కరోనా కలకలం: సీన్‌ రివర్స్‌..!

0
458

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్థారిత పరీక్షలు చేయించుకోమంటే ఇంటి యజమానిపై పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యా దు చేశాడో వ్యక్తి! తీరా పోలీసులు అతడికి పరీక్షలు చేయిస్తే వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది!! హైదరాబాద్‌లోని మలక్‌పేట గంజ్‌లో ఒకరిద్దరికి వైరస్‌ సోకిన సంగతి తెలిసిందే. ఆ కేసుల నేపథ్యంలో మార్కెట్‌ గంజ్‌నే మూసేశారు. అక్కడ పనిచేస్తున్న ఒక వ్యక్తి.. ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఒక ఇంట్లో అద్దెకుంటున్నాడు. అతడు మలక్‌పేట గంజ్‌లో పనిచేస్తాడని తెలిసిన ఇంటి యజమాని.. ‘నువ్వు కరోనా పరీక్షలు చేయించుకో..’ అని సూచించాడు. ఆ సూచనను అతడు పట్టించుకోకపోవడంతో.. ఇల్లు ఖాళీ చేయాలని ఇంటి యజమాని ఆదేశించాడు. దీంతో అతడు పోలీసులకు ఫోన్‌ చేసి ఇంటి ఓనర్‌పై ఫిర్యాదు చేశాడు. కరోనా వేళ ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నాడని పేర్కొన్నాడు.

రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి యజమానిని ప్రశ్నించగా.. అతడు మలక్‌పేట్‌ మార్కెట్‌ గంజ్‌లో పనిచేసిన విషయాన్ని ఆయన తెలిపాడు. ఇంటి యజమాని ఆందోళన సహేతుకమేనని భావించిన పోలీసులు అద్దెకుండే వ్యక్తికి పరీక్షలు చేయించగా.. వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో, ఆయన్ను అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని క్వారంటైన్‌కు తరలించారు. ఇంటి య జమానిని, అతని కుటుంబాన్ని, ఆ ఇంట్లో అద్దెకుంటున్న మిగతావారినీ ఐసోలేషన్‌లో ఉంచారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారు ఏ మాత్రం అనుమానం ఉన్నా వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. సహాయం కోసం 108 హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు.

Courtesy Andhrajyothy

Leave a Reply