టెస్టులతో మాయ!

0
79
  • విచారణకు ముందు ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు
  • విచారణకు పావుగంట ముందు నివేదిక ఇస్తున్నారు
  • 5 వాయిదాలుగా ఇదే పద్ధతి.. ఇలా అయితే ఎలా?
  • అడిగినా విపత్తు నిర్వహణ ప్రణాళిక ఇవ్వట్లేదు
  • కరోనాపై ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదనిపిస్తోంది
  • పొరుగు రాష్ట్రాల కన్నా రాష్ట్రంలో తక్కువ పరీక్షలు
  • సర్కారు తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి
  • సెకండ్‌ వేవ్‌ ముప్పు ఉందని హెచ్చరిక
  • రోజూ లక్ష టెస్టులు చేయాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువగా చేయడంపై.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కొవిడ్‌-19పై దాఖలైన 25 ప్రజాహిత వ్యాజ్యాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడి ర్మాసనం గురువారం విచారించింది. ఈ వ్యాజ్యాలు విచారణకు వస్తున్నప్పుడు పెరుగుతున్న కరోనా పరీక్షలు.. వాయిదా పడిన వెంటనే ఆశ్చర్యకరంగా తగ్గిపోతున్నాయని వ్యాఖ్యానించింది. పోరుగు రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో టెస్టులు తక్కువగా చేస్తున్నారని, కరోనాపై దాఖలైన వ్యాజ్యాలు విచారణకు రావడానికి రెండు, మూడు రోజులు టెస్టులు ఎక్కువగా చేసి మాయచేస్తున్నారని ఆక్షేపించింది. అంతేకాదు కొవిడ్‌-19పై కేసుల్లో నివేదికను విచారణ సమయానికి 15 నిమిషాలు ముందు ఇస్తున్నారని.. ఐదు వాయిదాలుగా ఇదే పద్ధతిలో నివేదికలు ఇస్తున్నారని, ఆ సమయంలో నివేదికలో ఏముందో ఎలా తెలుసుకోగలమని ప్రశ్నించింది.

రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక ఇవ్వాలని ఎన్నిసార్లు అడిగినా.. ఇస్తామని చెబుతున్నారే తప్ప కోర్టుకు ఇవ్వట్లేదని, దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రణాళికా లేదని అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో ప్రతికూల ఉత్తర్వులు జారీచేస్తామని హెచ్చరించింది. కొవిడ్‌పై ప్రభుత్వం ఇస్తున్న నివేదికల్లో స్పష్టత ఉండట్లేదని వ్యాఖ్యానించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కాకుండా.. కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న 334 ఆసుపత్రులపై 1493 ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో  1261 ఫిర్యాదులను పరిష్కరించినట్లు చెప్పారే తప్ప ఎలా పరిష్కరించారో చెప్పలేదని ఆక్షేపించింది. మిగిలిన ఫిర్యాదులు ఏ స్థితిలో ఉన్నాయో, వాటిపై ఏ చర్యలు తీసుకోనున్నారో నివేదికలో చూపలేదంది. తదుపరి విచారణకు ఇచ్చే నివేదిక వాస్తవికంగా ఉండాలని ఆదేశించిన ధర్మాసనం.. దాన్ని విచారణకు కనీసం ఒక రోజు ముందే ఇవ్వాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో ఈ నెల 24లోగా కౌంటర్‌ దాఖలుకు ఆదేశిస్తూ విచారణను 26కి వాయిదా వేసింది.

ఆ రాష్ట్రాల్లో అలా..
మహారాష్ట్ర, కేరళలో రోజుకు లక్ష మందికి కరోనా పరీక్షలు చేస్తుంటే.. తెలంగాణాలో 40వేలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇప్పటికే కేరళ రాష్ట్రాన్ని తాకిందని.. అది ఇతర రాష్ట్రాలతోపాటు హైదరాబాద్‌కూ పాకే అవకాశం ఉందని ఆందోళన వెలిబుచ్చింది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ఢిల్లీలో లాక్‌డౌన్‌ విధించాలని అక్కడ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని గుర్తుచేసింది.

తెలంగాణ ప్రభుత్వం కరోనా పరీక్షలు అధికంగా చేయాల్సి ఉండగా ఆ పని చేయట్లేదని ఆక్షేపించింది. దీన్ని బట్టి చూస్తే.. యుద్ధరంగం నుంచి ప్రభుత్వం వెనుదిరిగినట్లుందని వ్యాఖ్యానించింది. ప్రజలు కరోనా బారిన పడకుండా ఆరోగ్యశాఖ అధికారులు, హెల్త్‌ వర్కర్స్‌ విరామం లేకుండా పనిచేస్తున్నారని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జి. శ్రీనివాస్‌ చెబుతున్న అంశాలను ధర్మాసనం ఎండగట్టింది.

