దశలవారీ ఎత్తివేత

0
187
  • హాట్‌స్పాట్స్‌లో 14 తరువాత కూడా లాక్‌డౌన్‌
  • జనసమ్మర్దం తక్కువగా ఉన్నవి తొలుత ఎత్తివేత
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేబినెట్‌ భేటీలో మోదీ

న్యూఢిల్లీ : దశలవారీగా లాక్‌డౌన్‌ను సడలించేందుకు సిద్ధం కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కోరారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి, దానిని కట్టడికి తీసుకుంటున్న చర్యలను ఆయన మంత్రివర్గంతో చర్చించారు. దేశ చరిత్రలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా ఆయన కేబినెట్‌ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. వైరస్‌ కట్టడికి యుద్ధ ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుందని చెబుతూనే.. 14వ తేదీ వరకూ విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించాలా వద్దా అనేది దేశవ్యాప్తంగా ఒకే తీరున తీసుకోవాల్సిన నిర్ణయం కాదని ఆయన తేల్చిచెప్పారు. ‘కరోనా ప్రబలంగా ఉన్న ప్రాంతాలను- అంటే హాట్‌స్పాట్స్‌ను వదిలేసి మిగిలిన చోట్ల ఒక్కో శాఖ నెమ్మదిగా తమ కార్యకలాపాలు నిర్వర్తించుకునేలా ఓ ప్రణాళికను రూపొందించండి. ఈ ఎత్తివేత ఒకేసారి జరగరాదు. దేశవ్యాప్తంగా పరిస్థితులు వేరు. ఆరోగ్యంతో పాటు ఆర్థికాన్ని కూడా పునుజ్జీవింపచేయాలి’ అని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు.

‘సెక్టార్ల వారీగా,  జిల్లాల వారీగా ఎత్తివేత మంచిదా… అన్నది ప్రణాళికలు సిద్ధం చేయండి. ఆంక్షల సడలింపు- భౌతిక దూరం పాటించడం రెండూ ఒకసారి జరగేట్లు చూడాలి. అదే విధంగా ఆరోగ్య సేతు యాప్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెండి. దాని నుంచి వచ్చే అలర్ట్స్‌ను అంతా గమనించాలి’ అని ప్రఽధాని సూచించారు. స్కూళ్లలో, విద్యాసంస్థల్లో ఒకేచోట ఎక్కువ మంది గుమిగూడే అవకాశం ఉందని, అవి ప్రమాదకరంగా మారరాదని,  విద్యార్ధులు, యువతపై ప్రభావం అస్సలు పడకుండా చూసుకోవాలని, స్కూళ్లు, కాలేజీల పునః ప్రారంభంపై ఓ ప్రణాళిక అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. కాగా, లాక్‌డౌన్‌ను వెంటనే ఎత్తేస్తే కేసుల సంఖ్య అమాంతం పెరిగి వాటిని తట్టుకునే పరిస్థితి ఉండదని అనేక రాష్ట్రాల సీఎంలు ప్రధానికిచెప్పినట్లు తెలుస్తోంది.

పది నిర్ణయాలు, రంగాలు గుర్తించండి
లాక్‌ డౌన్‌ ముగిసిన వెంటనే తమ తమ శాఖల్లో తీసుకోవాల్సిన పది ప్రధాన నిర్ణయాలు, పది ప్రధాన రంగాలను ముందే నిర్ణయించాలని మోదీ  మంత్రులకు  సూచించారు. ఉత్పత్తి, ఎగుమతులు పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికలను సమర్పించాలని, కొత్త రంగాలను, కొత్త దేశాలను భారత ఎగుమతుల జాబితాలో చేర్చాలని ఆయన చెప్పారు. రాష్ట్రాలు, జిల్లా పరిపాలనా యంత్రాంగాలతో సంబంధాలు పెట్టుకోవాలని, ముఖ్యంగా హాట్‌ స్పాట్‌ లు గా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు. పీడీఎస్‌ కేంద్రాల్లో జనం గుమికూడకుండా చూసుకోవాలని, బ్లాక్‌ మార్కెటింగ్‌ను నివారించడం, నిత్యావసరాల ధరలు పెరగకుండా చూసుకోవడం అవసరమని మోదీ చెప్పారు.

Courtesy Andhrajyothi

Leave a Reply