- ప్రేమను కాదన్న యువతిపై కత్తితో దాడి
- అర్థరాత్రి ఇంట్లోకి చొరబడి యువకుడి బీభత్సం
- ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
హైదరాబాద్ సిటీ/రాయదుర్గం : ప్రేమించానన్నాడు. యువతి కాదనడంతో.. కక్ష పెంచుకున్నాడు. ఆమెకు పెళ్లి కుదిరిందని తెలిసి పగతో రగిలిపోయాడు. తనకు దక్కని యువతిని మరెవరికీ దక్కనివ్వకూడదని నిర్ణయించుకున్నాడు. అదనుచూసి అర్ధరాత్రి వేళ యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లో ఓ ప్రేమోన్మాది ఘాతుకం ఇది. ఈ దారుణానికి తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి.. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టి నాగులపల్లికి చెందిన గొడీల రాఖీసింగ్ (21) అనే యువతి మాదాపూర్‌లోని ఓ కళాశాలలో ఆర్కిటెక్చర్ నాలుగో సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఓ బంధువుల పెళ్లికి వెళ్లిన ఆమెను.. జీడిమెట్లకు చెందిన ప్రేమ్‌సింగ్ చూశాడు. అతడు కేపీహెచ్‌బీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. చూడగానే రాఖీసింగ్‌ను ప్రేమించాడు. ఆమె వివరాలు సేకరించాడు. దూరపు బంధువని తెలుసుకున్నాడు. ఎలాగోలా.. రాఖీసింగ్ ఫోన్ నెంబరు తెలుసుకున్నాడు. ఫోన్‌లోనే పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానంటూ ఆ యువతి వెంటపడడం మొదలు పెట్టాడు. తనకు ఇష్టం లేదని ఆ యువతి తెగేసి చెప్పింది. అయినా వినకుండా వెంటపడేవాడు. ఆ యువతి పట్టించుకోలేదు. చదువు మాన్పిస్తారేమోనని భయపడి.. విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో.. రాఖీసింగ్‌కు పెళ్లి కుదిరి.. నిశ్చితార్థం కూడా జరిగింది.
విషయం తెలుసుకున్న యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. ఆ యువతి తనకు దక్కదని తెలుసుకుని.. హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం అర్థరాత్రి యువతి ఇంట్లోకి చొరబడ్డాడు. యువతి గదిలోకి వెళ్లి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో.. యువతి మెడ, మణికట్టు, తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే ఇంట్లో నుంచి బయటపడేందుకు యత్నిస్తున్న ప్రేమ్‌సింగ్‌ను.. రాఖీసింగ్ కుటుంబసభ్యులు గమనించారు. దొంగగా భావించి పట్టుకుని కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత కొంతసేపటికి రక్తపుమడుగులో పడివున్న రాఖీసింగ్‌ను గుర్తించడంతో.. విషయం అర్ధమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించి.. రాఖీసింగ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్‌సింగ్‌కు కూడా తీవ్రగాయాలు కావడంతో.. అతడినీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Courtesy Andhrajyothi