బ్రిటన్‌ ప్రధానిగా ట్రస్‌

0
63
  • టోరీ సభ్యుల ఓటింగ్‌లో మెజారిటీ మద్దతు
  • 21 వేల ఓట్లతో రిషి సునాక్‌ చేజారిన పదవి
  • నేడు బోరిస్‌ జాన్సన్‌ వీడ్కోలు సమావేశం
  • ఆ వెంటనే బ్రిటన్‌ ప్రధానిగా లిజ్‌ నియామకం
  • మొదటిసారి స్కాట్లాండ్‌లో కార్యక్రమం
  • ఓటముల నుంచి విజయం వైపు లిజ్‌ పయనం
  • అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ

లండన్‌/న్యూఢిల్లీ : బ్రిటన్‌ తదుపరి ప్రధాన మంత్రిగా 47 ఏళ్ల లిజ్‌ ట్రస్‌ ఎంపికయ్యారు. ఆరు వారాలుగా సాగిన కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ పోటీలో.. ట్రస్‌, భారత సంతతికి చెందిన రిషి సునాక్‌ హోరాహోరీ తలపడ్డ విషయం తెలిసిందే. తొలుత కన్జర్వేటివ్‌ పార్టీ టోరీ ఎంపీల మద్దతు సునాక్‌కే ఉన్నా.. క్రమంగా ట్రస్‌ పైచేయి సాధించారు. 1.72 లక్షల మంది టోరీ సభ్యులు ఆన్‌లైన్‌, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా కన్జర్వేటివ్‌ నేత ఎన్నికలో ఓట్లు వేయగా.. వాటిల్లో 654 చెల్లుబాటు కాలేదు.

మిగతా వాటిల్లో ట్రస్‌కు 81,136.. సునాక్‌కు 60,399 ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 5 గంటలకు టోరీ 1922 కమిటీ చైర్మన్‌ సర్‌ గ్రాహం బ్రాడీ ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తూ.. లిజ్‌ ట్రస్‌ను విజేతగా ప్రకటించారు. కన్జర్వేటివ్‌ పార్టీ నేత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఆనవాయితీ. మార్గరేట్‌ థాచర్‌, థెరిసా మే తర్వాత.. బ్రిటన్‌ ప్రధాని పదవిని చేజిక్కించుకున్న మూడో మహిళగా ట్రస్‌ రికార్డు సృష్టించనున్నారు. సోమవారం సాయంత్రమే ఆమె కేబినెట్‌ కూర్పుపై కసరత్తు ప్రారంభించారు. అయితే.. ట్రస్‌ మంత్రివర్గంలో రుషి సునాక్‌కు చోటు అనుమానమేనని తెలుస్తోంది. మంగళవారం బోరిస్‌ జాన్సన్‌కు వీడ్కోలు సమావేశం జరగనుంది. ఆ వెంటనే ట్రస్‌ స్కాట్లాండ్‌లోని బల్మోరల్‌ క్యాజిల్‌లో బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2ను కలుస్తారు. అక్కడే బ్రిటన్‌ రాణి ఆమెను ప్రధానిగా నియమిస్తూ ఉత్తర్వులిస్తారు. నిజానికి బ్రిటన్‌ వెలుపల ప్రధాని నియామకం జరగడం ఇదే మొదటిసారి. బ్రిటన్‌ రాణి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ కార్యక్రమాన్ని స్కాట్లాండ్‌లో ఏర్పాటు చేశారు. బుధవారం ఆమె కేబినెట్‌ను ప్రకటించనున్నారు. ఆ తర్వాత బ్రిటన్‌ దిగువసభ– హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో ప్రధాని హోదాలో తొలి ప్రసంగం చేయనున్నారు.

విపక్ష లేబర్‌ పార్టీ నేత సర్‌ కెరి స్టార్మర్‌కు సవాళ్లు విసురుతూ.. మొదటి ప్రైమినిస్టర్స్‌ క్వశ్చన్స్‌(పీఎంక్యూ)లో మాట్లాడనున్నారు. కాగా.. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ట్రస్‌ ప్రసంగిస్తూ.. తాను ఇచ్చిన ప్రధాన హామీ అయిన పన్నుల తగ్గింపు, ఇంధన సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. బ్రెగ్జిట్‌ విషయంలో బోరిస్‌ జాన్సన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతూ, ఉక్రెయిన్‌ దురాక్రమణ విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను తీవ్రంగా వ్యతిరేకించడం పట్ల అభినందించారు. అటు రిషి సునాక్‌ కూడా ట్రస్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్‌ చేశారు. ‘‘కొత్త ప్రధానితో కలిసి పనిచేస్తా. కన్జర్వేటివ్‌ పార్టీ ఓ కుటుంబం లాంటిది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రస్తుత తరుణంలో  ట్రస్‌కు అండగా నిలుద్దాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

