యాప్‌ల దా‘రుణాల’కు ఏడుగురి బలి

0
25
  •  రూ.30,000 కోట్ల లావాదేవీలు
  • నూటికి రూ.30 వరకు వడ్డీ
  •  28 మంది నిందితుల అరెస్టు  
  • కోర్టులో పోలీసుల అభియోగ పత్రం

హైదరాబాద్‌: యాప్‌ల ద్వారా సులభంగా రుణాలిస్తామంటూ ఏకంగా రూ. 30,000 కోట్ల లావాదేవీలు నిర్వహించిన కేసులో హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో అభియోగపత్రాలు సమర్పించారు. ఈ యాప్‌లను షాంఘైలో రూపొందించారని పేర్కొన్నారు. రుణాలిచ్చిన వెంటనే చెల్లించాలంటూ వేధించడం వల్ల రాష్ట్రంలో ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబయిల్లో ఎంతోమందిని ఆకర్షించి రూ.లక్షల్లో రుణాలిచ్చి.. బెదిరించి నెలకు నూటికి రూ. 20 నుంచి 30 చొప్పున వడ్డీ వసూలు చేశారని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ల్యాంబో, ముగ్గురు చైనీయులు సహా 28 మందిని అరెస్ట్‌ చేశామని, పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు జెన్నీఫర్‌ కోసం గాలిస్తున్నామని వివరించారు.

వర్జిన్‌ ఐలాండ్స్‌లో ఖాతాలు
రుణ యాప్‌ల ద్వారా రూ.వందల కోట్లు కొల్లగొట్టేందుకు చైనీయులు పథకం వేశారు. షాంఘైలో ఓ ప్రైవేటు కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేసే జెన్నీఫర్‌, మరో కంపెనీలో ఆర్థికసలహాదారుగా వ్యవహరిస్తున్న వాంగ్‌ జియాంగ్‌ షి కలిసి 2019 నవంబరులో దిల్లీకి వచ్చి మూడు సంస్థలను ప్రారంభించారు. దిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరులో జెన్నీఫర్‌ కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయగా.. జియాంగ్‌ షి బెంగళూరుకు పరిమితమయ్యాడు. గతేడాది లాక్‌డౌన్‌కు ముందు జియాంగ్‌ షి చైనాకు వెళ్లిపోయాడు. జెన్నీఫర్‌ షాంఘై నుంచి ల్యాంబోను పిలిపించి, దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ కాల్‌సెంటర్ల బాధ్యత అప్పగించి, జకార్తాకు వెళ్లిపోయింది. ల్యాంబో కర్నూలుకు చెందిన నాగరాజును సహాయకుడిగా నియమించుకున్నాడు. రుణయాప్‌లతో 7 నెలల్లో రూ. 30,000 కోట్ల లావాదేవీలు నిర్వహించారు. లాభంగా వచ్చిన రూ. 11,000 కోట్లను వర్జిన్‌ ఐలాండ్స్‌లోని బ్యాంకుల్లో బినామీ ఖాతాలకు బదిలీ చేశారు. అక్కడినుంచి దశలవారీగా రూ. వందల కోట్లు షాంఘైకి చేరాయని అభియోగపత్రాల్లో పోలీసులు పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌ సమయంలో రూ. 16 వేల కోట్ల రుణాలు
కరోనా కారణంగా గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో చైనా కంపెనీల పంటపండింది. ఎలాంటి పత్రాలు, పూచీ లేకుండా రుణాలిస్తామంటూ వాట్సప్‌ లింకులు పంపుతుండడంతో లక్షలమంది యువత, ఉద్యోగాలు పోయినవారు రుణాలు తీసుకున్నారు. ఒక్కోరోజు గరిష్ఠంగా రూ. 250 కోట్ల వరకూ అప్పులిచ్చారు. కేవలం నాలుగు నెలల్లో రూ. 16,000 కోట్ల లావాదేవీలు నిర్వహించారు. వీరి బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక రాజేంద్రనగర్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు, సంగారెడ్డిలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని, మేడ్చల్‌లో చిరు వ్యాపారి సహా ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. చైనా కంపెనీల ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన పోలీసులు వారి బ్యాంకు ఖాతాల్లో రూ. 315 కోట్లను ఇప్పటికే స్తంభింపజేశారు.

Courtesy Eenadu

Leave a Reply