పురిట్లోనే బరువు లేమి

0
259

గర్భిణులకు పౌష్టికాహారం అందక.. శిశువులపై ప్రభావం

అమరావతి : రాష్ట్రంలో బరువు తక్కువ శిశు జననాలు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 2,63,582 మంది జన్మిస్తే వీరిలో 6.93% (18,274) మంది సగటు బరువు 2.5 కిలోల కంటే తక్కువగా ఉన్నారు. వీరిలోనూ 1,500-1,700 గ్రాముల మధ్య బరువున్న శిశువులే అధికం. శిశు జననాలు, మరణాలపై వైద్యారోగ్య శాఖ తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో గర్భస్థ శిశువులు, పసికందుల మరణాలు కూడా ప్రభావశీల సంఖ్యలో ఉన్నట్లు తేలింది. చిన్న వయసులో లేదా ఆలస్యంగా వివాహాలై యుక్త వయసులో లేనప్పుడు గర్భం దాల్చడం పౌష్టికాహార లోపం, ఇతర అనారోగ్య సమస్యలు, సకాలంలో వైద్యం అందకపోవడం వంటి కారణాలతో పుట్టే పిల్లల బరువు.. సగటు ప్రమాణాల కంటే తక్కువగా ఉంటోంది. వీరు సాధారణ పిల్లల్లా ఎదగడానికి ప్రత్యేక చికిత్స అవసరమవుతోంది. సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన వెంటనే వారి వ్యక్తిగత, ఆరోగ్య వివరాలు ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతాయి. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, పీహెచ్‌సీ వైద్యుల ద్వారా వీరికి సరైన ఆరోగ్య సూచనలు అందకపోవడం, పోషకాహారలోపం, కుటుంబ సభ్యుల్లో అవగాహనలేమి సమస్యకు మూలాలుగా గుర్తించారు. మొత్తం జననాల్లో కర్నూలులో అత్యధికంగా 10.13%, చిత్తూరులో 9.38%, తూర్పు గోదావరిలో 9.01%, కృష్ణాలో 8.18%, అనంతపురంలో 8%, విశాఖలో 6.73%, నెల్లూరులో 6.57%, కడపలో 6.14%, పశ్చిమ గోదావరిలో 6.11%, ప్రకాశంలో 5.16%, విజయనగరంలో 4.42%, శ్రీకాకుళంలో 4.09%, గుంటూరు జిల్లాలో 2.29% మంది శిశువులు తక్కువ బరువుతో జన్మించారు.

శై‘శవ’గీతిక
* ఈ ఏడాది తొలి 8 నెలల్లో గర్భస్థ శిశు మరణాలు 2,136 నమోదు కాగా, 1,993 మంది పసిబిడ్డలు పుట్టిన 20 రోజుల్లోపే మరణించారు. గర్భస్థ శిశు మరణాల్లో.. అనంతపురం-293, కర్నూలులో 291, చిత్తూరు-276, విశాఖపట్నం-242, తూర్పు గోదావరి-227, కృష్ణా-192, గుంటూరు 161, ప్రకాశం-115, విజయనగరం-89, శ్రీకాకుళం-71, నెల్లూరు-68, కడప-64, పశ్చిమగోదావరి జిల్లాలో 47 చొప్పున నమోదయ్యాయి.
* పుట్టిన ఏడాదిలోగా మరణాల్లో కర్నూలు-313, విశాఖపట్నం-257, చిత్తూరు-252, అనంతపురం-249, గుంటూరు-234, తూర్పుగోదావరి-223, కృష్ణా-216, విజయనగరం-152, కడప-184, ప్రకాశం-114, పశ్చిమగోదావరి-107, శ్రీకాకుళం-105, నెల్లూరు జిల్లాలో 80 మంది చొప్పున నమోదయ్యాయి.
* పుట్టిన 20 రోజుల్లోగా కన్నుమూసిన శిశువుల లెక్కల పరంగా కర్నూలు-256, చిత్తూరు-225, గుంటూరు-214, విశాఖపట్నం-180, కడప-158, తూర్పుగోదావరి-155, అనంతపురం-150, విజయనగరం-125, ప్రకాశం-100, పశ్చిమగోదావరి-94, శ్రీకాకుళం-74, నెల్లూరు జిల్లాలో 64 వరుస క్రమంలో ఉన్నాయి.

Courtesy Eenadu

Leave a Reply