిస్థితులకు కారణంగా అరవై ఏళ్ల నాటి నెహ్రూ వైఫల్యాలను తప్పుపడితే ఎలా?

జాతి మంచి చెడ్డలు, బాగోగులను విచారించే వేదిక పార్లమెంటు. జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపై అవగాహనతో కూడిన చర్చలు జరగాలి. మరి అధికార పక్షం వారిపై కెమెరాలను కేంద్రీకరిస్తూ ప్రతిపక్ష సభ్యుల గొంతు వినిపించకుండా వారి మైకులను స్విచ్ఛాఫ్ చేస్తే ఎలా? ఫలప్రదమైన చర్చలు ఎలా జరుగుతాయి? పార్లమెంటు సమావేశాలను కేవలం ఒక మొక్కుబడిగా నిర్వహించకూడదు. శాసన నిర్మాణానికి విపక్షాలు అంతరాయం కలిగించకూడదు. ఆజ్ఞలు జారీ చేసే ధోరణిని ప్రభుత్వం విడనాడాలి. పాలక ప్రతిపక్షాలు వాగ్వాదాలకు పాల్పడకుండా ప్రజల సమస్యలపై ఆవేశాలకు తావులేకుండా సాకల్యంగా మాట్లాడాలి. కేబినెట్ కీలక నిర్ణయాలు ఏకగ్రీవాలుగా జరగకూడదు. సమగ్ర చర్చలతో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి.

కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ అదేపనిగా సంఘర్షించుకుంటుంటే ఎలా? ఉభయ వ్యవస్థలూ తమ రాజ్యాంగ పరిమితులను గుర్తించాలి. న్యాయమూర్తుల నియామకాలు పారదర్శకంగా జరగాలి. ఈ విషయమై తమ వాదనలే సబబైనవని ప్రభుత్వం భావించకూడదు. జడ్జీల నియామకాలకు అడ్డుపడకూడదు. మంత్రులు బహిరంగంగా జడ్జీలపై విమర్శనాస్త్రాలను సంధించకూడదు. కేవలం ఎంపిక చేసిన కేసులలో మాత్రమే కాకుండా సమస్త కేసులలోనూ పౌరుల హక్కులను కాపాడేందుకు న్యాయవ్యవస్థ జాగరూకత వహించాలి. మానవ హక్కుల కార్యకర్తలు ఎందరో బెయిల్‌కు నోచుకోకుండా సంవత్సరాల తరబడి జైళ్లలో మగ్గుతున్నారు. ఏమిటి వారి నేరం? సైద్ధాంతిక విశ్వాసాలకు నిబద్ధమై ఉన్నందున వారికి సహజ న్యాయాన్ని నిరాకరిస్తే ఎలా? ‘జాతి–వ్యతిరేకులు’ అనే ముద్ర ఆ మేధావులపై వేయడం గర్హనీయం కాదా? ఈ అక్రమ రీతి రివాజులకు కొత్త సంవత్సరంలోనైనా మంగళం పాడాలి.

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. మరి ఎన్నికల సంఘం తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించవద్దూ? అధికారంలో ఉన్న రాజకీయ పక్షం కొమ్ముకాస్తే ఎలా? నిష్పాక్షికత ఏమయ్యేట్టు? మంత్రిపదవులపై పేరాశతో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయించకూడదు. దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో ఒక కట్టుతెగిన జాగిలంలా చెలరేగుతూ బీజేపీ పాలనలో ఉన్న రాష్ట్రాలలో విధేయ శునకంలా వ్యవహరించకూడదు. ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై వాస్తవాల ప్రాతిపదికన హేతుబద్ధ చర్చ జరగాలి. అధికారంలో ఉన్న రాజకీయ పక్షం ప్రయోజనాలకు అనుగుణంగా సమాచారాన్ని వక్రీకరించకూడదు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల విషయమై నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు. అయితే ‘కలత చెందకండి, ఆనందంగా ఉండండి, మిగతా దేశాల కంటే మనం ఎంతో మెరుగ్గా ఉన్నామనే’ మనస్తత్వాన్ని విడనాడాలి. ఇలాంటి ఆత్మ సంతృప్తితో హాని జరిగే ప్రమాదమున్నది. ఆర్థికాభివృద్ధి మందగించింది. ఉద్యోగాలు లుప్తమై పోతున్నాయి. ఇవి వాస్తవాలు. కఠోరమైనవే, సందేహం లేదు. అయితే వాటిని మనం అంగీకరించి తీరాలి. అప్పుడే మనం ఆ గడ్డు పరిస్థితిని అధిగమించగలుగుతాం. కోట్లాది సహచర భారతీయులు పేదరికం నుంచి గట్టెక్కారు. ఇది మనకు సంతృప్తి కలిగించే విషయం. అయితే ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం చాలా అథమ స్థానంలో ఉన్నది! దీనిపై మనం వ్యాకులపడి తీరాలి. సిగ్గిల్లాలి. అన్నార్తులు లేని సమాజ నిర్మాణాన్ని స్వప్నించాలి, సంకల్పించాలి.

