లాక్‌డౌన్‌: పరిశ్రమలు తెరవాలా? వద్దా?

0
266

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణ పారిశ్రామిక రంగ ముఖచిత్రం ఆవిష్కృతమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏయే పరిశ్రమలు అభివృద్ధి చెందాయనే లెక్క తేలింది. గత నెల 22 నుంచి దాదాపు 40 రోజులుగా రాష్ట్రంలో అన్ని పరిశ్రమలు మూతపడ్డ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నందున కార్మికుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలు తెరవాలా? వద్దా? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అసలు రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో ఎన్ని పరిశ్రమలున్నాయనే సమాచారం సేకరించింది. ఈ వివరాల ప్రకారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 56,546 పరిశ్రమలుండగా అందులో 16.34 లక్షల మంది పనిచేస్తున్నట్లు లెక్క తేల్చింది.

వస్త్ర పరిశ్రమల్లోనే అధికం!
గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులపై వస్త్ర పరిశ్రమ తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణవ్యాప్తంగా అధికంగా ఉపాధి కల్పిస్తున్నది టెక్స్‌టైల్‌ పరిశ్రమలే కావడం గమనార్హం. రాష్ట్రంలో 2,815 టెక్స్‌టైల్‌ కంపెనీలుండగా.. ఇందులో 2.85 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆ తర్వాతి స్థానం ఖనిజాభివృద్ధి పరిశ్రమలది కాగా.. మూడో స్థానంలో ఎలక్ట్రిక్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు తయారు చేసే సంస్థలున్నాయి. ఈ పరిశ్రమల ద్వారా 1.16 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,413 ఔషధ, రసాయన పరిశ్రమల్లో 10.86 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇవేగాకుండా పరిశోధన, అభివృద్ధి సంస్థల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా, గ్రామీణ ప్రాంత పారిశ్రామికాభివృద్ధిలో భారీ లఘు పరిశ్రమల కంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ) లదే కీలక పాత్ర.

రాష్ట్రవ్యాప్తంగా 18 నిర్దేశించిన రంగాలతో పాటు ప్రాధాన్యత కేటగిరీల్లో 56,546 పరిశ్రమలున్నాయి. వీటిలో 16.34 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
18 రంగాలైన బొగ్గు, సౌర విద్యుత్‌ సంస్థలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, సిమెంటు, ఇతర నిర్మాణ పరిశ్రమలు, గ్రానైట్‌ అండ్‌ స్టోన్‌ క్రషింగ్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ఫార్మా అండ్‌ కెమికల్స్, పేపర్‌ అండ్‌ ప్రింటింగ్, ప్లాస్టిక్‌ అండ్‌ రబ్బర్, బేవరేజెస్, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, లెదర్, తేయాకు అనుబంధ పరిశ్రమలు తదితర కేటగిరీల్లో రాష్ట్రవ్యాప్తంగా 56,546 పరిశ్రమలున్నాయి. వీటిల్లో 16.34 లక్షల మంది ఉద్యోగులున్నారు.
థర్మల్, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి.
ఎయిరోస్పేస్‌ డిఫెన్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ పరిశ్రమలు 70 శాతం ఆదిబట్ల, బాలానగర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, చర్లపల్లి తదితర ప్రాంతాల్లో ఉండగా.. మిగతా 30 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
సిమెంటు, కాంక్రీటు ఉత్పత్తుల పరిశ్రమలు, ఫ్లైయాష్‌ ఇటుక ఫ్యాక్టరీలు పూర్తిగా గ్రామీణ జిల్లాల్లో ఉన్నాయి.
గ్రానైట్, స్టోన్‌ క్రషింగ్, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలు ఎక్కువగా పట్టణ ప్రాంతాలు, యూడీఏ(పట్టణాభివృద్ధి సంస్థలు)పరిధిలో ఉండగా… 30 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఫార్మాసూటికల్‌ అండ్‌ కెమికల్‌ పరిశ్రమల కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతినిచ్చింది.
నిర్దేశించిన కేటగిరీలు కానీ 27,441 పరిశ్రమల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సమంగా ఉన్నాయి. వీటి పరిధిలో 3.36 లక్షల మంది ఉద్యోగులున్నారు.

తాళం తీద్దామా!
కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మే ఏడో తేదీ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చే అంశాలను పరిశీలిస్తోంది. లాక్‌డౌన్‌ను కొనసాగించినా, ఆంక్షలు పాక్షికంగా సడలించినా గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను ప్రారంభించుకునేందుకు అనుమతినివ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులు నమోదైన చోట్ల, పట్టణ ప్రాంతాల్లో యథావిధిగా లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కార్యకలాపాలు మొదలుపెట్టేందుకు ఓకే చెప్పనుంది. ఇప్పటికే ఫార్మా, ఆహార, నిత్యావసర సరుకుల తయారీ కంపెనీలు కార్యకలాపాలు నిర్వర్తిస్తుండగా.. తాజాగా స్టోన్‌ క్రషింగ్‌, ఇటుక తయారీ తదితర సంస్థల పునరుద్ధరణకు అంగీకరించింది.

కాగా, కంపెనీల్లో పనిచేసే కార్మికులు మాత్రం విధిగా పరిశ్రమల ఆవరణలోనే వసతి సౌకర్యం కల్పించాలనే షరతు విధించే అవకాశమున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. కార్మికులు రాకపోకలు సాగించడం వల్ల వైరస్‌ సంక్రమించే ప్రమాదమున్నందున.. ఫ్యాక్టరీ ప్రాంగణంలోనే నివాస ఏర్పాట్లు చేయాలని ఆదేశించనున్నట్లు ఆయన చెప్పారు. మే 7 తర్వాత జనసమ్మర్థం ఎక్కువగా ఉండే థియేటర్లు, పార్కులు, హోటళ్లు, ప్రజా రవాణాపై నిషేధం కొనసాగిస్తూ.. భౌతిక దూరం నిబంధన పాటిస్తూ జరిగే కార్యకలాపాలకు అనుమతిచ్చే అవకాశం కనిపిస్తోంది.

Courtesy Sakshi

Leave a Reply