వికారాబాద్‌ అడవిలో… భయ‘కంపన’

0
279
వికారాబాద్‌ అడవిలో... భయ‘కంపన’

వెరీ లో-ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం నిర్మాణానికి కేంద్ర, రాష్ట్రాల పచ్చజెండా
నౌకాదళానికి 2900ఎకరాలు!
ప్రజారోగ్యానికి చేటు
పర్యావరణానికి హాని
శాస్త్రవేత్తల ఆందోళన
గ్రామాల్లో వ్యతిరేకత

చుట్టూ ముళ్ల కంచె.. అత్యాధునిక ఆయుధాలతో పహరా కాసే సైనికులు.. అక్కడో అత్యంత అధునాతనమైన నౌకా సమాచార కేంద్రం.. ప్రపంచంలో ఎక్కడ మన నౌకలు, జలాంతర్గాములు ఉన్నా పసిగట్టి వాటికి సందేశాలు పంపే వ్యవస్థ.. ఇదేదో హాలీవుడ్‌ సినిమాలోదృశ్యం కాదు! రాజధాని హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం (వికారాబాద్‌) అభయారణ్యంలో త్వరలో ఏర్పాటు కానున్న వ్యవస్థ. అక్కడ త్వరలోనే మన నౌకా దళం వెరీ లో-ఫ్రీక్వెన్సీ (వీఎల్‌ఎఫ్‌) ట్రాన్స్‌మిషన్‌ కేంద్రాన్ని నిర్మించడానికి సిద్ధమైంది. కానీ ఆ కేంద్రం వల్ల ఇటు పర్యావరణానికీ.. అటు ప్రజల ఆరోగ్యానికీ తీవ్రమైన హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు 2004లోనే ఈ తరహా టెక్నాలజీని వాడటం మానేశాయనీ.. దాన్ని మనమెందుకు వాడాలని ప్రశ్నిస్తున్నారు.

అంతా రహస్యమే..
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్యంగా ఉంచాయి. పూడూరులో ప్రాజెక్టు కోసం రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమిని కేటాయించిన విషయం కానీ, దానికి 2014లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతి ఇచ్చిన విషయం కానీ బహిరంగంగా ఎక్కడా ప్రకటించలేదు.

పూడూరు.. వికారాబాద్‌.. హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు. అనేక రకాల వృక్ష జాతులకు, వన్యప్రాణులకు నెలవు. ఈ ప్రాంతంలో దామగుండం వద్ద 2900 ఎకరాల్లో నౌకాదళం నిర్మించనున్న వెరీ లో-ఫ్రీక్వెన్సీ ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం వల్ల.. వందల ఏళ్ల నాటి వృక్షాలు నేలకూలనున్నాయి. జింకలు, దుప్పులు, అడవి గొర్రెలు, తాచుపాములు వంటివి ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలిపోవాల్సిన పరిస్థితి. 2008లో ప్రారంభమయిన ఈ ప్రాజెక్టుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చాయి.

అక్కడే ఎందుకు?
మన దేశంలో తొలి వీఎల్‌ఎఫ్‌ రాడార్‌ కేంద్రాన్ని తిరునల్వేలి (తమిళనాడు) సమీపంలోని ఐఎన్‌ఎస్‌ కట్టబొమ్మన్‌ వద్ద ఐదేళ్ల క్రితం ప్రారంభించారు. సముద్ర జలాల్లో పైకి కనిపించే నౌకలకు, నీటి అడుగు నుంచి శత్రువులను దెబ్బతీసే జలాంతర్గాములకు, ఇతర నౌకాదళ వాహనాలకు సంకేతాలు పంపడం ఈ కేంద్ర ఉద్దేశం. కానీ అది హిందూ మహాసముద్రాన్ని, బంగాళాఖాతాన్ని, అరేబియా సముద్రాన్ని పూర్తిగా కవర్‌ చేయలేదు. దీంతో నౌకాదళం భౌగోళిక సర్వే జరిపి వికారాబాద్‌ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఎందుకంటే.. దామగుండం రిజర్వు ఫారెస్టు సముద్రమట్టానికి 360 మీటర్ల ఎత్తులో ఉంటుంది. భౌగోళికంగా హిందూ మహాసముద్రానికి, అరేబియా మహాసముద్రానికి సమానదూరంలో ఉండడం కూడా ఒక కారణమంటున్నారు. ఇలాంటి కేంద్రాలు సముద్ర తీరానికి సమీపంలో ఉంటే శత్రువులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే ప్రమాదం ఉంటుంది.

అదే.. సముద్రతీరానికి దూరంగా ఉండే ఇలాంటి ప్రాంతాల్లో ఆ ముప్పు ఉండదు. అందుకే నౌకాదళం ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసిందని సమాచారం. వీఎల్‌ఎఫ్‌ ట్రాన్స్‌మిషన్‌ కేంద్రం ఏర్పాటుకోసం తొలుత రాష్ట్ర ప్రభుత్వాన్ని 1000 ఎకరాలు కావాలని కోరింది. భద్రతా కారణాలరీత్యా ఆ తర్వాత మరో 1900 ఎకరాలను అదనంగా కోరింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. పరిహారం, పునరావాస చర్యలకు సొమ్మును కూడా నౌకాదళం అందజేసింది. కేంద్ర పర్యావరణ శాఖ నుంచి కూడా నౌకాదళం అనుమతులు తీసుకుంది. నౌకాదళ ప్రస్తుత ప్రతిపాదనల ప్రకారం ఈ 2900 ఎకరాల చుట్టూ (ఏడు కిలోమీటర్లు ఉంటుంది) కంచె వేస్తారు. మధ్యలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య వీఎల్‌ఎఫ్‌ ట్రాన్స్‌మిషన్‌ కేంద్రాన్ని నిర్మిస్తారు.