ఒక రాజకీయ పార్టీ సంక్షేమ ఎజెండా మరో రాజకీయ పార్టీ ‘రేవడి’ కాకూడదు. నెరవేర్చగల హామీలను మాత్రమే ఏ రాజకీయ పక్షమైనా ఇవ్వాలి. ఉచితాల సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ప్రభుత్వ బొక్కసాన్ని ఖాళీ చేయించే విధంగా సంక్షేమ వాగ్దానాలు ఉండకూడదు. తాము అందించిన పాలన ప్రాతిపదికనే రాజకీయ పార్టీలు ప్రజల ఓట్లను అడగాలి. సమాజంలో విభేదాలను సృష్టించే సమస్యలను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు. 16వ శతాబ్దంలో ఒక ఆరాధనా మందిరాన్ని ఎవరు కూల్చివేశారన్న వివాదాస్పద విషయంపై కాకుండా 21వ శతాబ్ది భారతదేశ అవసరాలను ఎలా తీర్చుకోగలమనే హేతుయుక్త ఎజెండా ఆధారంగానే ఎన్నికలలో పోరాడాలి.

వాతావరణ మార్పు ఒక వాస్తవం. అవును, ఒక భయంకర వాస్తవం. ఆ విషమ సమస్య సుదూర ప్రపంచ నగరాలలో జరిగే సదస్సులకే పరిమితం కాకూడదు. మన జాతీయ చర్చల్లో, సామాన్యుల మాటా మంతీలో అది ఒక ప్రధానాంశమవ్వాలి. రక్షిత మంచినీరు లానే స్వచ్ఛమైన గాలిని పీల్చడమనేది ఒక హక్కుగా మనం పరిగణించాలి. ‘ఏళ్ళు, బయళ్ళూ, ఊళ్ళూ, బీళ్ళూ ఏకం చేసే వర్షాకాలం’లో మన నగరాలు పెను వరదల తాకిడికి గురవుతున్నాయి. అలాంటి విపత్కరాలను నిరోధించే మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు పన్నుల రూపేణా ప్రజలు చెల్లిస్తున్న సొమ్ముకు నగర, పట్టణ పాలనా సంస్థలను జవాబుదారీలుగా చేసితీరాలి.

కార్పొరేట్ కంపెనీల వేల కోట్ల రూపాయల రుణాల చెల్లింపును ఒక్క కలం పోటుతో రద్దు చేస్తూ పంట పెట్టుబడులకు తీసుకున్న రుణం వాయిదాలవారీ చెల్లింపుల్లో ఎవరైనా ఒక రైతు ఒక పర్యాయం జాప్యం చేస్తే అతని ట్రాక్టర్‌ను జప్తు చేసి, ఆ అన్నదాతను అవస్థల పలు చేయడం న్యాయమేనా? మన ఆర్థిక పాలనలోని ఈ అపసవ్యతను తక్షణమే సరిదిద్దాలి. వ్యాపార సౌలభ్యం గురించి పాలకులు పొద్దస్తమానం మాట్లాడుతూనే ఉంటారు. అయినా ఆదాయ పన్ను శాఖాధికారులు ఏ క్షణాన తమ గృహాలు, వ్యాపార కార్యాలయాలపై దాడి చేస్తారోనన్న భయాందోళనల నుంచి వ్యాపారస్తులను బయట పడవేయవద్దూ? కొత్త సంవత్సరంలో ఇందుకు నాంది పలకాలి.

