వీరి ధిక్కారం, వారి తిరస్కారం

0
81
కె. శ్రీనివాస్

హైదరాబాద్ పోరాటంలో ఎవరు గెలిచినట్టు? స్పష్టంగా, ఏ శషభిషలు లేకుండా తీవ్ర విమర్శలు గుప్పించిన కేసియారా, తన విస్మరణతో బేఖాతరు సమాధానం ఇచ్చిన నరేంద్ర మోడీయా? అసలు మొత్తం సన్నివేశాన్ని మోడి, కేసీయార్ ద్వంద్వ యుద్ధంగా పరిగణించడం సరి అయినదేనా? ఇట్లా ఆలోచించడం మూలంగా, అసంకల్పితంగానే, అందరూ, మోడీతో కేసీయార్‌ను సమఉజ్జీగా, తెలంగాణను కూడా మించిన పరిధిలో, గుర్తించడం లేదా?

ఒప్పుకుని తీరవలసిన విషయం ఏమిటంటే, బీజేపీ చాలా స్పీడులో ఉంది. కొత్తగా ఒక రాష్ట్రాన్ని జేబులో వేసుకున్న గర్వంలో, రాజసూయం చేస్తున్నంత పరాక్రమ ఉద్రేకంలో ఉన్నది ఆ పార్టీ. హైదరాబాద్‌ను తమ జాతీయ కార్యవర్గం భేటీకి ఎంచుకోవడం, సమస్త పార్టీ, ప్రభుత్వ యంత్రాంగాలు వాలిపోయి తెలంగాణ అంతటినీ చుట్టేయడం ఇవేవీ ఏ ఉద్దేశం లేకుండా జరిగినవి కావు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రదర్శించిన ధిక్కారాన్ని ఏ మాత్రం గుర్తించకపోవడం ఓ వ్యూహం లేకుండా జరిగిందీ కాదు. నీతో మాకు సంవాద మేమిటి, మేము చేయదలచుకున్నది చేయగలిగినప్పుడు- అన్న ధోరణి అది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పక్కా అని ప్రకటించడంలో, తాము అనుకున్నది సాధిస్తామన్న సంకల్పం ఉన్నది. బహుశా అందులోని హెచ్చరిక, లేదా బెదిరింపు గులాబీ దళ నేతకు అర్థమయ్యే ఉంటుంది.