‘‘హోటళ్లు, రెస్టారెంట్లు, తిను బండారాలు విక్రయించే చోట్ల ప్రజలు గుమిగూడుతున్నారు, మాస్కులు ధరించట్లేదు. సామాజిక దూరం పాటించట్లేదు. కరోనా నిబంధనలు పాటించని రెస్టారెంట్లు/హోటళ్లపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?’’ అని నిలదీసింది. దీనికి డాక్టర్‌ శ్రీనివాస్‌ వివరణ ఇస్తూ.. లాక్‌డౌన్‌-4 నిబంధనలు సడలించిన తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు తెరచుకున్నాయన్నారు. ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేసి నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

తెలంగాణలో 300 మొబైల్‌ టెస్టింగ్‌ వ్యాన్లు ఉన్నాయని వాటి ద్వారా అధిక జనాభాఉండే చోట్ల అక్కడికక్కడే పరీక్షలు చేసి పాజిటివ్‌ వచ్చిన వారిని గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నవారికి, ఫ్లూ లక్షణాలున్న వారికి, వృద్ధులకు కరోనా పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఈ దశలో కల్పించుకున్న ధర్మాసనం.. కరోనా కేసులు, మరణాల విషయంలో భారత్‌ వాస్తవాలు చెప్పట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించిన విషయాన్ని గుర్తుచేసింది. క

రోనా నివారణకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు డాక్టర్‌ శ్రీనివాస్‌ తమ ఘనతను చాటుకుంటున్నారని వ్యాఖ్యానించింది. గడిచిన నాలుగు నెలల్లో రోజూ చేసిన కరోనా పరీక్షలకు సంబంధించి కచ్చితమైన గణాంకాలతో గ్రాఫ్‌ను రూపొందించి కోర్టుకు ఇవ్వాలని సూచించింది. ప్రజలకు వాస్తవాలు చెప్పి అప్రమత్తం చేయాలని పేర్కొంది.

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఢిల్లీ, మహారాష్ట్ర కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే సెకండ్‌ వేవ్‌ మొదలైందని, అది ఇతర రాష్ర్టాలకు పాకే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆ ముప్పును ఎదుర్కోవడానికి పటిష్ఠమైన చర్యలతో సంసిద్ధంగా లేకపోతే యూరప్‌ దేశాల్లో మాదిరిగా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వైద్య నిపుణుల చెబుతున్న దాని ప్రకారం చలికాలంలో కరోనా వైరస్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని.. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ పలు ఆదేశాలు జారీ చేసింది.

ఇవీ కోర్టు ఆదేశాలు
ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40 వేలుగా ఉన్న కరోనా పరీక్షల సంఖ్యను 50వేలకు పెంచాలి. క్రమంగా వాటిని లక్షకు తీసుకెళ్లాలి.

షాపింగ్‌ మాల్స్‌ తెరవడానికి, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేసుకోవడానికి అనుమతించిన నేపథ్యంలో ఆయా చోట్ల ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం ఉంది కాబట్టి అవసరమైన పోలీసులను నియమించి సామాజిక దూరం పాటించేలా చూడాలి. మాస్కులు ధరించేలా చూడాలి.

ర్యాపిడ్‌ యాంటీ జెన్‌, ఆర్టీపీసీఆర్‌తోపాటు మెరుగైన ఫలితాలు ఇచ్చే కొత్త టెస్టులను ఐసీఎంఆర్‌ ఆమోదించింది. ఆ పరీక్షలు రాష్ట్రంలో చేయాలి.

జిల్లాల్లో ఆర్టీపీసీఆర్‌ కిట్లు అందుబాటులో ఉంచాలి.

అధిక ఫీజులు వసూలు చేసిన ఆస్పత్రులపై తీసుకున్న చర్యలేమిటో ప్రభుత్వం చెప్పాలి.

కొత్తగా 1,058 కొవిడ్‌ కేసులు
రాష్ట్రంలో బుధవారం 1,058 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 2,60,834కి చేరింది. తాజాగా 1,440 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఆ సంఖ్య 2,46,733 పెరిగి.. రికవరీ రేటు 94.59 శాతంగా నమోదైంది. బుధవారం కరోనాతో నలుగురు చనిపోయారు. ఇప్పటివరకు 1,419 మంది మరణించారు. ప్రస్తుతం 12,682 యాక్టివ్‌ కేసులున్నాయి. అందులో 10,352 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 38,757 నమూనాలను సేకరించారు. ఇప్పటివరకు 50,11,164 నమానాలను పరీక్షించినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ప్రతి పదిలక్షల జనాభాలో 1,34,636 మందికి పరీక్షలు నిర్వహించామని వివరించింది. కాగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 168 పాజిటివ్‌ కేసులు నిర్ధారణయ్యాయి. తర్వాతి స్థానాల్లో మేడ్చల్‌(93), రంగారెడ్డి(91), భద్రాద్రి(58), కరీంనగర్‌(53) ఉన్నాయి. అత్యల్పంగా గద్వాలలో-2, ఆదిలాబాద్‌లో-4, ఆసిఫాబాద్‌లో-5 కేసులు నమోదయ్యాయి.

Courtesy Andhrajyothi

Leave a Reply