ఈసీ మీద హత్యకేసు పెట్టాలి

0
35
  • మీ వల్లే ఇంతలా కొవిడ్‌ వ్యాప్తి
  • మీదో బాధ్యతారహిత సంస్థ
  • పార్టీల సభలకు అనుమతివ్వడం వల్లే వైరస్‌ వ్యాప్తి పెరిగింది
  • దీనికి పూర్తి బాధ్యత మీదే
  • మద్రాస్‌ హైకోర్టు ఆగ్రహం

చెన్నై  : నిన్న కలకత్తా హైకోర్టు..ఇప్పుడు మద్రాస్‌ హైకోర్టు! ఎన్నికల సంఘంపై నిప్పులు కక్కాయి. కొవిడ్‌ విజృంభిస్తున్న వేళ జరుగుతున్న ఎన్నికలకోసం ఈసీ తీసుకొంటున్న చర్యలతీరుని మద్రాస్‌ హైకోర్టు తూర్పారబట్టింది. ‘మీ మీద మర్డర్‌ కేసు పెడితే సరిపోతుంది’ అంటూ ఎన్నికల అధికారులను ఉద్దేశించి అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇక్కడా, దేశంలోనూ కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ ప్రబలడానికి మీరే కారణం’’ అంటూ తీవ్ర స్వరం వినిపించింది. అత్యంత బాధ్యతారహిత సంస్థ అంటూ ఈసీకి చీవాట్లు పెట్టింది. ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సోమవారం విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజీవ్‌ బెనర్జీ, జస్టిస్‌ సేంథిల్‌కుమార్‌ రామమూర్తిలతో కూడిన ప్రథమ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులో ఈ నెల ఆరోతేదీన అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు మే రెండోతేదీన ప్రకటించనున్నారు. అయితే, ఈ ఫలితాల విడుదలలో పారదర్శకత, కొవిడ్‌ జాగ్రత్తతు పాటించేలా అధికారులను ఆదేశించాలంటూ రవాణాశాఖ మంత్రి ఎమ్‌ఆర్‌ విజయభాస్కర్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు.

విజయభాస్కర్‌ కరూర్‌ స్థానం నుంచి అసెంబ్లీకి నిలబడ్డారు. ఈ స్థానంలో మరో 77 మంది అభ్యర్థులు ఉన్నారు. అయినా కౌంటింగ్‌ కేంద్రాన్ని రెండు గదుల్లోనే ఏర్పాటు చేశారని, ఏజెంట్లందరినీ కౌంటింగ్‌ హాలులోకి అనుమమతిస్తే భౌతికదూరం పాటించడం కష్టమవుతుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో అన్ని చర్యలను కౌంటింగ్‌ రోజున తీసుకొంటున్నామని, కొవిడ్‌ నిబంధనలను పటిష్టంగా అమలుచేస్తామని ఈసీ తరఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘మీ వల్లే సెకండ్‌ వేవ్‌ రాష్ట్రంలోకి చొచ్చుకొచ్చింది. సభలు, ప్రదర్శనలు జరుపుకొనేందుకు రాజకీయ పార్టీలకు మీరిచ్చిన అనుమతులే పరిస్థితిని తెచ్చిపెట్టాయి. ఎందరో చనిపోతున్నారు. అందుకు బాధ్యులను చేస్తూ మీ మీద హత్యానేరం మోపితే సరిపోతుంది. కౌంటింగ్‌ని నిలిపివేస్తూ మేం నిర్ణయం తీసుకోదలిస్తే మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు’’ అని స్పష్టం చేసింది.

Courtesy Andhrajyothi

Leave a Reply