సునాక్‌ చేజారింది అందుకే..!
రిషి సునాక్‌ ముందు నుంచి ప్రధాని రేసులో ముందంజలో ఉన్నా.. ఆ తర్వాత బోరిస్‌ జాన్సన్‌ ఆయనకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం.. ట్రస్‌కు మద్దతివ్వడం ప్రతికూలంగా మారాయి. ట్రస్‌ తన ప్రచారంలో రిషి తీసుకువచ్చిన పన్నులనే టార్గెట్‌గా చేసుకున్నారు. ఆర్థిక మాంద్యం దిశలో బ్రిటన్‌ అడుగులు వేస్తున్న తరుణంలో రిషి సునాక్‌ ఆదాయ, ఇతర పన్నులను పెంచారు. ‘‘రిషి పెంచిన పన్నులను తగ్గించడమే నా ప్రధాన లక్ష్యం’’ అంటూ ట్రస్‌ చేసిన ప్రచారం టోరీ సభ్యులను ఆకట్టుకుంది. మరోవైపు.. ట్రస్‌ తన ప్రచారాన్ని ప్రారంభించినప్పటి నుంచి మార్గరేట్‌ థాచర్‌ మాదిరిగా ఆహార్యం, నడవడికను మార్చుకున్నారు. మార్గరేట్‌ థాచర్‌ మాదిరిగానే పన్నుల తగ్గింపు ప్రధాన హామీగా ప్రచారాన్ని కొనసాగించారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరిస్తానన్నారు. రిషి సునాక్‌ మాత్రం ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కిస్తానంటూ ప్రచారంలో పేర్కొన్నారు.

ఓటముల నుంచి విజయ తీరాలకు..
లిజ్‌ ట్రస్‌ ఓటముల నుంచి విజయ తీరాలను అందుకున్నారు. ఓటమెరుగని నాయకురాలిగా ఎదిగారు. నమ్మిన సిద్ధాంతాలతో ముందుకుసాగుతూ బ్రిటన్‌ ప్రధాని అయ్యారు. ఆమె 1975లో ఆక్స్‌ఫర్డ్‌లో వామపక్ష భావజాలం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి గణితశాస్త్ర ప్రొఫెసర్‌. తల్లి నర్సు. అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమంలో ఆమె చిన్నతనంలోనే తన తల్లితో కలిసి పాల్గొన్నారు. రౌండేలో పాఠశాల విద్యను పూర్తిచేసుకుని, ఆక్స్‌ఫర్డ్‌లో తత్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రాల్లో పట్టభద్రురాలయ్యారు. విద్యార్థి దశలోనే లిబరల్‌ డెమోక్రాట్ల తరపున క్రియాశీలంగా పనిచేశారు.

తనకు తాను ఓటు వేసుకోలేదు.. సున్నా ఓట్లు..!
లిజ్‌ ట్రస్‌ తన సూల్‌ రోజుల్లో పాఠశాలలో నిర్వహించిన ఓ నాటకంలో మార్గరేట్‌ థాచర్‌ పాత్రను పోషించారు. ఆ నాటకంలో నిర్వహించిన ఉత్తుత్తి ఎన్నికల్లో ఆమెకు ఒక్క ఓటూ రాలేదు. చివరకు ఆమె తనకు తన ఓటు కూడా వేసుకోలేదని తేలింది.

ప్రధాని మోదీ అభినందనలు
బ్రిటన్‌ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్న లిజ్‌ ట్రస్‌ను భారత ప్రధాని మోదీ అభినందించారు. ఇరు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ మరింత బలపడేలా ఆమె కృషిచేస్తారని ఆకాంక్షించారు. ‘‘ట్రస్‌లిజ్‌.. అభినందనలు. భారత్‌-బ్రిటన్‌ బంధాన్ని మీరు మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు. కాగా, ట్రస్‌ ముందు నుంచి భారత్‌తో మిత్ర వైఖరినే ప్రదర్శించారు. ఆమె అంతర్జాతీయ వాణిజ్య శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న సమయంలో భారత్‌ను సందర్శించారు. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో ఆమె భారత్‌-బ్రిటన్‌ బంధం మరింత బలపడాలని.. స్వేచ్ఛాయుత వాణిజ్యానికి అడుగులు పడాలని ఆకాంక్షించారు.

Leave a Reply