4 కోట్ల వలసకూలీలపై పిడుగు

0
180

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ నివారణకు భారత దేశంలో విధించిన లాక్‌డౌన్‌ దాదాపు 4 కోట్ల అంతర్గత వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. లాక్‌డౌన్‌ కారణంగా 50–60 వేల మంది నగరాల నుంచి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని ‘కోవిడ్‌-19 క్రైసిస్‌ త్రో మైగ్రేషన్‌ లెన్స్‌’ పేరుతో రూపొందించిన తన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ వలసల కంటే అంతర్గత వలసలు రెండున్నర రెట్లు అధికంగా ఉన్నాయని తెలిపింది.

లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగాలు కోల్పోయి, భౌతిక దూరం పాటించలేక పోవడం వల్ల భారత్‌, లాటిన్‌ అమెరికాలోని చాలా మంది అంతర్గత వలసదారులు పెద్ద సంఖ్యలో తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోయారని చెప్పింది. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో దక్షిణ ఆసియాలో ఇంటర్నేషనల్‌, ఇంటర్నల్‌ వలసదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని వరల్డ్‌ బ్యాంక్‌ పేర్కొంది. వాళ్లందర్నీ ఆరోగ్య సేవలు, నగదు బదిలీ లాంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి ఆదుకోవాలని ప్రభుత్వాలను సూచించింది. కొన్ని దేశాల్లో వైరస్‌ ముందే వ్యాప్తి చెందటంతో అప్రమత్తమైన కొంత మంది ట్రావెల్‌ బ్యాన్‌ విధించకముందే సొంత దేశాలకు తిరిగి వచ్చారని, కొంత మందిని ఆయా దేశాలు స్పెషల్‌ రిక్వెస్ట్‌పైన రప్పించారని గుర్తు చేసింది. ఈ ఏడాది వలస వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వరల్డ్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. ఇప్పటికే అక్కడికి వెళ్లిన వారు మాత్రం ఇప్పట్లో తిరిగొచ్చే అవకాశాలు లేవని, ట్రావెల్‌ బ్యాన్‌ వల్ల వాళ్లంతా ఎక్కడి వాళ్లు అక్కడే ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

వలసదారులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని, వారికి ఆదాయాన్ని కోల్పోకుండా కార్మికులకు ఉద్యోగాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. కరోన కారణంగా చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ అమలు చేస్తుండటంతో విదేశాల నుంచి స్వదేశానికి భారతీయులు పంపించే నగదు కూడా తగ్గిపోయిందని వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొంత కాలం కొనసాగితే విదేశాల్లోని వలస కార్మికులు మరిన్ని ఇబ్బందులు తప్పవని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.

Leave a Reply