మూకదాడులపై పోలీసుల ఉదాసీనత?

0
216

– గోహంతకులపై దాడులు సహజమే 
– హిందీ రాష్ట్రాల్లో ఈ తీరు మరింత అధికం : రిపోర్టు 

శాంతి భద్రతలను కాపాడే పోలీసులు.. దాడులు, నేరాలు, అల్లర్లు, ఇతర ఘటనల్లో తటస్థంగా ఉండి, కేసు పరిష్కారం కోసం న్యాయవ్యవస్థకు సహకరించాలి. నేరాలు, ముఖ్యంగా మతపరమైన దాడులకు సంబంధించి పోలీసులూ ఏదో ఓ వర్గానికి అనుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం, ఘటనపట్ల ఉదాసీనంగా, లేదా మితిమీరిన చర్యలకు పూనుకోవడం ప్రమాదమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో మూక దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో సెంటర్‌ ఫర్‌ స్టడీస్‌ ఇన్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌, కామన్‌ కాజ్‌ దేశవ్యాప్తంగా 11వేల మంది పోలీసులను సర్వే చేసి రూపొందించిన నివేదిక ఆందోళనకర విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. గోవధకు పాల్పడిన వ్యక్తిని ఓ మూక శిక్షించడం సహజమేనని దాదాపు 33శాతం మంది పోలీసులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ముస్లింలే అధికంగా నేర ప్రవృత్తి కలిగి ఉంటారని ప్రతి ముగ్గురిలో ఇద్దరు పోలీసులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌లాంటి హిందీ రాష్ట్రాల్లో ఇలాంటి దృక్పథం కలిగిన పోలీసులు అధికంగా ఉన్నారని నివేదిక తేల్చింది.

‘మెజారిటీల వైపే ఖాకీల మొగ్గు’ 
ముస్లింలే అధికంగా నేరాలకు పాల్పడుతుంటారని దాదాపు 14శాతం మంది పోలీసులు అభిప్రాయపడ్డారు. హిందూ మతంలోని పెత్తందారులు అధికంగా నేరాలకు పూనుకుంటాయని ఆరు శాతం మంది భావిస్తున్నట్టు తెలిపింది. హిందీ రాష్ట్రాల్లోని పోలీసుల్లో ఈ పెడధోరణులు అధికంగా ఉన్నట్టు తేల్చింది. జార్ఖండ్‌ పోలీసుల్లో అత్యధికంగా(66శాతం) ఇలాంటి దృక్పథాలను కలిగిఉండగా.. మధ్యప్రదేశ్‌ (63శాతం), కర్నాటక(57శాతం), ఆంధ్రప్రదేశ్‌ (52శాతం), అల్పంగా పశ్చిమ బెంగాల్‌(మూడు శాతం) పోలీసుల్లో ఉన్నట్టు తెలిపింది. కర్నాటక, మహారాష్ట్రల్లో సమానంగా ఈ తప్పుడు ధోరణులున్నట్టు నివేదిక వివరించింది. అలాగే, చిన్న చిన్న నేరాలకు సుదీర్ఘ న్యాయపోరాటం చేయటం కంటే వాటిని పరిష్కరించేందుకు పోలీసులకు హక్కు కల్పిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నట్టు వెల్లడించింది. అలాగే, ఆర్థిక లేదా రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తులపై దర్యాప్తు చేస్తున్నప్పుడు రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు 72శాతం మంది పోలీసులు అంగీకరించడం గమనార్హం. కాగా, నేరాల దర్యాప్తులో రాజకీయ నాయకుల జోక్యమే ప్రధాన అడ్డంకిగా ఉంటుందని 28శాతం మంది తెలిపారు. మత అల్లర్లల్లో మెజారిటీ ప్రజలవైపునకే పోలీసులు మొగ్గుచూపుతారని శ్రీకృష్ణ కమిషన్‌ గుర్తించిన విషయాన్ని ఈ రిపోర్టు మరింత బలపరుస్తున్నదని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఆ రాష్ట్రాల్లోనే మూకదాడులు అధికం 
మూకదాడుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించే అవకాశమున్నట్టు ఈ రిపోర్టు అంతర్గతంగా పేర్కొంటున్నది. అందుకనుగుణంగానే మూకదాడులకుపట్ల పోలీసుల్లో ఉదాసీన వైఖరి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మూకదాడులు అధికంగా చోటుచేసుకుంటుండటం గమనార్హం. పోలీసుల్లో ఈ పెడ ధోరణి అధికంగా ఉన్న జార్ఖండ్‌లోనే గోవుల అక్రమ రవాణా, చేతబడి, పిల్లల అపహరంపేరిట మూకదాడులు ఎక్కువ జరుగుతున్న విషయం తెలిసిందే. మూకదాడి కేసులో పెహ్లూఖాన్‌ మృతి చెందినా.. అతని కొడుకులు ఇర్షాద్‌, ఆరీఫ్‌ ఖాన్‌లపై రాజస్థాన్‌ పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడం గమనార్హం. పోలీసులకు కేవలం ఐపీసీ, సీసీపీలో శిక్షణ సరిపోదని జస్టిస్‌ జె చలమేశ్వర్‌ ఈ నివేదికను విడుదల చేస్తూ చెప్పారు. సిబ్బందికి తరుచూ శిక్షణనిస్తూ ఈ ధోరణులను తగ్గించవచ్చునని నివేదిక సూచించింది.

అనుమానంతో మూకదాడి.. బాధితుడి మృతి, యూపీలో రెచ్చిపోతున్న మూకల 
లక్నో: బీజేపీ పాలనలో దేశవ్యాప్తంగా రోజురోజుకూ మూకదాడులు తీవ్రమవుతున్నాయి. తాజాగా పిల్లలను అపహరిస్తున్నడనే అనుమానంతో స్థానికులు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లాలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అసలాత్‌పూర్‌ గ్రామంలో పిల్లలను అపహరిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని స్థానిక మూక తీవ్రంగా కొట్టింది. వారి దెబ్బలు తాళలేక బాధితుడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని.. ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యలోనే మరణించినట్టు వైద్యులు తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనలో పదిమందిని నిందితులుగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

పెరుగుతున్న మూకదాడులు 
బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీలో మూకదాడులు పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ దాదాపు 50 పలు మూకదాడుల జరిగాయని, కానీ ఈ ఘటనలోనే బాధితుడు మరణించాడని పోలీసులు తెలిపారు. సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న అసత్యప్రచారాల పట్ల ప్రజలు భయాందోళనలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఓపి సింగ్‌ తెలిపారు.
ఈ నెలలో పిల్లలను ఎత్తుకెళ్తున్నరనే అనుమానంతో దేశవ్యాప్తంగా 46 మూకదాడులు కేసులు నమోదైతే.. అందులో 19 కేసులు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోనే నమోదయ్యాయి. తరువాత ఆగ్రా, కాన్పూర్‌, బరేలీలో అధికంగా నమోదైనట్టు తెలుస్తుంది. ఈ దాడుల నివారణకు ప్రభుత్వాలను ప్రత్యేక చట్టాలను రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజస్థాన్‌ మాత్రమే చట్టాన్ని రూపొందించింది. ఈ చట్టం ప్రకారం.. దాడికి పాల్పడిన వారికి జీవిత ఖైదు విధించే అవకాశముంది. అలాగే సోషల్‌ మీడియా వేదికగా అసత్యప్రచారాలను వ్యాప్తి చేసినా శిక్షార్హులే.

(Courtacy Nava Telangana)

Leave a Reply