నిజానికి, రాజ్యాంగ ప్రక్రియల పాటింపు, లోకనింద భయమూ ఎంతో కొంత తప్పనిసరి అయినందునే, మరీ అఘాయిత్యంగా కనిపించే రకం ప్రభుత్వ కూల్చివేతలకు బీజేపీ పాల్పడ లేదు. అంటే, అస్సలు ప్రయత్నించలేదని కాదు, మరీ దూకుడుగా, జబర్దస్తీగా వ్యవహరించిన సందర్భాలున్నాయి. అరుణాచల్‌, ఉత్తరాఖండ్‌, గోవా వంటి తీవ్ర ఉదాహరణలు పక్కనపెడితే, మిగతా చోట్ల జనం ఏమనుకుంటున్నారో అన్న పట్టింపు ఉండింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఇప్పుడు మహారాష్ట్ర.. ఈ మూడు రాష్ట్రాల విషయంలో, బలాబలాల తూకంలో ఉన్న సమస్యను మొదటి దశలో బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవడానికి సమస్త న్యాయ, అన్యాయ పద్ధతుల ద్వారా ప్రయత్నించి, అది సాధ్యం కానప్పుడు వెనక్కి తగ్గినది. సమయం కోసం ఎదురుచూడడం ఒక పద్ధతిగా నడచింది. శాసన సభ్యులను కొనుగోలు చేయడం దగ్గరనుంచి, పార్టీలను చీల్చడం దాకా తరువాతి దశలో అనుసరించిన రాజనీతిలో ఎవరూ అవినీతి చూడడం లేదు. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పడడానికి ముందు జరిగిన తతంగంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఇప్పుడు జరిగిన శివసేన చీలిక, ఉద్ధవ్ పతనం పరిణామాలలో న్యాయ పరమైన జోక్యం జరగలేదు. బహుశా, అంతా పద్ధతి ప్రకారం జరిగిందన్న భావనే కారణం. తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్‌ను అవకతవకగా జరిపి, అభాసుపాలు కావడం కంటే, పద్ధతి ప్రకారం చేసి విజయం సాధించాలని బీజేపీ అనుకుంటోంది కాబోలు. తెలంగాణలో ఏమి జరిగినా కాంగ్రెస్ గెలవకూడదనేది బీజేపీ లక్ష్యం. ఆ ప్రధాన సూత్రానికి లోబడి, కేసీయార్‌ను దెబ్బ తీయాలి. ఇప్పటికిప్పుడు తెలంగాణలో పార్టీని పునాదుల నుంచి నిర్మించి, తామే పోటీ పడడం కంటే, మహారాష్ట్ర తరహా ఆపరేషన్లు ఏవో ఆలోచించడం మంచిదని అమిత్ షా అనుకుంటున్నారేమో! ప్రక్రియలను, పద్ధతులనూ పాటిస్తూ తనను దెబ్బతీయడం ఏమంత కష్టం కాదని కేసీయార్‌కు తెలుసును. అందుకే లోకనింద భయమే మోడి నుంచి తనను రక్షించాలని అనుకుంటున్నారు. ఒక వేళ ఎన్నికల కంటే ముందే, తన మీద కేంద్రం కానీ మోడి కానీ ఏదైనా చర్య తీసుకుంటే, తనలోని తప్పుల వల్ల కాక, తనతో ఉన్న రాజకీయ వైరంతోనే కక్ష సాధింపు చేస్తున్నారని ప్రజలముందుకు వెళ్ళడానికి ఉంటుంది. శివసేన విషయంలో ప్రజలు తటస్థంగా ఉండిపోయి, షిండేకు మార్గం సులభం చేశారు. తన విషయంలో అట్లా జరగకుండా, ప్రజలను తనవైపు సైద్ధాంతికంగా, రాజకీయంగా సమీకరించుకునే ప్రయ త్నం కేసీయార్ చేస్తున్నారు. బీజేపీకి తనను తాను ఎంతటి శత్రువుగా స్థిరపరచుకుంటే, తనకు అంత నైతిక బలం ఉంటుందని ఆయన ఆలోచన.

ప్రధాని హైదరాబాద్ రాక సందర్భంగా కేసీయార్ అనుసరించిన వైఖరిలోని తీవ్రతను చూసిన తరువాత, ఇదేదో, ప్రత్యర్థుల ఓట్లను చీల్చి, వచ్చే ఎన్నికలను గట్టెక్కడం వంటి ప్రయోజనాలకు ఉద్దేశించిన వైఖరి కాదేమో అనిపిస్తున్నది. టీఆర్‌ఎస్ – బీజేపీ పెద్ద స్థాయిలో కూడబలుక్కుని ఇవన్నీ చేస్తున్నాయనుకునే ఆలోచనలకు విలువ ఇస్తే తప్ప, ఇదంతా ఎన్నో అనూహ్య పరిణామాలకు దారితీయగల వ్యవహారం. మజ్లిస్ స్నేహాన్ని వదిలిపెట్టి, బీజేపీతో కలిస్తే, కేసీయార్‌కు వచ్చే నష్టమేమీ లేదు, ఆత్మ నిర్భరత తప్ప. కేసీయార్, బీజేపీ కలిస్తే, మజ్లిస్ ఓట్ల ప్రమేయం లేకుండానే గెలవవచ్చు. ఎట్లా గెలిచినా, బీజేపీ రాకుండా చేయడానికి కాంగ్రెస్‌తో, కాంగ్రెస్ రాకుండా చేయడానికి బీజేపీతో కలవవచ్చు. ఏమి చేసినా, మైల పడిపోయేంత విలువల మడి కట్టుకున్న నాయకుడు కాదాయన. అయినా కేసీయార్ తన ఉనికిని తాను అనుకున్న­ పద్ధతిలో నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే, ఆ పోరాటాన్ని మెచ్చుకోవచ్చు. అంతేకాదు, దేశం మొత్తం మీద మమతా బెనర్జీ తప్ప ఇంత గొంతుతో ప్రధానిని తిడుతున్న నాయకుడు మరొకరు లేరు. ప్రత్యామ్నాయాలూ ఫ్రంట్లూ కూటములూ లేకున్నా కానీ, అనుకున్నట్టుగానే బీయారెస్ మొదలుకాని పార్టీగా మిగిలినా సరే, మోడీతో తలపడిన నేతగా కొన్ని మార్కులు కేసీయార్ ఖాతాలో పడిపోయాయి. కాకపోతే, ఆయన పోరాటాల్లో ఆయన తప్ప ప్రజలు ఉండరు. తెలంగాణను ఒంటిచేత్తో సాధించినట్టు గానే, ఈ పోరాటాన్ని కూడా తాను ఒక్కడి గానే గెలిచేస్తారని అనుకుంటారు. కేవలం వాక్చాతుర్యంతోనే అన్నీ సాధించగలనని అనుకుంటారు.

