కరెంటు భారం రూ.15,008 కోట్లు

0
195

వచ్చే ఏడాది ఎత్తిపోతలకు వాడే విద్యుత్తుకు కట్టాల్సిన మొత్తం
25 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగం అంచనా
ప్రభుత్వం రాయితీ నిధులు భారీగా పెంచక తప్పదు
విద్యుత్‌ పంపిణీ సంస్థల అంచనా

హైదరాబాద్‌ : వచ్చే ఆర్థిక సంవత్సరం(2020-21)లో ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తు డిమాండు, బిల్లులు భారీగా పెరగనున్నాయి. నెలవారీగా ఈ పథకాలకు ఎంత డిమాండ్‌ ఉంటుంది, ఎంత బిల్లు కట్టాలనే లెక్కలను విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు తయారుచేశాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనిరీతిలో ఎత్తిపోతల పథకాలకు వచ్చే ఏడాది 25,013 మిలియన్‌ యూనిట్లు(ఎంయూ) అవసరమని తేలింది. ఇందుకు యూనిట్‌కు రూ.6 వరకు ఛార్జీ వసూలు చేస్తారు. ఆ లెక్కన రూ.15,008 కోట్ల బిల్లును ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా విద్యుత్‌ను డిస్కంలు ముందుగా కొని సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీల సవరణకు ‘వార్షిక ఆదాయ అవసరాల’(ఏఆర్‌ఆర్‌) నివేదికను డిస్కంలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అదనంగా ఎంత డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలను తయారుచేస్తున్నాయి. రాష్ట్రంలో మిగతా వర్గాల వినియోగదారుల నుంచి అదనంగా పెద్దగా డిమాండ్‌ పెరగకున్నా ఎత్తిపోతలకు మాత్రం రికార్డు స్థాయిలో అవసరం అని తేలింది. నీటి పారుదల శాఖ నుంచి ఏయే ఎత్తిపోతల పథకానికి ఎంత విద్యుత్తు అవసరం అనే వివరాలు తీసుకున్నారు. ఉదాహరణకు వచ్చే నవంబరులో 5,380 మెగావాట్ల డిమాండ్‌ ఉంటుందనే అంచనాలో గోదావరి నదిపై ఉన్న ఎత్తిపోతలకే ఇందులో 4743 మెగావాట్లు వాడతారని అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో ఇటీవల ఎత్తిపోతలకు అత్యధిక డిమాండ్‌ 2 వేల మెగావాట్ల వరకు వచ్చింది. వచ్చే ఏడాది ఇంతకన్నా 165 శాతం అదనంగా పెరుగుతుందని నీటిపారుదల శాఖ డిస్కంలకు వివరించింది. ప్రస్తుత ఏడాది రాష్ట్రంలో అన్ని వర్గాల వినియోగం దాదాపు 62 వేల మిలియన్‌ యూనిట్లు ఉంటుందని.. ఎత్తిపోతల వల్ల వచ్చే ఏడాది ఇది 82 వేల ఎంయూలు దాటనుందని భావిస్తున్నారు.

నిధులొచ్చేనా…
ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు వాడుతున్న విద్యుత్తుకు నెలవారీ బిల్లులను కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. ఈ బకాయిలు ఇప్పటికే రూ.7 వేల కోట్లకు చేరినట్లు డిస్కంలు ఇటీవల ప్రభుత్వానికి నివేదించాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎత్తిపోతలకు వాడే కరెంటుకు ఏకంగా రూ.15,008 కోట్ల బిల్లు రానుంది. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో విద్యుత్‌ రాయితీల కింద ప్రభుత్వం రూ.8 వేల కోట్లను ఇచ్చింది.

Courtesy Eenadu…

Leave a Reply