ప్రభుత్వ యంత్రాంగంలో నియామకాలకు సంబంధించిన పరీక్షల నిర్వహణలో అంతులేని జాప్యాన్ని నివారించాలి. తీరా పరీక్షలను నిర్వహించినప్పుడు ప్రశ్న పత్రాల లీక్ అయితే ఎలా? ఈ ప్రస్తావిత అలక్ష్యాల వల్లే లక్షలాది యువ భారతీయలు మాటల్లో చెప్పలేని వేదనకు గురవుతున్నారు. భవిష్యత్తు అస్పష్టంగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఆందోళన చెందరు? మతాంతర వివాహాలను ‘లవ్ జిహాద్’గా తెగనాడే సంకుచితత్వానికి స్వస్తి చెప్పి తీరాలి. రాజ్యాంగ విరుద్ధ చట్టాల ద్వారా యువతీయువకుల మధ్య ప్రేమను నేరపూరితం చేయకూడదు. ఒక అత్యాచారంపై ఆగ్రహానికి బాధితురాలి మతపరమైన అస్తిత్వం కారణం కాకూడదు. ఆ హేయ నేర స్వభావమే మనలో ఆగ్రహాన్ని రగిలించాలి. హంతకుడి పేరు అఫ్తాబ్ అయినా, అమర్ అయినా ఆ నేర సంబంధిత శిక్షా చట్టాన్ని ఒకే విధంగా వర్తింపచేయాలి.

ఒక నటి తాను అభినయించిన సినిమాలో ధరించిన దుస్తుల రంగును ఆ సినిమాను నిషేధించేందుకు కారణంగా చూపడం ఎంత అసంబద్ధం! బహుళ మతాలు, సంస్కృతులు వర్ధిల్లుతున్న సమాజం మన భారతదేశం. ఎవరైనా సరే తమకు శోభాయమానంగా కనిపించే దుస్తులను ధరించవచ్చు. ఇందుకు ఆక్షేపణ తెలిపితే ఎలా? ముస్లిం మతస్తుడైన ఒక సూపర్ స్టార్‌ను మత ప్రాతిపదికన దాడులు, వేధింపులకు గురి చేసే సంకుచిత ధోరణులు కొత్త సంవత్సరంలో సమసిపోవాలి. తమను తాము సాంస్కృతిక నిఘాకారులుగా ప్రకటించుకున్నవారు సహస్రాబ్దాల పురానవ భారతీయ నాగరికత, దాని విలువల పరిరక్షకులా? ఇదేమి చోద్యం? సహనం, సర్దుబాటు అనేవి మన విశిష్ట వైవిధ్య సంస్కృతికి చిహ్నాలు. ఒక సమాజాన్ని ఏవైతే పరిపూర్ణం, సమున్నతం చేస్తాయో వాటిని అణచివేయడం ఇంకెంత మాత్రం ఆమోదనీయం కాకూడదు.

విద్వేషాలను రెచ్చగొట్టే వారికి సామాజిక మాధ్యమాలు వేదిక కారాదు. ఇబ్బందికరమైన సత్యాలను వెల్లడించిన వారిని నిర్బంధాలకు గురిచేయడం ఈ సత్యానంతర ప్రపంచంలో నాగరిక వ్యవహారమేనా? రాజకీయ నాయకుల మద్దతుతో కుబేరులు అయిన వారు వాక్ స్వాతంత్ర్యం, భావ స్వేచ్ఛపై ఉపన్యాసాలు ఇవ్వడమేమిటి? అందునా మీడియా సంస్థలను తమ ఆర్థిక బలంతో స్వాయత్తం చేసుకుంటున్న వారు పౌర స్వేచ్ఛలు, పత్రికా స్వాతంత్ర్యంపై మాట్లాడడం పూర్తిగా అసంబద్ధం.

ప్రపంచ కప్ పుట్‌బాల్ ఫైనల్స్‌కు చేరేలా క్రీడా భారతం ఎదగాలి. ఒక మెస్సీని తమ వాడుగా గౌరవించడానికి బదులుగా అద్భుత ప్రతిభావంతులైన పుట్‌బాట్ ఆటగాళ్లు దేశీయంగా ప్రభవించే పరిస్థితులను సృష్టించగలగాలి. హాకీ, క్రికెట్‌లలో కొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మన మహిళా క్రీడాకారులను పురుష ఆటగాళ్లతో సమానస్థాయిలో గౌరవించి, ప్రోత్సహించాలి. కులం, ఆదాయం, జెండర్, ప్రాంతం, మతం మొదలైన వాటితో సంబంధం లేకుండా భారతీయుడుగా ఉండడంలో అందరికీ సమానంగా వర్తించే పౌరసత్వ వివేక శీలతకు ప్రతీ భారతీయుడూ గర్వించేలా రేపటి మన సమాజం రూపుదిద్దుకోవాలి. గురుదేవ్ రవీంద్రుడు సంభావించినట్టు ‘నిరంతరం వికసించే భావాల, సంభవించే బృహత్కార్యాల స్వేచ్ఛామయ జగత్తులోకి భారత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం జాగృతమవ్వాలి.

Leave a Reply