తెలంగాణ మీద బీజేపీ కన్ను, కేవలం మరొక రాష్ట్రాన్ని దిగమింగడానికి మాత్రమే అనుకుంటే, పొరపాటు. తెలంగాణలో అధికారం ఆ పార్టీకి ఒక సైద్ధాంతిక ప్రతీకాత్మక విజయం అవుతుంది. అగస్త్యుడు వింధ్య దాటినంత విశేషం అది. కర్ణాటకలో ఇప్పటికే వేసిన పాగా బీజేపీకి ఏమంత పెద్ద విజయం కాదు. అది ఇంకా పూర్తిగా స్థిరపడనూ లేదు. కన్నడ సమాజం స్థిరపరచుకున్న సహజీవన, ప్రగతి శీల, సమభావనా విలువలను ఛిద్రం చేసే ప్రక్రియ మొదలయింది కానీ, ఉత్తరప్రదేశ్ మాదిరిగా మారిపోవడానికి ఆ రాష్ట్రం ఇంకా సిద్ధంగా లేదు. దక్షిణాది రాష్ట్రం కావడమే ఆ సంపూర్ణ పరివర్తనకు అవరోధంగా ఉన్నది. చరిత్ర లోని సమస్యాత్మక కోణాన్ని ఆధారం చేసుకుని, తెలంగాణ లో అధికారానికి నిచ్చెనలు వేయాలని చూస్తున్న బీజేపీ, ఇక్కడి పోరాటాల ఫలితంగా వచ్చిన ఆధునిక విలువలను అధిగమించి విస్తరించవలసి ఉన్నది.

ప్రాంతీయ పార్టీలను నిర్వీర్యం చేయడం, సాధ్యం కాకపోతే వాటిని తన కూటమిలో భాగమయ్యేట్టు చూడడం, ప్రాంతీయ సామాజిక లక్ష్యాలను అప్రధానం చేయడం, బీజేపీ రాజకీయ విస్తరణ వ్యూహంలోని అంశాలు. అంటే, ఒక రకంగా ప్రాంతీయ అభివృద్ధి ఆశయాలకు, జాతీయ లక్ష్యాలకు మధ్య వైరుధ్యం, పోటీ. ఈ పోటీలో కేసీయార్ తెలిసో తెలియకో ఘర్షణాత్మక వైఖరి తీసుకున్నారు. ఏమి జరుగుతుందో చూద్దాము అన్నట్టుగా తెలంగాణ ప్రజలు హైదరాబాద్‌లో మోహరింపులను చూశారు కానీ, మహాబలునితో తలపడే బలహీనుడంటే అందరికీ అంతిమంగా సానుభూతే కలుగుతుంది. ఆ మేరకు తెలంగాణలో కేసీయార్ దే గెలుపు, మరి ఈ సన్నివేశాన్ని చూస్తున్న దేశవ్యాప్త పరిశీలకుల అంచనా ఏమిటో తెలియాలి!