పాతకాలం పరిజ్ఞానమే!
ప్రస్తుతం ప్రపంచంలో వీఎల్‌ఎఫ్‌ టెక్నాలజీని భారత్‌, రష్యాలు మాత్రమే వాడుతున్నాయి. మిగిలిన దేశాలన్నీ దీని కన్నా ఆధునికమైన లేజర్‌ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. సాధారణంగా జలాంతర్గాములు సముద్రంలో 30 నుంచి 100 మీటర్ల లోతులో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇంత లోతులో ప్రయాణించే జలాంతర్గాములకు సంకేతాలు పంపటం చాలా కష్టమైన పని. ఈ సంకేతాలను అందుకోవటానికి అవి అప్పుడప్పుడూ సముద్రజలాలపైకి వస్తూ ఉండాలి. అత్యంత ఆధునికమైన అణు జలాంతర్గాములు కొన్ని నెలల పాటు సముద్రజలాలపైకి రాకుండా రహస్యంగా ప్రయాణిస్తూ ఉంటాయి. అలాంటి జలాంతర్గాములకు సంకేతాలను పంపటానికి వీఎల్‌ఎఫ్‌ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. దీనిలో 3 నుంచి 30 హెర్ట్జ్‌ల దాకా పౌనఃపున్యంలో సంకేతాలను పంపుతూ ఉంటారు.

అప్పుడవి సముద్ర జలాలలోకి చొచ్చుకుపోయి సంకేతాలు అందిస్తాయి. అయితే వీటి ద్వారా వీడియోలు, ఎక్కువ నాణ్యత ఉన్న ఫొటోలను పంపటానికి వీలుండదు. ఈ నేపథ్యంలో అమెరికా సహా అనేక దేశాలు- జలాంతర్గాములకు ఉపగ్రహాలను, లేజర్లను ఉపయోగించి సంకేతాలు పంపుతున్నాయి. లో-ఫ్రీక్వెన్సీ సంకేతాల వల్ల మనుషులకు కేన్సర్‌ వంటి ప్రమాదకరమైన వ్యాధులు, డిప్రెషన్‌, అల్జీమర్స్‌ వంటి సమస్యలు వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

మానవులకు హానిచేసే తరంగాలపై పరిశోధనలు చేస్తున్న డాక్టర్‌ అభినవ్‌ గుప్తా అనే శాస్త్రవేత్త దీని గురించి వివరిస్తూ, ‘‘లో ఫ్రీక్వెన్సీ తరంగాలు జంతువులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అతి తక్కువ పౌనఃపున్యంతో ప్రసారమయ్యే సంకేతాలను మనం పసిగట్టలేం. కానీ జంతువులు పసిగడతాయి. వీఎల్‌ఎఫ్‌ సంకేతాలతో వన్యప్రాణులకు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో, వీటి ప్రభావం మనుషులపై ఎలా ఉంటుందో తెలియదు. అమెరికాలో ఈ టవర్లను తొలగించాలంటూ పెద్ద ఉద్యమాలు జరిగాయి’’ అని అన్నారు.

పర్యావరణానికి హాని..
దీని నిర్మాణం కోసం కొన్ని వేల చెట్లను కూల్చి ఆ ప్రాంతాన్ని చదును చేయాల్సి ఉంటుంది. ‘‘ఈ చెల్లపై ఆధారపడి కొన్ని వేల జంతువులు బతుకుతున్నాయి. చెట్లను కూల్చివేస్తే వాటికి ప్రమాదం ఏర్పడుతుంది. వికారాబాద్‌ అడవుల వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో వానలు పడతాయి. ఈ అడవులు లేకపోతే దాని ప్రభావం మొత్తం ప్రకృతిపైన పడుతుంది. స్థానికులకు ఉద్యోగాల ఆశ చూపించి ప్రాజెక్టును ప్రారంభించటం సరికాదు..’’ అని ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకరంగా ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్న రామ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేంజ్‌ డాట్‌కామ్‌లో ప్రధానికి ఒక విజ్ఞాపన పంపారు. దీనికి ఇప్పటికే మంచి మద్దతులభించింది.
అంతా రహస్యం..
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహస్యంగా ఉంచాయి. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వరంలోని ఈ-గ్రీన్‌వాచ్‌ వెబ్‌సైట్‌లో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు లేవు. పూడురులో ప్రాజెక్టు కోసం రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూమిని కేటాయించిన విషయం కానీ, దానికి 2014లో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అనుమతి ఇచ్చిన విషయం కానీ బహరంగంగా ఎక్కడా ప్రకటించలేదు. ఆ తర్వాత కూడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఎక్కువగా అందుబాటులో లేవు. స్థానిక ప్రజలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కొద్దికాలం ఆందోళన చేసినా దానికి ప్రచారం లభించలేదు.

(Courtesy Andhrajyothi)

Leave a Reply