మహారాష్ట్ర చేజిక్కించుకోవడంలో బీజేపీకి రెండు విజయాలు. ఒకటి రాష్ట్రం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జన్మస్థానం కేంద్ర స్థానం అయిన రాష్ట్రం, హిందుత్వ పరిధి నుంచి వెలిగా ఉండడం బీజేపీకి మొదటి నుంచి ఇబ్బందిగానే ఉండింది. రెండోది బాలీవుడ్. ఇక నుంచి కంగనా రనౌత్ వీరంగాన్ని తరచూ చూడవచ్చు. భారత దేశ కలల కార్ఖానా, మనోభావాల ఉత్పత్తి కేంద్రం అయిన బాలీవుడ్ మీద అదుపు కోసం బీజేపి ఎన్ని ప్రయత్నాలు చేసిందో తెలిసిందే. సామాజిక మాధ్యమాలలో దాడి మొదలుకుని, మాదక ద్రవ్యాల కుట్రలదాక అన్నీ బాలీవుడ్‌కు గురిపెట్టినవే. ఇప్పుడైనా, ఏ ఘర్షణా లేకుండా హిందీ సినీ పరిశ్రమ లొంగిపోతుందని చెప్పలేము. శివసేన చీలిక మాత్రం ప్రాంతీయ పార్టీగా దాని పరాజయమే. ఒకనాడు రాష్ట్ర విభజన సందర్భంగా, గుజరాతీల ఆధిపత్యాన్ని వ్యతిరేకించిన మహారాష్ట్రీయులు ఇప్పుడు తిరిగి ముంబాయిని వారి అధీనం చేయవలసి రావచ్చు. గుజరాతీ కోణాన్ని పైకి తెచ్చి గగ్గోలు పెట్టే చొరవ కూడా లేని సాత్వికుడు ఉద్ధవుడు. అఘాడీ ప్రభుత్వంలో భాగమై, ఉద్ధవ్, తన పార్టీ స్వభావాన్నే మార్చే ప్రయత్నం చేశారు. కేంద్రం లోని బీజేపీకి కొన్ని విషయాల్లో గట్టి ప్రతిఘటన ఇచ్చాడు. మతతత్వం ఆధారం రాజకీయం చేస్తే, బీజేపీకి అది నకలు అయ్యే ప్రమాదం ఉండడంతో తన స్వంత ఉనికి కోసం, కేవల ప్రాంతీయ పార్టీగా రూపుదిద్దుకోవడం కోసం శివసేన ప్రయత్నిస్తూ వచ్చింది. చివరికి, ప్రమాదం బయటి నుంచి కాక లోపలి నుంచే వచ్చింది.

ధైర్యమో, దుందుడుకో కేసీయార్‌ను మెచ్చుకోవచ్చు కానీ, ముంబై ప్రమాదం తనకూ ఉన్నదని గుర్తించాలి. ఉద్ధవ్‌కు ఉన్న అవలక్షణాలే కేసీయార్‌కు వున్నాయి. ఎవరినీ కలవరు, వినరు, ఆమూల సౌధంబు దాపల ఎక్కడో ఉంటారు. పైగా, తన చుట్టూ పేర్చుకున్న రత్నాల తెలంగాణ బ్యాచ్ అంతా, అంగడి సరుకే. కాబట్టి కోటను బైటి నుంచి బందోబస్తు చేయడంతో పాటు, లోపల కూడా పారా హుషార్ ఉండాలి, అందరికీ అందుబాటులో ఉంటూ మంచీ చెడ్డా కనుక్కోవాలి. విమర్శలు విని తప్పులు దిద్దుకోవాలి. ఇంత వీరంగం     వేసి, ఇంత యుద్ధం చేసి, వెన్నుపోట్లు తెచ్చుకుంటే ఫలితమేమి?

Courtesy Andhrajyothi

Leave a Reply